విచ్చలవిడి అవినీతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విచ్చలవిడి అవినీతి

విచ్చలవిడి అవినీతి

Written By news on Saturday, October 3, 2015 | 10/03/2015


విచ్చలవిడి అవినీతి
- ఏపీ సర్కారు నిర్వాకం..
- ప్రణాళికా శాఖ సర్వేలో వెల్లడి
- ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంలో సర్కారు విఫలం
రాష్ర్ట ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని సాక్షాత్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో చెప్పింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 32.5 శాతం మంది అవినీత రహిత పాలన అందించాలని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అవినీతి లేదని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా చెప్పకపోవడం విశేషం. సర్వే తీవ్రతను బట్టి చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అవగతమవుతోంది. ప్రజల మౌలిక అవసరాలకు సంబంధించి కీలకమైన 12 అంశాలపై జనాభిప్రాయం కోరగా.. అందులో ఎనిమిదింటిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోయిందని సాక్షాత్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖే తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది. అవినీతితోపాటు ప్రజలను అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. రాష్ట్రంలో అవినీతి పెరిగినట్లు 75 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వేలో వెల్లడైంది. తొలి త్రైమాసికం సర్వే వివరాలతో ప్రణాళికా శాఖ ముద్రించిన ‘అసెస్‌మెంట్ అండ్ వే ఫార్వర్డ్’ పేరుతో పుస్తకాలను ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పంపిణీ చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలానికి సంబంధించి జూలైలో మొత్తం 12 అంశాలపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 8 అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తాగునీటి సరఫరా, రోడ్లు, ఇళ్ల నిర్మాణం, జీవనోపాధి, సాగునీటి పారుదల, విద్యుత్ సరఫరా, వైద్య ఆరోగ్యం, ఆధార్ సేవలు, అవినీతి, పారదర్శకత, ప్రభుత్వ పనితీరు వంటి సమస్యాత్మకమైన విషయాలపై సర్వే నిర్వహించినట్టు ప్రణాళిక శాఖ తన 60 పేజీల నివేదికలో పేర్కొంది. అయితే, టీడీపీ అధికారంలోకి రావడానికి అత్యంత ప్రధానమైన హామీలు... రైతు రుణమాఫీ, డ్వాక్రా సహాయ సంఘాలకు రుణాల మాఫీ, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వంటి కీలక అంశాలను ఈ సర్వే నుంచి మినహాయించడం గమనార్హం.

 802 గ్రామాల్లో సర్వే: ఈ ఏడాది జూలైలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుర్తించిన 802 గ్రామాల్లోని 18,000 మందితో సర్వే నిర్వహించారు. అనేక సామాజిక అంశాలతోపాటు ప్రభుత్వ సేవలు అందించడంలో మరింత మెరుగు పరచడమే లక్ష్యంగా సర్వే నిర్వహించినట్లు ప్రణాళికా సంఘం పేర్కొంది. సర్వేలో అవినీతి పెరిగిపోయిందని 75 శాతం మంది అభిప్రాయపడగా, అవినీతిలేని పాలన అందించాలని 32.5 శాతం మంది పేర్కొన్నారు. ఆ తర్వాత 14.9 శాతం మంది ప్రభు త్వ రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని 7.7 శాతం మంది సూచించారు.

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా 7.5 శాతం మంది తెలిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని 5.9 శాతం, సంక్షేమ పథకాల అమలుకు 5.5 శాతం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలని 5.2 శాతం మంది సర్వేలో చెప్పారు. మెరుగైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని 3.2%, మెరుగైన సాగునీటి వసతి కల్పించాలని 2.9%, మహిళా సంక్షేమ అమలుకు 2.9% మంది సూచించారు.

సర్వేలో 93% మంది సమస్యల చిట్టాను వెల్లడించారు.తాగునీటి సమస్య పట్టిపీడిస్తోందని 33%, రహదారులు లేవని, ఉన్నా అస్తవ్యస్థంగా ఉన్నాయని 17.5% మంది పేర్కొన్నారు. మహిళలతోపాటు ఇతరులు జీవనోపాధి లేక ఇక్కట్లు పడుతున్నట్లు 10.7 శాతం, ఉండేందుకు గూడు లేక అవస్థలు పడుతున్నట్లు 10.7 శాతం మంది పేర్కొన్నారు. సాగునీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నట్లు 10.3 శాతం, విద్యుత్ సమస్యతో 5.6 శాతం, ఆరోగ్య సమస్యలతో 4.8 శాతం మంది సతమతమవుతున్నట్లు ప్రణాళికా సంఘం సర్వేల్లో వెల్లడైంది.

Share this article :

0 comments: