‘గల్లా’కు భూ నజరానా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘గల్లా’కు భూ నజరానా!

‘గల్లా’కు భూ నజరానా!

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015


‘గల్లా’కు భూ నజరానా!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని కారుచౌకగా ధారాదత్తం చేసింది. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్‌కు కట్టబెట్టింది. ఈ మేరకు ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు.

కరకంబాడి ప్రాంతం దాదాపుగా తిరుపతి నగరంలో కలసిపోయింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా లెక్కేసుకున్నా బహిరంగ మార్కెట్‌లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్‌కు ఎకరా రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం.

ఎన్నికల్లో చేసిన సాయానికి...
రాష్ట్రం విడిపోయేవరకూ కాంగ్రెస్‌లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడు గల్లా జయదేవ్‌ను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించడంద్వారా రాజకీయ అరంగేట్రం చేయించారు. ఆమెకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్, కుమారుడికి గుంటూరు లోక్‌సభ టికెట్ ఖరారు చేసినందుకు ప్రతిగా ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి ‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు భారీగానే సొమ్ము ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి.

‘కీలకమైన ఎన్నికల్లో పార్టీకి సాయం చేసినందుకు నజరానాగా ఇప్పుడు విలువైన భూమిని కారుచౌకగా మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం నెలన్నర రోజుల్లోనే భూకేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేసింది’ అని టీడీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం.

కేవలం 42 రోజుల్లో...
కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల ప్రక్రియ పూర్తవడాన్నిబట్టే ఫైలు ఎంత శరవేగంగా కదిలిందో అర్థమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న చిత్తూరు జిల్లా కలెక్టర్ మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపులకోసం ఫైలు పంపించారు. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) దాన్ని ఆమోదించింది. అక్కడినుంచి ఆగమేఘాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదం పొందిన ఈ ఫైలు ఈ నెల 2న రాష్ట్ర మంత్రివర్గ ఎజెండాలో చేరిపోయింది. మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది.

‘‘భూకేటాయింపులకోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతుంటాయి. అయితే ఇది అధికారపక్షానికి చెందిన కీలక నేతకు సంబంధించింది కావడంతో రాకెట్ వేగంతో వెళ్లి కేవలం 42 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం పొందింది’’ అని రెవెన్యూశాఖకు చెందిన కిందిస్థాయి అధికారి ఒకరు అన్నారు.
 
మంత్రిగా ఉండగా సాధ్యం కాని పని..
గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విలువైన భూమిపై కన్నేశారు. పారిశ్రామిక అవసరాలు సాకుగా చూపించి దీన్ని కైవసం చేసుకోవాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీనే భూ కేటాయింపులకోసం ప్రతిపాదన తెప్పించుకున్నారు.

అప్పట్లో సీఎంగా ఉన్న కె.రోశయ్య, తదుపరి సీఎంగా వచ్చిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ భూకేటాయింపునకు మౌఖికంగా అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన రెవెన్యూశాఖలో పక్కన పడిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ కలెక్టర్ నుంచి ఈ భూమికోసం ప్రతిపాదన తెప్పించుకున్న ‘గల్లా’.. సీఎంతో మాట్లాడి ఆగమేఘాలపై ఫైలు నడిపించి ఓకే చేయించారు.
Share this article :

0 comments: