196 మండలాలే కరువు ప్రాంతాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 196 మండలాలే కరువు ప్రాంతాలా?

196 మండలాలే కరువు ప్రాంతాలా?

Written By news on Thursday, October 29, 2015 | 10/29/2015


ఏపీ కరువుతో అల్లాడుతోంది
196 మండలాలే కరువు ప్రాంతాలా?: వాసిరెడ్డి పద్మ

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలూ కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే.. కేవలం 196 మండలాల్నే కరువు ప్రాంతాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించడం నయవంచన, మోసం తప్ప మరొకటి కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ధ్వజమెత్తింది. తక్షణమే యావత్ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సాయంకోసం కేంద్రం వద్దకు వెళ్లాలని, అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరువుపై ఏం కార్యాచరణ చేపట్టబోతున్నారో వారంరోజుల్లో వెల్లడించాలన్నారు. ఆగస్టు 18న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా చేసిన ప్రకటనలో రాష్ట్రంలో 325 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారని, అలాంటిది తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటనలో సగానికిసగం తగ్గించి 196 మండలాల్లోనే కరువుందని వెల్లడించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.

 ఎంత దారుణం..
 శ్రీకాకుళం మొత్తం కరువు విలయతాండవం చేస్తూంటే కేవలం 10 మండలాల్లోనే కరువు ఉందంటారా? ఎంత దారుణమని పద్మ ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ 8 లక్షల ఎకరాల్లో మరొక్క తడి నీరందకపోతే వరికంకులు మాడిపోతాయని, ప్రభుత్వం మాత్రం చుక్క నీరందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక జలసిరితో కళకళలాడుతుంటే.. దిగువ రాష్ట్రమైన ఏపీ, కృష్ణాడెల్టా, రాయలసీమ ఎండిపోతోందన్నారు. సీఎం చంద్రబాబు పొరుగురాష్ట్రమైన కర్ణాటకకు ఇక్కడి పరిస్థితి వివరించి కృష్ణా నీటిని విడుదల చేయాలని ఎందుకు కోరట్లేదని, ఈ విషయంలో కేంద్రంద్వారా ఎందుకు ప్రయత్నించట్లేదని ఆమె ప్రశ్నించారు. 

 ఇది మరో వంచన...
 ఇప్పటికే రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించి రైతుల్ని వంచించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కరువు మండలాల ప్రకటనలోనూ మరోసారి వంచించిందని పద్మ విమర్శించారు. ప్రతికూల వ్యవసాయ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాల వద్దకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళుతుంటే అధికారపార్టీ ఎగతాళి చేయడం దారుణమన్నారు. అసలు పంటలు తగులబడే పరిస్థితులు ప్రభుత్వమే కల్పిస్తున్నపుడు జగన్ తప్పక రైతులకు అండగా ఉంటారన్నారు.
Share this article :

0 comments: