పోరు ఆగదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోరు ఆగదు

పోరు ఆగదు

Written By news on Thursday, October 1, 2015 | 10/01/2015


పోరు ఆగదు
♦ టంగుటూరు పొగాకు ధర్నాలో వైఎస్ జగన్
♦ రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబు
♦ రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్న వైఎస్సార్

 సాక్షి, టంగుటూరు : పొగాకు రైతులకు న్యా యం జరిగే వరకూ ఈ పోరు ఆగదని, వారికి తుదివరకూ అండగా నిలబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న, గుండె ఆగి మరణించిన రైతు కుటుంబాలను ఆయన బుధవారం పరామర్శించారు. అనంతరం టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో పొగాకు వేలం జరుగుతున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పొగాకు బోర్డు పనితీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత రైతులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నపుడు రెండుసార్లు ప్రభుత్వం తరఫున పొగాకు రైతులను ఆదుకున్న విషయం గుర్తు చేశారు. గిట్టుబాటు ధర రాక కడుపు మండుతుంటే కడుపు కాల్చుకుని ధర్నాలో పాల్గొన్న రైతన్నలందరికీ... కడుపునిండా బాధ ఉన్నా, కష్టమనిపించినా రైతన్నల ఆక్రోశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలకు చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అనుకున్నది సాధిద్దామని రైతులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం ఆయన మాటల్లోనే....

 అధ్వాన్నంగా పొగాకు బోర్డు పనితీరు
 రాష్ట్రంలో పొగాకు బోర్డు నడుస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. పొగాకు వేలం జనవరిలో మొదలుపెట్టి జూన్‌కు ఆపేయాలి. కానీ అక్టోబర్ నెల వస్తున్నా వేలం పూర్తి కాలేదు. రైతన్నలు మూడునెలల్లో పండించిన పంటను అమ్ముకోవడానికి పది నెలలు పడుతోంది. జూన్ దాటిన తర్వాత వర్షాలు పడతాయి, దీనివల్ల పొగాకులో తేమ శాతం పెరిగి పొగాకు రంగు మారి, ధర తగ్గిపోతుందని తెలిసి కూడా అక్టోబర్ వరకూ పొగాకు అమ్మకాలు జరిపిస్తున్నారు. ఈ రోజు పొగాకు ధరలు పరిశీలించేందుకు టంగుటూరు వేలం కేంద్రానికి వెళ్లా. అక్కడ నా కళ్లముందే వేలం నిర్వహించారు. వేలం జరిగేటప్పుడు మన అందరికీ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఉదయం నేను రాకముందు ఎఫ్-9 గ్రేడ్ పొగాకు ధర రూ.34 అని బోర్డుపైన కనపడుతూ ఉంది. వేలం వద్ద నేను నిలబడ్డా.

అదే గ్రేడ్ పొగాకును నా కళ్లెదుటే రూ.65కు పాడారు. ఇదే గ్రేడ్ పొగాకు గతేడాది కిలో రూ.80 పలికిందని అధికారులు చెప్పారు. జిల్లాలో గత ఏడాది కిలో పొగాకు రూ.109 పలికితే, ఈ ఏడాది సగటు ధర రూ.90.90 మాత్రమే. రూ.109కి రూ.90.90 పోలికెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఇదే పొగాకు ధర సగటున రూ.101.16 అని చెబుతున్నారు. ప్రస్తుతమున్న 172 మిలియన్ కిలోల లక్ష్యాన్ని 120 మిలియన్ కిలోలకు తగ్గించాం కాబట్టి వచ్చే ఏడాది పొగాకు ధర బావుంటుందని బోర్డు చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు చెబుతున్న ఈ లెక్కలు నిజమే అయితే... గత ఏడాది 213 మిలియన్ కిలోలుగా ఉన్న లక్ష్యాన్ని 172 మిలియన్ కిలోలకు తగ్గించినా ధర ఎందుకు తగ్గింది? ఇప్పుడు 120 మిలియన్ కిలోలకు తగ్గిస్తే ధర పెరుగుతుందని మొసలి కన్నీరెందుకు కారుస్తున్నారని ప్రశ్నిస్తున్నా.

 రుణమాఫీ చేయని చంద్రబాబు
 రైతులు ఏడెకరాలకు ఒక బ్యారన్ పెడతారు. కనీసం ఐదెకరాలకు ఒక బ్యారన్ పెడితే, ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 50 క్వింటాళ్లు పండితే, బ్యాంకులు రూ.ఐదు లక్షల రూపాయల వరకూ రుణం ఇస్తున్నారు. ఇప్పుడు లక్ష్యాన్ని 172 మిలియన్ కిలోల నుంచి 120 మిలియన్ కిలోలకు తగ్గించి, బ్యారన్‌కు 30 క్వింటాళ్లు లక్ష్యంగా పెడితే బ్యాంకులు రూ.3లక్షలకు మించి రుణాలివ్వవు. మరోవైపున బేషరతుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలముందు ఊరూరా హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ పని చేయలేదు. రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు అన్నాడా లేదా? (అన్నాడని అందరూ చేతులెత్తారు.) మరి రుణమాఫీ పూర్తిగా చేశాడా? (లేదు లేదంటూ అందరూ చేతులెత్తి సమాధానం చెప్పారు.) రుణాలు మాఫీ కాలేదు.

బ్యాంకుల్లో ఉన్న బంగారం వేలం వేస్తున్నారు. గతంలో రూ.లక్ష వరకూ రుణం వడ్డీ లేకుండా వచ్చేది. మూడు లక్షల రూపాయల వరకూ రుణం పావలా వడ్డీకి వచ్చేది. ఇప్పుడు 14 నుంచి 18 శాతం వరకూ అపరాధ రుసుం విధిస్తున్నారు. చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రుణాలున్నాయి. వాటిపై ఇప్పటికి రూ.18 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది. చంద్రబాబునాయుడు గత ఏడాది రూ.4600 కోట్లు, ఈ ఏడాది రూ.2800 కోట్లు మొత్తం కలిసి రూ.7400 కోట్లు మాఫీ చేశారు. రెండేళ్లలో ఆయన వేసిన ముష్టి రూ.7400 కోట్లకు వడ్డీ కూడా మాఫీ కాలేదు.

రాష్ట్రంలో రైతులకు కష్టకాలం
 రాష్ట్రంలో ఏ రైతు పరిస్థితి చూసినా ఇలానే ఉంది. పామాయిల్‌కు గిట్టుబాటు ధర రూ.9 వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.5,400 కు కూడా కొనడంలేదు. ధాన్యానికి రూ.1400 ఎంఎస్‌పీ ప్రకటిస్తే రైతుకు రూ.1100 కూడా దక్కడం లేదు. పత్తికి కనీస మద్దతు ధర రూ.4,500 ప్రకటిస్తే రూ.3,500 కూడా రావడం లేదు. పట్టుగూళ్లుకు రూ.300 నుంచి రూ.350 ధర రావాల్సి ఉండగా ఇప్పుడు రూ.150 కూడా రావడంలేదు. పసుపు కిలోకు రూ.150 నుంచి రూ.250 వరకూ గిట్టుబాటు ధర రావాల్సి ఉండగా, రూ.70 కూడా రావడంలేదు.

చెరుకు టన్ను రూ.2300 కాగా రూ.1540 మాత్రమే వస్తోంది. మొక్కజొన్నకు రూ.1310  గాను రూ.900  కూడా పలకడం లేదు. ఇక సుబాబుల్, జామాయిల్ విషయానికి వస్తే రూ.4,400, రూ.4600 గిట్టుబాటు ధర ఇవ్వాల్సి ఉండగా రూ.3500 కూడా అందడం లేదు. రైతు బతుకే కష్టంగా మారింది. ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ పోరాటం ఆగదు. నష్టపోయిన ప్రతి రైతుకు తోడుగా ఉంటాం. కష్టమైనా ఒత్తిడి తెచ్చేందుకు అందరం ఒకటవుదాం. మనకి కావాల్సింది సాధించుకుందాం.

ధర్నాలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణి, నియోజకవర్గ ఇన్‌చార్జులు వరికూటి అశోక్‌బాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, యెడం బాలాజీ, గొట్టిపాటి భరత్, వెన్నా హనుమారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 మూడు కుటుంబాలకు పరామర్శ
 జిల్లాలో అత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతులు బొలినేని కృష్ణారావు, నీలం వెంకటరావు, గిట్టుబాటు ధర రాక వేలం కేంద్రంలోనే గుండె ఆగి చనిపోయిన మిడసల కొండలరావు కుటుంబాలను జగన్ పరామర్శించారు.  ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినా అధైర్యపడకుండా ముందుకు సాగాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిగ్రీ చదువుతున్న ఆడపిల్ల చదువు మాన్పించవద్దని కొండలరావు కుటుంబానికి చెప్పారు.

 పొగాకు రైతులను ఆదుకున్న వైఎస్సార్
 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు పొగాకు రైతులు ఇలానే సంక్షోభంలో ఉంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపి సొసైటీల తరఫున పొగాకు కొనుగోలు చేయించారు. దీనివల్ల పోటీ పెరిగి పొగాకుకు మంచి ధర వచ్చింది. ఆయన ఐదేళ్లలో రెండుసార్లు పొగాకు రైతులను ఆదుకున్నారు. కానీ ఇదేపని చంద్రబాబు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. చంద్రబాబూ నీకు బుద్ధీ జ్ఞానం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రిగా పొగాకు రైతులను ఆదుకోవాలన్న బుర్ర, ఆలోచన లేకుండా పోయాయి.

172 మిలియన్ కిలోల పొగాకు పండుతుందని తెలిసినప్పుడు మార్కెట్ సంక్షోభంలో ఉన్నపుడు జనవరి నుంచి జూన్ వరకూ రూ.400 కోట్లు ఖర్చు పెట్టి 30 మిలియన్ కిలోలు కొని ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారా? లోగ్రేడ్ పొగాకు కిలోకు రూ.62 నుంచి రూ.67 వరకూ ధర ఇస్తామని మూడు వారాల కిందట మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం రూ.34 పలుకుతోంది. రూ.67 కంటే తక్కువకు ఎవరి వద్ద కొన్నారో వారందరికీ మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పుడు రైతులకు కొంతైనా ఊరట కలుగుతుంది.
Share this article :

0 comments: