హోదాపై పార్లమెంటులో పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదాపై పార్లమెంటులో పోరాటం

హోదాపై పార్లమెంటులో పోరాటం

Written By news on Monday, November 23, 2015 | 11/23/2015


హోదాపై పార్లమెంటులో పోరాటం
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న హామీల సాధన కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడాలని వైఎస్సార్‌సీపీ ఎంపీల సమావేశం నిర్ణయించింది. ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంటులో సమయం, సందర్భం చూసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంపైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు జగన్ సూచించారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్, బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశానంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ శీతాకాల సమావేశాల్లో తమ ఎజెండా లో ఉండబోయే మొట్టమొదటి అంశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే అని అన్నారు. విభజన వల్ల నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్‌కు కొంత మేరకైనా మేలు చేసేది ఒక్క ప్రత్యేక హోదా మాత్రమేనని తాము నిశ్చితాభిప్రాయంతో ఉన్నామని, అందు కోసం తాము కృషి చేస్తామన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి కనీసం అడగకపోవడం శోచనీయమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలను కలిపి ఒక ప్యాకేజీ కింద ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని, కానీ తాము మాత్రం చట్టంలోని ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని గట్టిగా కోరతామని స్పష్టం చేశారు.

 అతీగతీ లేని రైల్వే జోన్
 విశాఖపట్టణంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని విభజన సమయంలో చెప్పారనీ ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఏటా కనీసం రు 5,000 కోట్లు కేటాయించి సత్వరం పూర్తి చేయాలని, అపుడు గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు, కృష్ణా నీటిని రాయలసీమకు ఇవ్వగలుగుతారన్నారు.

 నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
 ఓవైపు కరువు, మరో వైపు భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరతామన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వరదల వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలకు చేతికొచ్చిన వేలాది ఎకరాల పంట నాశనం అయిపోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వరదబాధిత జిల్లాల్లో పర్యటించినందున వెంటనే ఈ జిల్లాల్లో నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో చేతికొచ్చిన రొయ్యలన్నీ వరదలకు కొట్టుకు పోయి రైతులకు విషాదం మిగిలిందని, వేల కోట్ల రూపాయలు నష్టపోయిన వారందరినీ ముఖ్యమంత్రి తక్షణం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

లెవీ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపి వేయడం వల్ల రైతులు దారుణంగా నష్ట పోతున్నారని తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరించాలని ఆయన కోరారు. ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం అదనంగా కలిపి అన్ని పంటలకు గిట్టుబాటు ధరను నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అందరూ స్వామినాథన్ సిఫార్సుల గురించి మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన విమర్శించారు.

 సీసీఐ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి
 గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో 38 మంది పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క ప్రకాశంలోనే 18 మంది చనిపోయారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి ప్రత్తిని కొనుగోలు చేయాల్సిన సీసీఐ సంస్థ వ్యాపారులతో కుమ్మక్కయిందనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అనర్హత ఫిర్యాదుపై నిర్ణయం వెలువడక పోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఎంపీ వి.వరప్రసాద్ తెలిపారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా టీడీపీ సమావేశాలకు వెళుతున్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని, ఆమె విషయాన్ని కూడా విడిచి పెట్టబోమన్నారు.
Share this article :

0 comments: