చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎలాంటి చికిత్స చేయలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎలాంటి చికిత్స చేయలేదు

చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎలాంటి చికిత్స చేయలేదు

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015


అండగా ఉంటా..

ఆర్యాపురం/దానవాయిపేట (రాజమండ్రి):  గండేపల్లి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబసభ్యులను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా, కనీసం వారి సంతకాలైనా తీసుకోకుండా పోలీసులు బలవంతంగా గ్రామాలకు తరలించారని తెలుసుకున్న జగన్..

మరీ ఇంత ఘోరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి ఆవరణలో నిరసనకు దిగిన మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. శృంగవరానికి చెందిన మృతుడు కల్లు బాబ్జీ(20) తల్లి నూకరత్నం జగన్‌ను చూసి బోరున విలపించింది. ‘వృద్ధాప్యంలో పోషిస్తున్న ఒక్కగానొక్క కొడుకూ చనిపోయాడు. నాకేది ఆధారం?’ అంటూ కన్నీరుమున్నీరైంది. ఆమెను ఓదారుస్తూ ప్రభుత్వం నుంచి పూర్తి పరిహారం వచ్చేంతవరకు అండగా ఉంటానని జగన్ భరోసానిచ్చారు.

అంతకు ముందు ఈ ఘోర దుర్ఘటన విషయం తెలిసి చలించిన జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.
 
కుటుంబీకులు ఆసుపత్రిలో.. మృతదేహాలు ఊళ్లకు
ఈ దుర్ఘటనలో మృతి చెందిన తమ తండ్రి కట్టా రాంబాబు(45) ముఖం కూడా చూపించకుండానే పోస్టుమార్టం చేసి ఊరికి తీసుకువెళ్లిపోయారంటూ వి.జె.పురానికి చెందిన దేవి, వెంకట్రావు జగన్ వద్ద రోదించారు. తాము ఇక్కడ ఉండగానే తమకు కనీసం సమాచారం అందించకుండా మృతదేహాన్ని ఊరికి తెసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తెలుసుకుని చలించిన జగన్ వారిని ఓదారుస్తూ రక్తసంబంధీకుల సంతకాలు చేయించకుండా పోస్టుమార్టం ఎలా చేశారని ప్రశ్నించారు.  
 
మీరొస్తున్నారనే సెలైన్ పెట్టారు: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. వారిని అడిగి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పలువురు క్షతగాత్రులు ‘మీరొస్తున్నారని తెలిసిన తరువాతే దుప్పట్లు మార్చి సెలైన్లు పెట్టారు’ అని చెప్పారు. మరోవైపు ఈ దుర్ఘటనలో గాయపడ్డ అచ్చంపేటకు చెందిన పురందాసు రాజును బొల్లినేని ఆస్పత్రికి తరలించారు.

క్యాజువాలిటీలోనే ఉంచారు. చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎలాంటి చికిత్స చేయలేదు. ఈ సమయంలో అతన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అతన్ని ఏసీ రూమ్‌కు తరలించారు. రాజును పరామర్శించిన జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: