ప్రత్యేకహోదా రావడంతో ఒకేసారి రూ.30 వేలకోట్లు పెట్టుబడులు వచ్చాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేకహోదా రావడంతో ఒకేసారి రూ.30 వేలకోట్లు పెట్టుబడులు వచ్చాయి

ప్రత్యేకహోదా రావడంతో ఒకేసారి రూ.30 వేలకోట్లు పెట్టుబడులు వచ్చాయి

Written By news on Thursday, October 8, 2015 | 10/08/2015


హోదా వచ్చేదాకా పోరు ఆగదు
‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
 
"పత్యేకహోదావల్ల రాష్ట్రానికి జరిగే మేలుకు ఉదాహరణ హిమాచల్‌ప్రదేశ్. అది మనకన్నా చిన్న రాష్ట్రం. ప్రత్యేకహోదా రావడంతో ఒకేసారి రూ.30 వేలకోట్లు పెట్టుబడులు వచ్చాయి. 130శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఫలితంగా 490శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ విషయం నేను చెప్పడంలేదు, ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికలో ప్రచురించారు."

 ‘‘ప్రత్యేకహోదా మన రాష్ట్రం పాలిట సంజీవని. అందుకే హోదా కోసం అందరం కలిసికట్టుగా రాష్ట్రంలో బంద్ చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాం. మంగళగిరిలో సమరదీక్ష చేశాం. మన ఆవేదనను, ఆకాంక్షలను దేశ ప్రజలకు తెలిపేందుకు  ఢిల్లీలో దీక్ష చేశాం. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పందనలేదు. అందుకే.. పిల్లల ఉద్యోగాల కోసం... వారి భవిష్యత్తు కోసం... ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవాలన్న ఆశయంతో ఇవ్వాళ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా. హోదా సాధించేవరకూ ఈ పోరు ఆగదు.

అందరం కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించుకుందాం’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఆయన బుధవారం గుంటూరులో నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు.అంతకుముందు ఆయన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్‌లోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానని చంద్రబాబు అల్టిమేటమ్ ఇచ్చి ఒత్తిడి తీసుకొస్తే, కేంద్రం కచ్చితంగా దిగివచ్చి హోదా ఇస్తుందని చెప్పారు.

అలా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని,అలా అల్టిమేటం ఇచ్చిన 24 గంటలలోపు జైలుకు వెళతానేమోనని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో మనం పోరాటం ఆపకూడదని, చంద్రబాబు మనసు మార్చుకుని కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెచ్చేవరకూ పోరు కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అపారమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ‘నో వేకెన్సీ’ బోర్డు  కనిపించదన్నారు. రాష్ట్రానికి అక్షరాలా సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి అక్కా చెల్లెళ్లకు, ప్రతి అవ్వా తాతలకు, సోదరులకు, స్నేహితులకు పేరు పేరునా శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నానని జగన్ వినయం గా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే....

 ప్రధాని తలచుకుంటే ప్రత్యేకహోదా
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవనిలా నిలుస్తుంది. రాష్ట్రంలో డిగ్రీ తీసుకున్న ప్రతీ విద్యార్థి ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తారన్న సంగతి అందరికీ తెలుసు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు 95శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నదీ తెలుసు. 70శాతం పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయన్న సంగతీ తెలుసు. అలాంటి హైదరాబాద్ నగరం మనకు దూరమైతే యువతకు ఉద్యోగాలు రావన్న సంగతీ తెలుసు. అన్నీ తెలిసీ ఆ రోజు పార్లమెంటులో తలుపులు మూసి, టీవీలు ఆపి అడ్డగోలుగా మన రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకుంటామని అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.

తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామనీ, తెస్తామనీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ ఊరూరా చెప్పాయి... మేనిఫెస్టోల్లో పెట్టారు...  కరపత్రాలు పంచారు... ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి రాగానే  మాట మారుస్తున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వడానికి తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా ఒప్పుకోవడంలేదని సాకు లు చెబుతున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ప్రత్యేకహోదా హామీ ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రాలన్నీ లేవా?

 చివరకు 14వ ఆర్థికసంఘం ఒప్పుకోవడంలేదని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాలా లేదా అన్నది ఆర్థికసంఘం పరిధిలోనిది కాదు. కేంద్రం వసూలు చేసే పన్నులు రాష్ట్రాలకు ఎలా పంచాలన్నదే, నాన్‌ప్లాన్ గ్రాంట్లు, రుణాలు ఎలా కేటాయించాలన్నదే ఆర్థికసంఘం పని. హోదా ఇవ్వాలా లేదా అన్నది జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళికా సంఘం, కేంద్ర మంత్రి మండలి,నీతి ఆయోగ్ పరిధిలోనిది. వీటన్నిం టికీ అధ్యక్షుడు ప్రధానమంత్రి. అలాంటప్పుడు ప్రధాని నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు రాదని ప్రశ్నిస్తున్నా.

 హోదాతో ‘నో వేకెన్సీ’ బోర్డు కనిపించదు
 {పత్యేకహోదా వల్ల ప్రధానంగా రెండు మంచి కార్యక్రమాలు జరుగుతాయి. హోదా ఉన్న రాష్ట్రానికి 90శాతం కేంద్ర నిధులు గ్రాంటుగా ఇస్తారు.10శాతమే రుణంగా ఉంటుంది. కేంద్రమిచ్చే గ్రాంటు 90శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. హోదా లేని రాష్ట్రమైతే కేవలం 30శాతం గ్రాంటుగా, 70శాతం రుణంగా ఉంటుంది. అలా ప్రత్యేకహోదావల్ల రాష్ట్రానికి రుణభారం తగ్గుతుంది, రాష్ర్టం బాగుపడుతుంది.
 విభజన చట్టంలో మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రోరైళ్లు, విద్యాసంస్థలు కట్టిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఉదాహరణకు హంద్రీ-నీవా, గాలేరు, వెలిగోడు ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే కనీసం రూ.10వేల కోట్లు కావాలి. చంద్రబాబు కేంద్రం దగ్గరకు వెళ్లి వీటిని ఏఐబీపీ (యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్)లో పెట్టిస్తే... ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రానికి 90శాతం గ్రాంటుగా ఇస్తారు. హోదా లేకపోతే వీటిని ఏఐబీపీలో చేర్చినా గ్రాంటు 25 నుంచి 55శాతం లోపే ఉంటుంది.

 విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరికి మెట్రోరైలు కట్టిస్తామన్నారు. రెండోది విశాఖలో కట్టిస్తామన్నారు. ఇందుకు సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చవుతుంది. అదే ప్రత్యేక హోదా ఉంటే.. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద జపాన్, సింగపూర్ లేదా మరోదేశంనుంచి రుణం తెచ్చుకుంటే.. ఆ డబ్బు మనం కట్టాల్సిన పనిలేదు. వడ్డీకూడా కట్టాల్సిన పనిలేదు. 90% గ్రాంటుగా ఇస్తుంది. అదే ప్రత్యేకహోదా లేకుండా ఆ దేశాలనుం చి తెచ్చుకున్న రుణం, వడ్డీ మనమే కట్టాల్సి వస్తుంది.

ఇక రెండో మేలు.. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే పరిశ్రమలకు రాయితీలు ఇస్తారు. ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టినవారికి 100శాతం ఆదాయపు పన్ను, ఎక్సయిజ్ డ్యూటీ మినహాయింపు ఇస్తారు. రవాణా చార్జీలు కూడా తిరిగిస్తుంది. 20ఏళ్లపాటు విద్యుత్తు సగం ధరకే లభ్యమవుతుంది. అందుకే ఆ రాయితీలకోసం పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. 972 కిలోమీటర్ల సముద్ర తీరమున్న మన రాష్ట్రానికి రూ.లక్షలకోట్లు పెట్టుబడులుగా తీసుకొస్తారు. మన పిల్లలకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడా ‘నో వేకెన్సీ’ బోర్డు కనిపించదు. అన్నిచోట్లా ‘వాంటెడ్’ బోర్డులే కనిపిస్తాయి. మన పిల్లలు వారికి నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చు.

 కేసులకు భయపడి హోదా తాకట్టు...
 ప్రత్యేకహోదా అంటే ఏమిటో, దానివల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు, ఆయన ఎమ్మెల్యేలకు తెలుసో తెలియదో... ఒకవేళ తెలిసుంటే ప్రత్యేకహోదా తీసుకురావాలని చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోవడంలేదని గట్టిగా అడుగుతున్నా. ప్రత్యేకహోదా సంజీవని కాదనీ, దాని వల్లనే అన్నీ రావనీ చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు.

అసలు చంద్రబాబు హోదాకోసం ఎందుకు పోరాటం చేయడంలేదంటే... ఏపీలో పట్టిసీమనుంచి పోలవరం దాకా, బొగ్గునుంచి ఇసుక దాకా లంచాలు, మద్యం లెసైన్సులిచ్చేందుకు ముడుపులు తీసుకున్నారు. ఆ డబ్బుతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.ఐదు కోట్ల నుంచి 25కోట్ల వరకూ ఇవ్వజూపి, సూట్‌కేసుల్లో డబ్బు పంపి... వీడియో ఆడియోల్లో అడ్డంగా దొరికిపోయాడు. ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ ఆయనన్న మాటలు విని ఎంత గొప్ప ఇంగ్లిషు మాట్లాడారో మా ముఖ్యమంత్రి అని ప్రజలు నవ్వుకున్నారు.ఆ కేసునుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కేంద్రం ముందు ప్రత్యేకహోదాను పణంగా పెట్టారు.

{పతిపక్షంలో ఉన్న నాయకులను ఇబ్బందిపెట్టేందుకు కేసులు పెట్టడం కొత్తేం కాదు. గతంలో రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని రక్షించి, అధికారంలో ఉన్న సోనియాగాంధీతో కుమ్మక్కై చంద్రబాబు నాపై కేసులుపెట్టారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి నాపై కుట్రలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంతవరకూ, కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ జగన్ మంచివాడే. రాజశేఖరరెడ్డీ మంచివాడే. జగన్ కాంగ్రెస్‌ను వదిలిపెట్టగానే ఇద్దరూ మంచివాళ్లు కాకుండా పోయారు. నాపై కుట్రలు పన్ని కేసులు పెట్టారు. అయినా నేను భయపడలేదు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని గట్టిగా మాట్లాడాను. కానీ చంద్రబాబు కేసులకు భయపడి ప్రత్యేకహోదాను ప్రధాని కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు. హోదా కోసం డిమాండ్ చేసిన 24 గంటల్లో జైలుకు పోతానేమోనని భయపడుతున్నారు.

 నిరుద్యోగులకు ద్రోహం
 చంద్రబాబు పరిపాలనంతా మోసం.. దగా... వెన్నుపోటు. ఎన్నికలకు ముందు రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. కానీ రైతులనూ, ఆడపడుచులనూ నిలువునా మోసం చేశారు. అవ్వాతాతల పెన్షన్లు కూడా ఇవ్వడంలేదు. ప్రతి ఒక్కరికీ ఇల్లన్నారు. కానీ కట్టిన ఇళ్లకు బిల్లులుకూడా ఇవ్వడంలేదు. జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ప్రతి టీవీలోనూ ప్రకటనలిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలా మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి జాబు సంపాదించుకున్న చంద్రబాబు... ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్నవి కూడా తీసేస్తున్నారు. అందుకే ఉద్యోగమన్నా ఇవ్వు, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వమని రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లలోని వాళ్లు చంద్రబాబును నిలదీస్తున్నారు.

రాష్ట్రంలో లక్షా 42 వేల 828 ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని విభజన సమయంలో లెక్కలు చూపించారు. డీఎస్సీ పరీక్షలు రాసి ఫలితాలు ప్రకటించినా ఇప్పటివరకూ భర్తీ చేయలేదు. క్లస్టర్ విధానమంటూ ఉన్న పాఠశాలలను, హాస్టళ్లనూ తగ్గించి, మిగులు ఉద్యోగాలు ఉన్నాయని చెబుతున్నారు. అలా డీఎస్సీ ఉద్యోగులకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల కోసం వేలాది, లక్షలాదిమంది నిరుద్యోగులు పట్టణాలు, నగరాల్లో వేలాది రూపాయలు వెచ్చించి, సంవత్సరాలు తరబడి కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం సరికాదు కదా కనీసం కేలండర్ కూడా విడుదల చేయలేదు.

 చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని రాష్ట్రంలోని రెండు లక్షలమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఓటేశారు. తల్లిదండ్రులకు చెప్పి ఓట్లేయించారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎడాపెడా ఆ ఉద్యోగాలు తీసేస్తున్నారు. దాదాపు 35 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 30 వేల మంది ఆదర్శ రైతులను ఉద్యోగాలనుంచి తీసేశారు. ఊర్లో ప్రతి కార్యక్రమానికీ సహకరించే 42వేలమంది సంఘమిత్ర జీతాలను రూ.నాలుగు వేలనుంచి రూ.రెండువేలకు కత్తిరించి రోడ్డున పడేశారు. దీంతో ప్రత్యేక హోదా వస్తుందో రాదోనన్న భయంతో నెల్లూరులో లక్ష్మయ్య, తిరుపతిలో మునికోటి, కృష్ణాజిల్లాలో ఉదయభాను, కర్నూలులో లోకేశ్వరరావు, నెల్లూరులో రామయ్య మృతిచెందారు. వీరిలో కొందరు పిల్లలు కాగా, మరికొందరు తండ్రులు. అందుకే ఈ దుష్టపాలనకు చరమగీతం పాడాలి. మనందరం కలిసికట్టుగా పోరాడి బంగాళాఖాతంలో కలిపేద్దాం. .

 కేబినెట్ ఆమోదంతోనే ఉత్తరాఖండ్‌కు ప్రత్యేకహోదా
 ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు ప్రత్యేకహోదా ప్రసక్తే లేదు. కానీ ప్రధానిగా వాజ్‌పేయి కేంద్ర కేబినెట్‌తో ఆమోదింపజేసి,దాన్ని అమలు చేయమని ప్రణాళికా సంఘానికి పంపించారు. అలాగే మార్చి 2, 2014న అప్పటి యూపీఏ కేబినెట్ కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇమ్మని ప్రణాళికా సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత మేలో ప్రధాని  అయిన మోదీ డిసెంబర్‌లో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. అంటే ఏడు నెలలపాటు ఏపీ ప్రత్యేకహోదా ఫైలు ప్రణాళికా సంఘంలో ఉన్నా ప్రధాని పట్టించుకోలేదు. ఆ తర్వాత మరో ఏడాదైనా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.

{పత్యేకహోదావల్ల రాష్ట్రానికి జరిగే మేలుకు ఉదాహరణ హిమాచల్‌ప్రదేశ్. అది మనకన్నా చిన్న రాష్ట్రం. ప్రత్యేకహోదా రావడంతో ఒకేసారి రూ.30 వేలకోట్లు పెట్టుబడులు వచ్చాయి. 130శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఫలితంగా 490శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ విషయం నేను చెప్పడంలేదు, ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికలో ప్రచురించారు.
Share this article :

0 comments: