ఆర్టీసీ చార్జీల బాదుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్టీసీ చార్జీల బాదుడు

ఆర్టీసీ చార్జీల బాదుడు

Written By news on Saturday, October 24, 2015 | 10/24/2015


ఆర్టీసీ చార్జీల బాదుడు
- పల్లె ప్రజలపై 5 శాతం భారం
- డీలక్స్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ ప్రయాణికులపై 10 శాతం వడ్డన
- అర్ధరాత్రి నుంచి అమల్లోకి
- తెలుగు వెలుగు బస్సులో కిలోమీటరుకు
- 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులో 8 నుంచి 9 పైసలు పెంపు
- ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల భారం
- స్టూడెంట్ బస్సు పాస్‌ల చార్జీలు యథాతథం
- చార్జీలు పెంచబోమన్న ఎన్నికల హామీలు తుంగలోకి తొక్కిన బాబు సర్కారు
- డీజిల్ ధరలు తగ్గుతున్నా, ఆర్టీసీ చార్జీలు పెంచడంపై సర్వత్రా విస్మయం
- డిసెంబర్ 31లోగా జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లకు కొత్త హంగులు

సాక్షి, విజయవాడ :
 ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ప్రభుత్వం చార్జీల భారం మోపింది. వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపన, దసరా పండుగ ముగిసీ ముగియగానే ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల దెబ్బ వేసింది. రాష్ట్రంలో చార్జీలు పెంచబోమని గత ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

ప్రజలపై భారం మోపబోమంటూ అప్పట్లో చంద్రబాబు ఊరూ వాడా తిరిగి హామీ ఇచ్చారు. దానిని విస్మరించి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి చార్జీల భారం మోపారు. కొద్ది నెలల క్రితం బస్సు చార్జీలను పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం కారణంగా పంటలు పండక, కరువు పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మరోసారి చార్జీలను పెంచింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి, డీజిల్ ధరలు తగ్గుతుండగా, రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే తెలుగు వెలుగు, డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల చార్జీలను పెంచింది. అత్యంత ధనికులు మాత్రమే ప్రయాణించే వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెరిగిన చార్జీల వివరాలను వెల్లడించారు. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తెలుగు వెలుగు బస్సుల చార్జీలను ప్రస్తుతం ఉన్న రేటుపై 5 శాతం అంటే కి.మీ.కు 3 పైసలు పెంచామని చెప్పారు.

ఎక్స్‌ప్రెస్,  డీలక్స్ బస్సులకు ప్రస్తుతం ఉన్న చార్జీలపై 10 శాతం అంటే 8 నుంచి 9 పైసలు పెంచామని వెల్లడించారు. ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల చార్జీలను కూడా 10 శాతం పెంచినట్లు తెలిపారు. వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు ఉపయోగించుకుంటున్నారని, అందువల్ల వాటి చార్జీలు పెంచలేదని తెలిపారు. పెరిగిన చార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.300 కోట్ల భారం పడుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.595 కోట్లు నష్టం వచ్చిందని, దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల మరో రూ.660 కోట్లు ఆర్థిక భారం పడిందని ఎండీ వివరించారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రయత్నించామని, అయినప్పటికీ రూ.1,200 కోట్లకు పైగా నష్టం రావడంతో ప్రజలపై భారం మోపక తప్పలేదని చెప్పారు. ఆర్టీసీ ఆఖరుసారిగా 2013 నవంబర్‌లో చార్జీలు పెంచిందని వివరించారు.

ఆర్టీసీని ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో 14,000 గ్రామాలకు సేవలందిస్తోందని వివరించారు. విద్యార్థుల బస్ పాస్‌లకు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.280 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంటుందని, మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ విధించడం వల్ల ఆర్టీసీపై ఏడాదికి రూ.395 కోట్లు భారం పడుతోందని వెల్లడించారు. దీన్ని మాఫీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. గతంతో పోల్చితే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగిందని, గతంలో 52 శాతం ఉండగా, ప్రస్తుతం 72 శాతానికి చేరిందని చెప్పారు. కొన్ని బస్సుల్లో నూరు శాతం ఉండగా, కొన్నింటిలో 44 శాతం కంటే పెరగడం లేదని చెప్పారు.
Share this article :

0 comments: