ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు

ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు

Written By news on Sunday, November 8, 2015 | 11/08/2015


ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హామీలను పూర్తిగా విస్మరించారని, రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులకు ఒకే విడతలో రూ.లక్ష రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీ, వ్యవసాయానికి 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి అని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ విషయూన్ని విస్మరించారన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో గిరిజనులకు వారు సాగుచేస్తున్న భూములకు హక్కు పత్రాలను ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం వారి భూములను లాక్కుంటూ గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ విధానాలు ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, వైఎస్ అనంతరం పనిచేసిన సీఎంలు సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని పొంగులేటి అన్నారు. టీడీపీ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ఇక్కడ టీఆర్‌ఎస్ పాలన కన్నా ఘోరంగా ఉందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో తిరిగి వైఎస్‌ఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే వైస్ పాలన వస్తుందన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నిక ఇందుకు సరైన వేదికగా నిలుస్తుందని, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీలకు తగిన బుద్ది చెపుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అనంతరం అభ్యర్థి సూర్యప్రకాష్‌తో కలిసి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండల కేంద్రంలో  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నియోజక వర్గ ఇన్‌చార్జి మునిగాల విలియం, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలిపురి రఘు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: