యువభేరి మోగింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యువభేరి మోగింది

యువభేరి మోగింది

Written By news on Wednesday, September 16, 2015 | 9/16/2015


యువభేరి మోగింది
కలసి నడుద్దాం... హోదా సాధిద్దాం...
♦ విద్యార్థి యువభేరి సదస్సులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? ... గతంలో 11 రాష్ట్రాలకు ఇచ్చిన హోదా మనకెందుకు ఇవ్వరు?
♦ ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?

♦ కేంద్రంలో టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటే కేంద్రం దిగి వస్తుంది
♦ ఓటుకు కోట్లు కేసు మాఫీకోసం హోదా హక్కును పణంగా పెట్టారు
♦ హోదాకోసం వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం
♦ 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష
♦ మీరూ కలసిరండి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: 
ప్రత్యేకహోదా మన హక్కు... దాని సాధనకోసం కలసి ఉద్యమిద్దాం... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హోదా సాధిద్దాం.. అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని ప్రశ్నించారు. ఐదేళ్లుకాదు పదేళ్లు ప్రత్యేకహోదా తెస్తామని, ఇస్తామని ఎన్నికలముందు చెప్పిన టీడీపీ, బీజేపీ ఇప్పుడా ఊసెత్తడంలేదని విమర్శించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రత్యేకహోదా హక్కును కేంద్రానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా సాధించుకుందామన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం స్థానిక పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా- ఉద్యోగ అవకాశాలు- రాష్ట్రాభివృద్ధ అనే అంశంపై  విద్యార్థి యువభేరి సదస్సు నిర్వహించారు.

విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావేత్తలు పెద్దసంఖ్యలో హాజరైన ఈ సదస్సుకు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
 
ప్రత్యేకహోదా ఎందుకిచ్చారంటే...
అన్ని పార్టీలూ కలసి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టాయి. అప్పుడు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీలుగా ఉన్న నన్ను, మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేసి లోక్‌సభనుంచి గెంటేశారు. లోక్‌సభ తలుపులు మూసివేసి, టీవీ చానళ్ల ప్రసారాలు ఆపివేసి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో 95 శాతం హైదరాబాద్‌లోనే ఉంది.

బీటెక్, బీసీఏ, ఎంసీఏ చేసిన విద్యార్థులందరూ ఉద్యోగాలకోసం చూసేది హైదరాబాద్ నగరంవైపే. ఉమ్మడి రాష్ట్రంలోని 70 శాతం పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 70 శాతం ఉద్యోగాలు కూడా అక్కడే ఉన్నాయి. విభజనవల్ల హైదరాబాద్‌లాంటి గొప్ప నగరాన్ని ఏపీ కోల్పోతుంది. అందుకే ఆ నష్టాన్ని వీలైనంత భర్తీ చేసేందుకు రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు.

ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ డిమాండ్ చేశాయి. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని, తెస్తామని బీజేపీ, టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలిచ్చారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే అధికారంలో ఉన్నాయి. కానీ ప్రత్యేకహోదా గురించి మాత్రం నోరెత్తడంలేదు.
 
కేసులకు భయపడి హోదా తాకట్టు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాకోసం కేంద్రాన్ని నిలదీయాల్సి ఉంది. కానీ ఆయన ఎందుకు నోరుమెదపడంలేదు? ఓ 15 రోజులో, నెలరోజులో గడువిచ్చి, ఆలోపు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? నాతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న సందేహమిది. అయినా చంద్రబాబు నోరు మెదపరు.

ఎందుకంటే... పట్టిసీమనుంచి పోలవరం వరకూ కమీషన్లు తీసుకుని, జీవో-22తో కొందరు కాంట్రాక్టర్లకు మేలుచేసి, కొందరికే మద్యం డిస్టిలరీ లెసైన్సులిచ్చి, ఇసుకనుంచి మట్టిదాకా పర్సెంటేజీలు తీసుకుని, బొగ్గు దగ్గరనుంచి పలు స్కాములు చేసి... ఏపీలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు ఐదునుంచి రూ.20 కోట్ల లంచమిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం మనమందరం చూశాం.

ఆ కేసునుంచి బయటపడేందుకు చంద్రబాబు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఓట్లుకు కోట్లు కేసులో తనను జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు భయం. అందుకే తన స్వార్థం కోసం, కేసులనుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఐదుకోట్ల ప్రజలను, ప్రత్యేకహోదాను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టుపెడుతున్నారు. గతంలో ఇదే చంద్రబాబు సోనియాగాంధీతో కలసి నా మీద కేసులు పెట్టారు. కానీ నేను భయపడలేదు. చంద్రబాబు నాయుడులా రెండుకళ్ల సిద్ధాంతం చెప్పలేదు. పోరాటం చేశా. రాష్ట్రాన్ని విభజించవద్దని గట్టిగా నిలదీశా.
 
ప్రత్యేకహోదా గురించి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు అపహాస్యం చేస్తూ, వక్రభాష్యం చెబుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెబుతున్నారు. తన వాదన సమర్థించుకునేందుకు.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ అక్కాచెల్లెమ్మలను కించపరిచేలా మాట్లాడారు. ఆడపిల్లలకు తోడుంటానని చెప్పాల్సిన సీఎం మాట్లాడిన తీరిది. తనను తాను కాపాడుకోవడం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెడుతున్న బాబును మీరంతా ప్రశ్నించండి.

అయ్యా చంద్రబాబూ... ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మీరు చెప్తున్నవన్నీ, విభజన చట్టంలో హక్కుగా ఇచ్చిన హామీలు కాదా? అని నిలదీయండి. పోలవరం, మెట్రోరైలు, ఐఐఎం, ఐఐటీలన్నీ విభజన చట్టంలో హక్కుగా ఇస్తే... వాటిని కొత్తగా ప్యాక్ చేసి తానేదో సాధించానని మభ్యపెట్టాలని చూస్తున్న బాబును గట్టిగా ప్రశ్నించండి.

సాకులు చెబుతున్న ప్రభుత్వాలు...

ప్రత్యేకహోదాకు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర ఒప్పుకోవడంలేదంటారు. అయ్యా... రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఈ రాష్ట్రాలు లేవా? ఈ రాష్ట్రాలు ఒప్పుకోవని అప్పుడు మీకు తెలీదా? ప్రత్యేకహోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడంలేదని అబద్ధాలు చెబుతున్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలి, నాన్‌ప్లాన్ గ్రాంట్లు, లోన్లు ఎలా పంచాలన్నదే ఆర్థిక సంఘం పని.

ప్రత్యేకహోదాతో దానికి ఎలాంటి సంబంధం లేదు. హోదా ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి. ఎందుకంటే కేంద్ర మంత్రిమండలి, నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి... అన్నింటికీ సారథ్యం వహించేది ప్రధానమంత్రి. ఆదొక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే. కేబినెట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యేకహోదా ఇచ్చేయవచ్చు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చారు.

వాటన్నింటికీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని అమలు చేశారే తప్ప ఎక్కడా ఒక యాక్ట్ ద్వారా వచ్చింది కానేకాదు. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ను విభజించి, ప్రత్యేక హోదా ఇచ్చాక జాతీయ అభివృద్ధి సంఘానికి అనుమతి కోసం పంపారు. అవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని ప్రజలను మభ్యపెడుతున్నారు.
 
ప్రత్యేక హోదా వస్తే లక్షల్లో ఉద్యోగాలు...
ప్రత్యేకహోదావస్తే ప్రధానంగా రెండు లాభాలున్నాయి. రాష్ట్రానికి కేంద్రంనుంచి వచ్చే నిధులు 90 శాతం నిధులు గ్రాంటుగా, 10 శాతం రుణాలుగా వస్తాయి. అంటే గ్రాంటును తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు 70 శాతం నిధులు రుణాలుగా, 30 శాతం మాత్రమే గ్రాంట్లుగా వస్తాయి. అంటే రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతుంది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే భారీగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి.

100 శాతం ఎక్సైజ్ పన్ను, ఆదాయపు పన్ను  మినహాయింపు ఉంటుంది. అలాంటి సదుపాయాలున్నప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారు, పరిశ్రమలు స్థాపిస్తారు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వెళ్లి చూస్తే ప్రత్యేకహోదావల్ల జరిగిన మేలేమిటో తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో రెండువేల పరిశ్రమలు వచ్చాయి. రూ.30 వేలకోట్ల పెట్టుబడులతో 130 శాతం అధికంగా పరిశ్రమలు రావడంవల్ల ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పదివేల పరిశ్రమలు వచ్చాయి.

ఇవన్నీ చంద్రబాబుకు తెలిసినా ప్రత్యేకహోదా కోసం పట్టుపట్టకుండా పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికలకు ముందు రాష్ర్టంలో ఏ టీవీ పెట్టినా.. జాబు రావాలంటే బాబు రావాలంటూ వినిపించేది. జాబు ఇవ్వకపోతే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి. ఏ ఒక్కరికైనా జాబు వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? ఆయన ఉద్యోగాలివ్వరు. ప్రత్యేకహోదా వల్ల పరిశ్రమలు వస్తాయని తెలిసినా పట్టించుకోడు. రాష్ట్రాభివృద్ధితో, బిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటున్న చంద్రబాబు మనిషేనా?
 
హోదావస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్...
972 కిలోమీటర్ల సముద్ర తీరమున్న రాష్ట్రం మనది. ప్రత్యేకహోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఉద్యోగంకోసం మనం వెదుకులాడే పరిస్థితి నుంచి మనకు కావాల్సిన కంపెనీలో ఉద్యోగం చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి, విద్యార్థులకు కలిగే లాభమేమిటో ప్రతి విద్యార్థికీ తెలియాలి. తెలిసినవారు మరో నలుగురికి చెప్పాలి. మనహక్కుకోసం మనం కలసి పోరాడదాం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మంగళగిరిలో దీక్ష చేశాం. ఢిల్లీలో దీక్ష చేశాం. బంద్‌కు పిలుపునిచ్చాం. 26నుంచి గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తున్నా. వీటన్నింటితోపాటు మీ సహకారం కావాలి. అందరం కలసి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంనుంచి తన మంత్రులను ఉపసంహరించుకుంటానని ఏ రోజైతే చంద్రబాబు చెప్తాడో ఆ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివస్తుంది, ప్రత్యేకహోదా ఇస్తుంది. ఈ పోరాటంలో మనమంతా కలసికట్టుగా కృషిచేస్తే విజయం సాధిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తాం.
 
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలాంబాబు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి, ఎస్వీయూ విశ్రాంత అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఎం.సూర్యనారాయణరెడ్డి, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం మాజీ అధ్యక్షుడు కె.రాజారెడ్డి, కార్యదర్శి ఎం.రెడ్డిభాస్కర్‌రెడ్డి, పీలేరు డిగ్రీ కళాశాల లెక్చరర్ చంద్రయ్య, రాష్ట్ర ఆడిటింగ్ రిటైర్డ్ అధికారి మునిరాజ మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి,  పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు  దేశాయ్‌తిప్పారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్ సునీల్, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.
 
విద్యార్థులదే నాయకత్వం
ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి లోకం కదం తొక్కింది. తిరుపతిలో యువభేరి సదస్సును విజయవంతంగా నిర్వహించింది. సదస్సుకు పలువురు రాజకీయనాయకులు హాజరైనా ఆద్యంతం విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. వేదికపై కూడా విద్యార్థి నాయకులే ఎక్కువగా కనిపించారు. రాజకీయ నాయకులకు దిశా నిర్దేశం కలిగించేలా విద్యార్థుల ప్రసంగాలు నడిచాయి. విద్యార్థి ప్రతినిధులు లేఖశ్రీ, బి.తేజేశ్‌రెడ్డి ప్రసంగాలు ఆలోచన రేకెత్తిం చాయి.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన లభించింది. విద్యార్థుల కేరింతలు, చప్పట్లు, జై జగన్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ప్రభుత్వం ఆంక్షలు విధించి ఎస్వీయూలో అనుమతి నిరాకరించినా సదస్సుకు వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి ప్రత్యేకహోదా అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. హోదాకోసం ఉద్యమిస్తామంటూ, హోదా సాధిస్తామంటూ నినదించారు. రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు హోదా అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
 
హోదాకోసం విద్యార్థులు ఉద్యమించాలి
మనమంతా యువకులం. ఈ తరానికి చెందినవాళ్లం. పార్లమెంటులో ఏదైనా హామీ ఇస్తే అది నెరవేరుతుందని విశ్వసిస్తాం. పార్లమెంటును చూసి నేర్చుకోవాలనుకుంటాం. కానీ రాష్ర్ట విభజన జరిగిన సమయంలో పార్లమెంటు జరిగిన తంతు చూసి... ఇదా ప్రజాస్వామ్యమని భారతీయులుగా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది.

కానీ పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకి దిక్కూ దివాణం లేకపోతే మనమంతా ఎక్కడికి వెళ్లాలి? ఎవర్ని విశ్వసించాలి? కేంద్ర మంత్రుల్లో కొందరు ప్రత్యేకహోదా ఇస్తామంటారు, కొందరు రాదంటారు. చంద్రబాబు అది సంజీవని కాదంటారు. స్పీకర్ ఇది జిందా తిలిస్మాత్ కాదంటారు. అసలు ప్రత్యేకహోదా ఇస్తారో ఇవ్వరో స్పష్టంగా చెప్పకుండా ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో చదువులు పూర్తిచేసి ఉద్యోగాలకోసం ఎదురుచూసే విద్యార్థులు ప్రత్యేకహోదా వల్ల వచ్చే ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అందుకే యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరగాలి. విద్యార్థులు అవగాహన పెంచుకుని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలకు బుద్ధి వచ్చేలా, గడ్డిపెట్టేలా ఉద్యమించాలి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై విద్యార్థులకు అవగాహన కలగకూడదంటుంది. యూనివర్సిటీలో హోదాపై చర్చ జరగకూడదంటుంది. జగన్ వస్తున్నాడని తెలిసి వర్సిటీలో ఎలాంటి మీటింగులు జరగకూడదని హుకుం జారీ చేశారు సర్కారు పెద్దలు. అయ్యా చంద్రబాబూ...

తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ యూనివర్సిటీలో కాదా? ప్రధాని నరేంద్రమోదీతో మీరు సమావేశం పెట్టించింది ఈ వర్సిటీలో కాదా? యూనివర్సిటీలో రాజకీయ సమావేశాలు జరగకూడదని ఆరోజు గుర్తుకురాలేదా? ఈ సమావేశ వేదికపైన ఉన్నది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు. వచ్చింది విద్యార్థులు. ఇక రాజకీయం ఎక్కడుంది చంద్రబాబూ? మీ నిరంకుశ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే గట్టిగా బుద్ధి చెప్తారు.
Share this article :

0 comments: