బలవంతం చెల్లదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బలవంతం చెల్లదు

బలవంతం చెల్లదు

Written By news on Thursday, September 17, 2015 | 9/17/2015


బలవంతం చెల్లదు
రైతులకు ఇష్టం లేకుండా భూమి సేకరించే హక్కు ప్రభుత్వానికి లేదు: జగన్
సాక్షి, విజయవాడ బ్యూరో: పోర్టు పేరు చెప్పి 30 వేల ఎకరాలను బలవంతంగా రైతుల నుంచి తీసుకోవాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇష్టం లేకుండా ఒక్క ఎకరం కూడా వారి నుంచి తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. భూములు ఇవ్వనన్న వారిని పూర్తిగా వదిలేయాలని అన్నారు.

ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని,  మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమేనని బందరు పోర్టు బాధిత భూసేకరణ రైతులకు భరోసా ఇచ్చారు. కోర్టుల్లో కేసులు వేసి భూమిని ఆపుకుంటే.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పుడు ఒక్క ఎకరా కూడా అన్యాయంగా పోయే పరిస్థితి ఎవరికీ రానీయకుండా అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

పోర్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన బందరు మండలంలోని పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన రైతులు, మహిళలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తొలుత పెదకరగ్రహారంలో రైతుల గోడు విన్నారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు.
 
కేంద్ర ప్రభుత్వమే వెనక్కిపోయింది...
‘పెదకరగ్రహారం గ్రామంలో తీసుకునే భూములకు ఎంత పరిహారం ఇస్తామన్నది చెప్పలేదు. అయినా పోర్టు వస్తే ఎంతో కొంత మంచి జరుగుతుందని చెప్పి గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం అంతటితో ఆగకుండా సంవత్సరానికి రెండు, మూడు పంటలు పండే భూములు, రొయ్యల చెరువుల భూములు తదితర 30 వేల ఎకరాలను తీసుకుంటానంటోంది. ఇది నిజంగా అన్యాయం.

ఇళ్లు, ఊళ్లు, భూములు, మండలం మొత్తం ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారని అక్కాచెల్లెమ్మలు వాపోతున్నారు. మా కడుపు కొడతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం భయపడొద్దు. ఎవరూ మనకిష్టం లేకుండా మన భూములు తీసుకోలేరు. ఆగస్టు 31న ఆర్టినెన్స్‌కు చివరి రోజు, దానికన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఈ  భూముల మీద అధికారం మాదే అని వారనుకోవచ్చు. కానీ అది జరగదు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలు తట్టుకోలేక ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకుంది.

ఆర్డినెన్సే లేనప్పుడు చంద్రబాబుకు భూములు లాక్కునే అధికారం ఎక్కడిది? ఆయన చట్టానికంటే ఎక్కువా? అని అడుగుతున్నా. పోర్టు మాత్రమే కట్టండి. పోర్టు పేరు చెప్పి మా జీవితాలతో చెలగాటాలాడొద్దంటున్నారు. పోర్టు వరకూ మూడు వేలో, నాలుగు వేల ఎకరాలో తీసుకోండి. దానికి రైతులు వేరేచోట భూములు కొనుక్కునేందుకు ఎకరానికి రూ.30 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. అసైన్డ్ భూములు, ఎంజాయ్‌మెంట్ భూములకూ పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. పోర్టుకు అంగీకారం తెలుపుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్లు తీసుకుంటామంటే ఒప్పుకోమని చెబుతున్నారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
 
చట్టంలో మార్పులు తీసుకువస్తాం...
‘అసైన్డ్ భూములంటే వాళ్లత్తగారి సొత్తు అన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చన్నట్లుగా తయారైంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే,  ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే వచ్చి అడగాలి. పరిశ్రమ పెడతానంటున్నాడు, మీ భూములు ఇస్తారా అని అడగాలి. ఎవరైనా భూములు ఇవ్వమూ అంటే దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. కానీ ముఖ్యమంత్రి కన్ను ఊరి మీద పడితే భయమేసేలా ఈ ప్రభుత్వం తయారైంది. అసైన్డ్ భూమి లాక్కోవడం చట్టం ప్రకారం హక్కు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. ఈ చట్టంలో మార్పులు తీసుకొస్తాం. ఒకసారి వారికిచ్చిన భూములను(అసైన్డ్) మళ్లీ ఎలా తీసుకుంటారు’ అని ప్రశ్నించారు.
 
అన్ని రకాలుగా తోడుగా ఉంటాం...
పొట్లపాలెంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటా. ఆగస్టు 31న ఆర్డినెన్స్ వీగిపోతుందని తెలిసి, చంద్రబాబు భూములు తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆర్డినెన్స్‌ను కేంద్రమే వెనక్కు తీసుకుంటే ఈ పెద్ద మనిషి లేని చట్టాన్ని చూపించి రైతులను భయపెడుతున్నాడు. భూములు లాక్కునే అధికారం ఈ పెద్ద మనిషికి ఎక్కడుంది అని అడుగుతున్నా.

‘లా’ అనేదే లేనప్పుడు దేన్ని చూపించి చంద్రబాబు భూములు లాక్కుంటాడు? ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా తోడుగా ఉంటా. కేవలం మూడేళ్లు ఆగండి.. చూస్తాచూస్తా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది. మరో మూడు సంవత్సరాలు భూములు పోకుండా ఆపుకొంటే చాలు. ఆ తర్వాత ఒక్క ఎకరా కూడా మీ నుంచి పోకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత చంద్రబాబు ఉండడు.

మన ప్రభుత్వం వస్తుంది. ఈ మూడు సంవత్సరాలు ఒక్క ఎకరా పోకుండా అన్ని రకాలుగా మద్దతిస్తాం. అవసరమైతే ధర్నాలు, బంద్‌లు చేద్దాం. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులంతా అండగా ఉంటారు. మీరు ఎక్కడైనా ధర్నాలు చేయండి, అవసరమైతే దానికి నేను కూడా వస్తా’ అని రైతులకు భరోసా ఇచ్చారు.
 
గట్టిగా పోరాడతాం...
‘ఎన్నికలకు ముందు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసేస్తానన్నాడు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు పూర్తిగా తీసేస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి బాబు వస్తేనే జాబు వస్తుందని గోడలపై రాయించాడు. కానీ ఏ ఒక్కటీ చేయలేదు. అంతా మోసం. అలాగే బందరు పోర్టు భూసేకరణ కోసం అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇచ్చాడు. దీనిపై గట్టిగా పోరాడదాం. మీరూ వద్దు. మీ నోటిఫికేషన్ వద్దని ఒత్తిడి తెద్దాం. నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేద్దాం’ అని  జగన్ అన్నారు.

జగన్‌కు తమ ఆవేదన చెప్పుకొనేందుకు ఈ మూడు గ్రామాలప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని భూసేకరణ వల్ల ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని వివరించారు. వైఎస్ జగన్ వెంట ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, నాయకులు కేపీ సారథి, జోగి రమేష్, ఉప్పాల రాము, వేదవ్యాస్, తలశిల రఘురాం, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులున్నారు.
 
ముఖ్యమంత్రి అయ్యాడు.. కరువు వచ్చింది...
తుమ్మలచెరువు గ్రామంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘మన ఖర్మ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, కృష్ణా డెల్టాకు కరువొచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యి తనతోపాటు కరువునూ తీసుకొచ్చాడు. అంతటితో సంతోషపడలేదు. చివరికి రైతుల భూములను లాక్కునేందుకు ముందడుగు వేస్తున్నాడు. ఇవన్నీ ప్రభుత్వం కోసం కాదు. ప్రైవేటు వారికి, పారిశ్రామికవేత్తలకి, సింగపూర్ వాళ్లకి ఇచ్చేందుకు లాక్కోవాలని చూస్తున్నాడు.

మనకిష్టం లేకపోతే బలవంతంగా భూములు ఎవరూ లాక్కోలేరు. అన్ని విధాలుగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తాం. చంద్రబాబు భూములు బలవంతంగా తీసుకునేందుకు భయపడేలా ఒత్తిడి తీసుకొస్తాం. కోర్టులకు వెళదాం. కేసులు వేద్దాం. మన ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరికీ ఇటువంటి పరిస్థితి రాకుండా చూస్తానని చెబుతున్నా. ప్రభుత్వం ఏరకంగా ఉండాలనేది వీళ్లకి ట్యూషన్ చెప్పాలి. ఏదైనా భూమి కావల్సివస్తే ముందు రైతులను అడగాలి. వారు ఇస్తే భూములు తీసుకోవాలి. వారు కోరిన రేటు పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పించాలి. అయినా రైతులు ఒప్పుకోకపోతే ఆ భూమిని వదిలేయాలి’ అని అన్నారు.
 
రైతుల ఆవేదన ఇదీ..
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘భూముల కోసం మా ఊళ్లలోకొస్తే ఎవరినీ తిరిగి వెళ్లనీయం. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం. ప్రాణమైనా ఇస్తాంగానీ భూమిని మాత్రం వదులుకోం. చంద్రబాబు వస్తే పోర్టు వస్తుందనుకుని ఓట్లేశాం. తీరా వచ్చాక మాకు జీవి తమే లేకుండా చేస్తున్నడు’ అని బందరు పోర్టు భూసేకరణ బాధితులు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బందరు తీరగ్రామాల్లో ఆయన పర్యటించారు. పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల వారు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకునేందుకు తరలివచ్చారు. వారి కెంత భూ మి ఉంది? ఏ పంటలు సాగవుతాయి? ఎంత ఆదాయం వస్తుంది?.. వంటి విషయాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.
 
ఊరునే లేకుండా చేస్తారా?
పోర్టు కోసం భూములివ్వడానికి గ్రామసభ పెట్టి ఆమోదించాం. కానీ ఊరంతా ఇచ్చేయాలంటున్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి భూసేకరణ నోటిఫికేషన్ పేపర్లను ఇచ్చారు. వాటిని చూశాక చాలామంది మంచాన పడ్డారు. పోర్టుకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతో మా ఊరునే లేకుండా చేస్తారా?
- కళ్యాణి, పెదకరగ్రహారం సర్పంచ్
 
ఎలా బతకాలి? ఎక్కడికెళ్లాలి?
నాకున్న ఎకరం భూమిని ఇచ్చేయమంటున్నారు. ఇద్దరం అన్నదమ్ములం. భూమి పోతే ఇద్దరం రోడ్డున పడతాం. ఈ వయసులో మేం ఎక్కడికెళ్లాలి? ఎలా బతకాలి? ఎకరం పొలానికి 35, 40 బస్తాల ధాన్యం పండిస్తాం. అది లేకుండా చేస్తామంటున్నారు.
-టి.రాముడు,పెదకరగ్రహారం రైతు
 
ఎందుకు ఓట్లు వేశామా అనిపిస్తోంది
మా భూముల్ని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లేశామా అని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాం. మీ నాయనగారు దయాబిక్ష వల్ల నా కొడుక్కి రూ.5.5 లక్షలతో ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు ఏమీ ఇవ్వకపోయినా ఉన్నది లాక్కుంటున్నారు. మీరు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.
- సత్యసాయిబాబు, చిన్నాపురం
Share this article :

0 comments: