బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం

బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం

Written By news on Monday, November 2, 2015 | 11/02/2015


బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం
♦ హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన
♦ అభివృద్ధి అంతా అమరావతిలోనే అనడం సరికాదు
♦ {పజల్లో అసంతృప్తి, విభజనకు బీజాలు వేస్తున్నారు
♦ పెద్ద రాజధాని పేరుతో భ్రమలు కల్పించొద్దు
♦ హైదరాబాద్ ఉదంతం పునరావృతం కానీయొద్దు

 సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించే విధానంతో భవిష్యత్‌లో వెనుకబడిన ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయని, ఆ పరిస్థితి మరిన్ని అనర్థాలకు దారి తీస్తుందన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్లు పాటు ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ చేజారి పోయిన ఉదంతం నుంచి చంద్రబాబు గుణ పాఠం నేర్చుకోవడంలేదన్నారు.

ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సేకరించిన 33,500 ఎకరాలకు తోడు, అటవీ భూములను డీనోటిఫై చేయడం, భూసేకరణ చట్టం ప్రయోగించి రైతుల నుంచి తీసుకోవడం ద్వారా మొత్తం 60 నుంచి 70 వేల ఎకరాల్లో పెద్ద రాజధాని వస్తోందనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారని చెప్పారు. అసలు అంత పెద్ద రాజధాని ఎందుకు? దేశంలోకానీ, ప్రపంచంలోకానీ పెద్ద రాజధానుల వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాజధాని అంశాలపై అధ్యయనం చేసే పార్టీ కమిటీకి అధ్యక్షుని హోదాలో తాను ఇందుకు సంబంధించిన విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు.

చంద్రబాబు ఇపుడు అనుసరిస్తున్న వ్యూహం వల్ల వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు భవిష్యత్తులో దశాబ్దాల  పాటు అభివృద్ధి చెందకుండా ఉండిపోతాయనే భావన ప్రజల్లో కలుగుతుందని ధర్మాన అభిప్రాయపడ్డారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తే అన్నీ వాటిని అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. జిల్లాకొక సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. వెనుకబడిన శ్రీకాకుళం వాసులుగాని, రాయలసీమలోని ఒక జిల్లా వారు గాని తమకూ ఒక కేంద్రీయ సంస్థ కావాలని కోరుకుంటారు కదా అని ధర్మాన అన్నారు.

 హైదరాబాద్ అనుభవం ఏది?
 హెచ్‌ఎంటీ, బీడీఎల్, మిథాని, రక్షణ సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడే ఉపాధి అవకాశాలు పెరిగాయని, అందువల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన వివరించారు. దీంతో ఉపాధి కోసం హైదరాబాద్ వైపు చూడ్డం వల్ల ఊళ్ల నుంచి వలసలు పెరిగిపోయాయన్నారు. ఈ విషయం చంద్రబాబుతో సహా అందరూ చూశామన్నారు. అలాంటి నగరాన్ని కోల్పోయామనే ఆవేదన విభజన తర్వాత కూడా 13 జిల్లాల ప్రజల్లో ఉందని ధర్మాన చెప్పారు. అభివృద్ధి వెనుకబడి పోయింది 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. మళ్లీ 2000 సంవత్సరంలో అభివృద్ధి చెందిన తెలంగాణ ఫలాలు తమకే దక్కాలనే నినాదంతో ఉద్యమం వచ్చిందనే విషయం గుర్తించాలన్నారు. పలు రాష్ట్రాలు కేంద్రం తమకిచ్చిన సంస్థలను ఒక్క రాజధానిలోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం నెలకొల్పాయని, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే సంస్థలు పెట్టడం వల్ల మిగతా 13 జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇపుడు చంద్రబాబు చేస్తున్న పని వల్ల మళ్లీ తమ ప్రాంతాలు అభివృద్ధి చెందవేమోనన్న అనుమానాలు పలు జిల్లాల ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. అభివృద్ధి అంతా రాజధానిలోనే కేంద్రీకరిస్తే రాష్ట్ర ప్రజల్లో మరో విభజన ఆలోచన కొన్ని సంవత్సరాల తర్వాతైనా వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

 అది విజ్ఞత కాదు..
 ‘నైన్ ఇన్ ఒన్’ (ఒకే చోట తొమ్మిది అంశాల కేంద్రీకరణ) అనే పేరుతో పరిశ్రమలు, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఆరోగ్యం, వినోదం వంటివన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పడం విజ్ఞత గల రాజకీయవేత్తలు చేసే పనికాదని ధర్మాన అన్నారు. పెద్ద రాజధాని అనేది చక్రవర్తులు నిర్మించుకునేదని, అభివృద్ధికి మంచి పాలనే ఉండాలి తప్ప రాజధాని ఎంత పెద్దదనేది కొలమానం కాదన్నారు. ప్రైవేటు పెట్టుబడిదారులు ఊరికే తమ నిధులు వెచ్చించరని, వారు నిర్మించబోయే అమరావతిలోకి ఎంట్రీ ఫీజు మొదలు కారు నడిపినందుకు, పార్కింగ్, చివరకు టాయిలెట్  వినియోగించుకున్నందుకు కూడా ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.

పౌర సేవలకు ఫీజులు చెల్లించే నగరం నిజంగా పేదల రాజధాని అవుతుందా? అంటూ ప్రశ్నించారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించే విధానానికి చంద్రబాబు స్వస్తి చెప్పాలన్నారు. మిగతా ప్రాంతాలు అన్యాయానికి గురికాకుండా చూడాలని, భవిష్యత్తులో విభజన ఉద్యమాలు రాకుండా విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన చెప్పారు.  తర్వాత ప్రభుత్వాలు కూడా సరిదిద్దలేని తప్పు చంద్రబాబు చేస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. తాను చెప్పిన విషయాల్లో రాజకీయ ఉద్దేశ్యాలు లేవని, తీవ్రమైన ఆవేదనతోనే చెబుతున్నానన్నారు.
Share this article :

0 comments: