చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 26న నిరసనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 26న నిరసనలు

చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 26న నిరసనలు

Written By news on Sunday, October 25, 2015 | 10/25/2015


చార్జీల పెంపునకు వ్యతిరేకంగా 26న నిరసనలు
 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పది శాతం మేరకు ఆర్టీసీ చార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సు డిపోల ముందు నిరసన ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను 25వ తేదీ అర్ధరాత్రి లోపు తగ్గించాలని, లేదంటే 26వ తేదీన 13 జిల్లాల్లోని డిపోల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేసి నిరసనలు చేస్తాయని తెలిపారు. చార్జీల పెంపుపై ఇది తమ పార్టీ తొలి దశ సమరమేనని, తదుపరి ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

గతంలో రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు చార్జీలు పెంచినపుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే ఇలా చేశామని చెప్పారని గుర్తుచేస్తూ... మరి ఇపుడు ధరలు తగ్గితే చార్జీలెందుకు పెంచారని ప్రశ్నించారు. తన పార్టీకి చెందిన, తన బినామీలైన ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌తో పాటు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చర్చ జరుగుతున్నపుడు సందట్లో సడేమియాలా చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన చెప్పారు.

 తోటను దగ్ధం చేస్తున్నది ప్రభుత్వమే...
 రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు భూమి ఇవ్వడానికి నిరాకరించిన చంద్రశేఖరరావు అనే రైతు చెరుకు తోటను తగులబెట్టించింది రాష్ట్ర ప్రభుత్వమేనని అంబటి ఆరోపించారు. తన భూమిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాధికారులు కోరినా తానివ్వలేదని అందుకే తోటను దగ్ధం చేశారని సాక్షాత్తూ రైతే చెప్పారన్నారు. రాజ ధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని కొందరు మాత్రమే స్వచ్ఛందంగా ఇచ్చారని, ఎక్కువమందిని బెదిరించి లాక్కున్నారని తాము చెప్పింది ముమ్మాటికీ నిజమని తెలిపా రు. గతంలోనూ దగ్ధం చేయించిందన్నారు.

 ఆర్టీసీని దెబ్బతీయడానికే చార్జీల పెంపు: తమ్మినేని మండిపాటు
 ఆర్టీసీని దెబ్బ తీసి ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించడానికే ఆర్టీసీ బస్సు చార్జీలను టీడీపీ ప్రభుత్వం పెంచిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఎలాంటి చార్జీలు, ముఖ్యంగా ఆర్టీసీ చార్జీలు పెంచేదే లేదని చంద్రబాబు ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఇపుడు అమాంతం పెంచేశారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 116 డాలర్ల నుంచి 44 డాలర్లకు పడిపోతే బస్సు చార్జీలు పెంచడం ఏమిటని  ప్రశ్నించారు. 14 వేల గ్రామాల ప్రజలపై ఆర్టీసీ చార్జీల పెంపు భారం పడిందని, ఇకపై వారందరూ ఆటోల్లో వెళ్లాలా అని నిలదీశారు. సామాన్యుని నడ్డి విరిచే విధంగా చేసిన ఈ భారాన్ని తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు. డీజిల్‌పై అదనంగా రూ. 4లు వ్యాట్ విధించి ధరలు పెంచిన చంద్రబాబు మద్యం ధరలను తగ్గించారని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: