
హైదరాబాద్ సమావేశంలో పలు నిర్ణయాలు
భూ సేకరణపై న్యాయపోరాటానికి సమాయత్తం
ధరల నియంత్రణ కోరుతూ సోమవారం ధర్నాలు
సాగునీటి సరఫరాకు అధికారులపై ఒత్తిడికి నిర్ణయం
గుంటూరు : జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగానే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, సాగునీటి కొరత, రాజధానిలోని భూ సేకరణ వంటి ముఖ్య అంశాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో గుంటూరు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో భూ సేకరణ
విషయంలో న్యాయ పోరాటం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనం వ్యయం
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ధరల తగ్గుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రైతుల పక్షాన ఆందోళనలు...
జిల్లాలో సాగునీటి కొరత కారణంగా రైతాంగం అనేక ఇబ్బందులు పడుతోంది. పల్నాడులో పత్తి, మిరప, ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయాయి. డెల్టాలో సాగునీటి సరఫరా లేక పొట్ట దశకు వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు డీజిల్ ఇంజిన్ల సాయంతో కాల్వలోని నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని సాగునీటి విడుదలకు జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు, అవసరమైతే ఇతర కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని గ్రామాల్లో భూ సేకరణ చేయనున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని రైతుల పక్షాన ఆందోళనలు, న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ నాయకులు కత్తెర సురేష్‌లు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తదితరులు జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.
0 comments:
Post a Comment