ప్రజలంతా మహానేత వైఎస్ పాలన కోరుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలంతా మహానేత వైఎస్ పాలన కోరుకుంటున్నారు

ప్రజలంతా మహానేత వైఎస్ పాలన కోరుకుంటున్నారు

Written By news on Tuesday, November 10, 2015 | 11/10/2015


కేసీఆర్ మాటల మాంత్రికుడు
♦ ప్రజలకు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు
♦ రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు..
♦ టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
♦ ప్రజలంతా మహానేత వైఎస్ పాలన కోరుకుంటున్నారు
♦ వరంగల్ జిల్లా రోడ్‌షోలో ఏపీ ఎమ్మెల్యే రోజా

 స్టేషన్ ఘన్‌పూర్ టౌన్/రఘునాథపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మాటల మాంత్రికుడని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కేసీఆర్ మాటల మరాఠీలా ప్రజల్ని మభ్యపెట్టే హామీలిస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి నల్లా సూర్యపకాశ్‌కు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రం, రఘునాథపల్లిలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలలో రోజా మాట్లాడారు. కేసీఆర్‌కు రైతుల సమస్యలు పట్టడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రోజా పేర్కొన్నారు.

తెలంగాణలో దళితులు, మహిళలకు గౌరవం లేకుండా పోయిందని, వారిని అవమానించే విధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. దళితుడైన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంగా చేసిన కేసీఆర్.. కొద్ది కాలంలోనే బర్తరఫ్ చేయడం అన్యాయమన్నారు. దీనిపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ఎన్ని కుటుంబాలకు భూములిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని ఆయన పక్కనపెట్టారని... కేసీఆర్ కుటుంబ సభ్యులే అధికారం అనుభవిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకపోవడం మహిళల్ని అవమానించడమేనన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చారని, మహిళా సంక్షేమంపై ప్రత్యేక చొరవ తీసుకొని అభయహస్తం, పావలా వడ్డీకే రుణాలు తదితర పథకాలు ప్రవేశపెట్టారని రోజా గుర్తుచేశారు. వైఎస్సార్ తన పాలనలో పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సు సేవలు, పేద విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, అర్హులైన వృద్ధులు, వికలాంగులందరికీ పింఛన్లు తదితర బృహత్తర పథకాలు చేపట్టారన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలు వైఎస్‌ఆర్ పాలన కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారని రోజా తెలిపారు. తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ స్థానికుడు కాదంటూ టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఇతర నియోజకవర్గాల నుంచి గెలిచిన వారు కాదా అని రోజా ప్రశ్నించారు.

నల్లా సూర్యప్రకాశ్ మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను గెలిపిస్తే వైఎస్‌ఆర్ పాలన తెస్తారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు బుద్ది చెప్పాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, నియోజకవర్గ ఇన్‌చార్జి మునిగాల విలియం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగా ల కల్యాణ్‌రాజ్, పార్టీ మండల అధ్యక్షుడు ఊరడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 చంద్రబాబు మూటల మాంత్రికుడు
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలన సాగిస్తూ మూటల మాంత్రికుడిగా మారారని రోజా దుయ్యబట్టారు. పుష్కరాలు, పట్టిసీమ పేరుతో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడి డబ్బులు దండుకున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన ఆయన జైల్లో కాకుండా సీఎంగా ఉండటం విచారకరమన్నారు. తెలంగాణలో రైతుల సమస్యలపై టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని...ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపించడాన్ని ప్రజలు మర్చిపోలేదని బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు ఏపీలో రైతాంగ సమస్యల్ని పట్టించుకోకుండా తెలంగాణలో రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 వైఎస్ పాలన తెచ్చుకుందాం: పొంగులేటి
 దివంగత మహానేత వైఎస్‌ఆర్ అందించిన తరహా పాలన తెచ్చుకునేందుకు వరంగల్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ తమ పార్టీని ఆదరించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను కోరారు. రఘునాథపల్లిలో రోజా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వైఎస్ కుటుంబం రుణం తీర్చుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు. వైఎస్ పాలనలో ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందాయని, గిరిజనుల కోసం పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు.

మైనారిటీలకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించి ఉన్నత చదువులకు బాటలు వేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ ఎంపీగా తనను గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానన్నారు.
Share this article :

0 comments: