ఒక్క హామీ నెరవేర్చారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్క హామీ నెరవేర్చారా?

ఒక్క హామీ నెరవేర్చారా?

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015


ఒక్క హామీ నెరవేర్చారా?
♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన రోజా
♦ అధికార పార్టీ స్వార్థం వల్లే వరంగల్ ఎన్నిక
♦ రాజన్న రాజ్యం కావాలంటే వైఎస్సార్‌సీపీనే గెలిపించండని పిలుపు

 హన్మకొండ చౌరస్తా, పోచమ్మ మైదాన్, గీసుకొండ: అధికార పార్టీ రాజకీయ స్వార్థం వల్లే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఏపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడినే మొదటి సీఎంగా చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని విస్మరించడమేగాక దళిత డిప్యూటీ సీఎం రాజయ్యను రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారని విమర్శించారు. ఎన్నికల్లో బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పునే వరంగల్ ప్రజలు కూడా ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా గురువారం వరంగల్ నగరంతో పాటు, గీసుకొండ, పరకాల, హసన్‌పర్తి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఇది స్వార్థ రాజకీయూల కోసం వచ్చిన ఎన్నిక అని, దీంతో ప్రజలపై పన్నుల భారం పడుతుందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో 50 శాతం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రివర్గంలో చోటే లేదు. ఇదేనా మహిళలకు దక్కే గౌరవం? టీఆర్‌ఎస్ 17 నెలల పాలనలో 1,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా స్పందించలేదు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటున్నా ఇప్పటివరకూ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. దళితులకు మూడెకరాల భూమిస్తామన్న మాట ఎక్కడ పోయింది?’’ అని రోజా ప్రశ్నించారు.

 గడప గడపనా వైఎస్ పథకాలే
 గడప గడపలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే కనిపిస్తున్నాయి తప్ప.. టీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క పథకమూ అమలుకు నోచుకోవడం లేదని రోజా అన్నారు. ఎన్నికలు రాగానే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు చొప్పున తిరుగుతూ ఓటర్లను బతిమాలుతున్న మంత్రులకు.. రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అని నిలదీశారు. ఇద్దరు చంద్రులు 2 రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఉన్న ఏ ఒక్క సీఎం కూడా వైఎస్సార్ లాంటి పాలన అందించలేక పోయారన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు. రోజా వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

 దళితులను అవమానపర్చారు: నల్లా
 దళితుడినే సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చారని వరంగల్ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. మంత్రివర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసి దళితులను అవమానపర్చారన్నారు. ఎన్‌కౌంటర్లు లేని రాజ్యాన్ని తీసుకొని వస్తానని చెప్పి.. వరంగల్ జిల్లాలో ఇద్దరిని ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చారని దుయ్యబట్టారు. రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పి.. డబ్బు సంచులు ముట్టడంతో మిన్నకుండిపోయారని అన్నారు.

ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రోడ్ షోలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, బోరుునపెల్లి శ్రీనివాస్‌రావు, మునిగాల కల్యాణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: