
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తిండి లేక ప్రజలు అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాధిత ప్రజలకు సరఫరా చేస్తున్న ఆహారం బాగా పాడై విషతుల్యంగా మారుతోందని దానిని తినడానికే జనం భయపడి పోతున్నారని అన్నారు.
తుపాను హెచ్చరికలు వెలువడగానే సహాయక చర్యల్లో భాగంగా నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వంటి చర్యలు చేపట్టాలని, అలాంటివేమీ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.అధికారుల మధ్య సమన్వయం లేదని, ప్రజా ప్రతినిధుల మధ్య కూడా అప్రమత్తత కొరవడిందన్నారు.
ఐదు రోజులుగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతుంటే ఆ ప్రాంతాల్లో పర్యటించాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదన్నారు. బుధవారం చిత్తూరు మేయర్ అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్లారు కనుక పనిలో పనిగా కొంత సేపు ఏరియల్ సర్వే చేసి వాతావరణం అనుకూలించలేదని తిరిగి వచ్చేశారన్నారు. బుధవారం సరే.. గురువారమైనా పర్యటించవచ్చుకదా? అని బొత్స ప్రశ్నిం చారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌదురి బీరేంద్రసింగ్ రాష్ట్రంలో కరువు ఉన్నట్లే తమ దృష్టికి రాలేదని చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయాల్సిందేనన్నారు. గిరిజనులను దోచుకోవడానికే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
0 comments:
Post a Comment