బంధువుల కోసం బరితెగించిన సీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంధువుల కోసం బరితెగించిన సీఎం

బంధువుల కోసం బరితెగించిన సీఎం

Written By news on Tuesday, November 10, 2015 | 11/10/2015


సర్కారు భూకట్నం రూ. 300 కోట్లు!
♦ బంధువుల కోసం బరితెగించిన సీఎం
♦ బాలకృష్ణ వియ్యంకుడికి 498.93 ఎకరాల భూమి అప్పగింత
♦ ఎకరా రూ.60 లక్షలు విలువ చేసే భూమి రూ.లక్షకే ధారాదత్తం
♦ సీఆర్‌డీఏ పరిధిలోనే భారీ కాలుష్య పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు
♦ పర్యావరణానికి ముప్పని నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినా బేఖాతరు

సాక్షి, విజయవాడ: ఆయన విశాఖపట్నంలో ప్రముఖ పారిశ్రామికవేత్త. దాదాపు 25 కంపెనీలకు, ఓ ప్రముఖ విద్యాసంస్థకూ అధిపతి. అన్నింటికీ మించి టీడీపీ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బినామీగా పేరున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సమీప దూరంలో ఓ కాలుష్య పరిశ్రమ నిర్వహించాలనే కోరిక కలిగింది. కుమారుడు సీఎండీ, డెరైక్టర్‌గా ఓ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలోని తన సమీప బంధువులైన నేతలను కలిశారు. అంతే... 498.93 ఎకరాల భూమి అత్యంత సులువుగా ఆయన పరమైంది. ఏపీఐఐసీకి చెందిన ఈ భూమి విలువ.. సమీపంలో రాజధాని రావడంతో ప్రస్తుతం ఎకరా రూ.60 లక్షలకు చేరింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పెద్ద మనసుతో ఎకరా రూ.లక్ష రూపాయలకే తన బినామీ, సమీప బంధువు, టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీ ఎస్ మూర్తికి కట్టబెట్టేశారు. అలా సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని రూ. 300 కోట్ల విలువైన భూమిని ఆయనకు దోచిపెట్టారు.

ఆగమేఘాలపై ఉత్తర్వులు..
విశాఖ బాట్లింగ్ కంపెనీ (వీబీసీ) చైర్మన్, విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి తన కుమారుడు ఎంఎస్‌పీ రామారావు సీఎండీ, డెరైక్టర్‌గా జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ పేరిట భారీ ఎరువుల కర్మాగారాలు పెట్టాలని సంకల్పించారు. అందుకోసం గత ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 23వ తేదీన ఏపీఐఐసీకి కేటాయించిన (జీవో 523) 498.93 ఎకరాలపై కన్నేశారు. ఆ భూమిని తమకు కేటాయించాలంటూ వీబీసీ 2013 అక్టోబర్ 4న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా పక్కన పడేసింది. అయితే గత ఏడాది జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అదే నెల 28వ తేదీన వీబీసీ సంస్థ ఆ భూమికోసం లేఖ రాసింది. చంద్రబాబు వెంటనే దానికి పచ్చజెండా ఊపేశారు.

దీంతో ఇండస్ట్రియల్ పార్క్‌కు ఉద్దేశించిన భూమిని వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ విభాగం ఆగమేఘాలపై సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌డీఏ పరిధిలో, రాజధాని అమరావతికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి ఎకరాకు కేవలం రూ.లక్ష ధర నిర్ణయించి భూ సంతర్పణ చేసింది. అలా ముఖ్యమంత్రి తన సమీప బంధువుకు రూ.300 కోట్ల భూమిని రాసిచ్చేశారు. రాజధాని రాకతో ఆ భూమి ధర భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పచ్చని పంటలు పండే ఆ ప్రాంతంలో విషం చిమ్మే ఎరువుల కర్మాగారాలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

ఇక్కడ రోజుకు 4,400 టన్నుల అమ్మోనియా, 7,700 టన్నుల యూరియా, 800 టన్నుల నైట్రిక్ యాసిడ్ ఉత్పిత్తి చేసే పరిశ్రమలతో పాటు 135 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి చేసే కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కర్మాగారాలు ఉత్పత్తి ప్రారంభిస్తే వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల నీరు కలుషితమవుతుందని, భూములు నిస్సారమై పంటలు పండవని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. ఆ పరిశ్రమల్లో వాడే రసాయనాలు ప్రమాదవశాత్తూ లీకైతే భోపాల్, ఢిల్లీలో జరిగిన దారుణాలు పునరావృతమవుతాయని హెచ్చరించినా బేఖాతరు చేశారు.

కేంద్రం నుంచి బొగ్గు అనుమతులు లేకుండానే... బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రాజెక్ట్‌లో పొందుపరిచి దానికి కేంద్ర ప్రభుత్వంతో ముద్ర వేయించారు. అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి, స్థానిక ప్రజాప్రతినిధి సహకారంతో... గత నెల ఏడో తేదీన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా కర్మాగారం ఏర్పాటుకు అనుకూలంగా ముగించారు. ఇక ఢిల్లీ అనుమతుల్లో పూర్తి బిజీగా ఉన్నారు. ఎంతదూరమైనా పోరాడి కర్మాగారాలు సాధించటమే ఎజెండాగా రెండు రాజకీయ పార్టీల్లోని నేతలు తెరచాటున ఏకమై కసరత్తు సాగిస్తున్నారు.

అంతా బంధువులే...
విశాఖ బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి చైర్మన్. ఆయన చంద్రబాబుకు బినామీ అని, అందుకే గతంలో గీతం యూనివర్సిటీకి కారుచౌకగా భూములు కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. ఆయన కుమారుడు ఎంఎస్‌పీ రామారావు వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు సీఎండీ, డెరైక్టర్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు రామారావు స్వయానా అల్లుడు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వియ్యంకుడు. బాలకృష్ణ చిన్న కుమార్తెను రామారావు కుమారుడు పెళ్లి చేసుకున్నారు.

కావూరి సాంబశివరావు 2013 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలోనే ఆయన అల్లుడు రామారావు జయంతిపురంలో వీబీసీ కర్మాగారం ఏర్పాటుకు దరఖాస్తు చేశారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రామారావు మరోసారి పావులు కదిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని నేతలు ఆయనకు సమీప బంధువులు కావడంతో ఈసారి అత్యంత సులువుగా అనుమతులు సంపాదించేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిత్యం విమర్శలు చేస్తున్న బీజేపీ నేత కావూరి సాంబశివరావు... తెరవెనుక తన అల్లుడి ఫ్యాక్టరీకి అనుమతులు తెచ్చుకునేందుకు అదే చంద్రబాబుతో లాలూచీ పడుతున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇవ్వాల్సి అనుమతులన్నీ అధికార పార్టీ ముఖ్యనేత ఉదారంగా ఇచ్చేస్తుండగా... కేంద్రంనుంచి రావాల్సిన అనుమతులన్నీ ఆయన చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.
Share this article :

0 comments: