కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...

కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...

Written By news on Friday, October 2, 2015 | 10/02/2015


కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...
- హుస్నాబాద్‌లో తొలి రోజు 8 కుటుంబాలకు పరామర్శ
- ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే...
- పంటల్లేక, అప్పులపాలై బోరున విలపించిన వైనం
- అధైర్య పడొద్దంటూ ధైర్యం చెప్పిన షర్మిల
- వైఎస్ తనయను అక్కున చేర్చుకున్న కరీంనగర్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 
కరీంనగర్ జిల్లాలో కరువు సీమగా పేరొందిన హుస్నాబాద్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తొలి రోజు పరామర్శ యాత్ర ఉద్విగ్నభరితంగా సాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన ఎనిమిది మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాక సాగిన యాత్రలో ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక అయినవారు చనిపోయారనే బాధతో బతుకీడుస్తున్న వారిపై రెండేళ్లుగా కరువు పగబట్టింది.

కుటుంబ పెద్దను కోల్పోయి బతుకు బండి నడపలేక సతమతమవుతున్నది కొందరైతే, కన్నపేగును కోల్పోయి దిక్కులేని పక్షులైన వారు మరికొందరు. అందరివీ రెక్కాడితే  గానీ డొక్కాడని కుటుంబాలే. పంటలెండి, అప్పులపాలై, వాటిని తీర్చే మార్గంలేక దుర్భరంగా బతుకీడుస్తున్నామని వారంతా షర్మిలతో గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దంటూ వారందరినీ ఆమె ఓదార్చారు. ‘‘మంచి రోజులొస్తాయి. మీకు అండగా మేముంటాం’ అంటూ భరోసా ఇచ్చారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన షర్మిలకు కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి వద్ద పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రేణుల డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలతో ఘన స్వాగతం లభించింది. అక్కడినుంచి ఆమె కోహెడ మండలం వరుకోలులో పెంటపర్తి సాహితి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆస్తిపాస్తులేమీ లేని సాహితి తండ్రి రమణారెడ్డి, కూతురిని కోల్పోయి అనాథలా బతుకుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.

సాహితి కుమార్తెలిద్దరిని పలకరించిన షర్మిల, ఏం చదువుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి అక్కడినుంచి కదిలారు. కూరెల్లలో ల్యాగల లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కోహెడలో మధ్యాహ్న భోజనం తర్వాత ధర్మసాగర్, నందారం, పోతారం, మల్లంపల్లి, కొత్తపల్లి, దామెర గ్రామాల్లో శ్రీనివాస్, అజ్మీర తుక్యానాయక్, బత్తిని ఎల్లయ్య, బూడిద లస్మమ్మ, వేల్పుల ప్రభాకర్, జక్కుల సులోచన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతి కుటుంబంతో అరగంటకు పైగా గ డిపారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు అంతా సకాలంలో వానల్లేక పంట ఎండిందని, బతుకు దెరువు కోసం వలస పోతున్నామని, ఆర్థికంగా ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి 9 గంటలకు పరామర్శ యాత్ర ముగించి హుజూరాబాద్‌లో షర్మిల  బస చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్‌రెడ్డి, కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కినపల్లి కుమార్ , వేముల శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సెగ్గెం రాజేశ్, రాష్ట్ర యువజన కార్యద ర్శులు గోవర్దనశాస్త్రి, మంద వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు ముసుకు వెంకటరెడ్డి, డి.వేణుమాధవరావు, పి.వేణుగోపాల్‌రెడ్డి, సింగిరెడ్డి ఇందిరా భాస్కర్‌రెడ్డి, జీడికంటి శివ, సొల్లు అజయ్‌వర్మ, శంకర్, కాసారపు కిరణ్, గండి శ్యామ్, రాజమణి, పద్మ, వరంగల్ జిల్లా నాయకులు ఎం.కల్యాణ్‌రాజ్, ఎ.మహిపాల్‌రెడ్డి, సుమిత్ గుప్తా, రాజ, మెదక్ జిల్లా నాయకులు తడాకా జగదీశ్వర్‌గుప్తా, వీరరాజు, గురునాథ్, హైదరాబాద్ నగర నాయకులు ఎండీ.మజీద్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: