అడ్డొచ్చారో.. ఈడ్చి పడేయిస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడ్డొచ్చారో.. ఈడ్చి పడేయిస్తా

అడ్డొచ్చారో.. ఈడ్చి పడేయిస్తా

Written By news on Sunday, November 8, 2015 | 11/08/2015


అడ్డొచ్చారో.. ఈడ్చి పడేయిస్తా
♦ మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని
♦ కొల్లేరు అభయారణ్యంలో అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం
♦ అటవీ అధికారులపై దౌర్జన్యం..
♦ కైకలూరు స్టేషన్‌లో సిబ్బంది ఫిర్యాదు

 కైకలూరు (కృష్ణా): దెందులూరు అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి శివాలెత్తిపోయారు. ఆయన అక్రమ దందా పశ్చిమ నుంచి కృష్ణాకు పాకింది. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి ఘటన మరువకముందే అటవీశాఖ అధికారులపై చింతమనేని ప్రతాపం చూపి హంగామా సృష్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణాజిల్లా ఆటపాక నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక చేరడానికి ఆటపాక పక్షుల కేంద్ర చెరువు గట్టు మార్గంగా ఉంది. అభయారణ్య పరిధిలోని ఈ గట్టుపై కొల్లేరు 120 జీవో ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్న చింతమనేని.. తన అనుచరగణంతో చెరువు గట్టుపై గ్రావెల్ రోడ్డును దగ్గిరుండి వేయించారు. అడ్డొచ్చిన అటవీ అధికారులను అనుచరగణంతో ఈడ్చి పారేయించారు. ఆ సమయంలో అక్కడి ప్రజలెవరూ రాకుండా కాపలా ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి సుమారు 70 ట్రాక్టర్ల గ్రావెల్‌ను ఆటపాక రహదారి నిర్మాణానికి తరలించారు.

 బీట్ ఆఫీసర్ ఈడ్చివేత..: విషయం తెలుసుకుని ఆపడానికి వచ్చిన అటవీశాఖ ఫారెస్టు బీట్ ఆఫీసర్ బి.రాజేశ్‌ను అక్కడి నుంచి విచక్షణారహితంగా ఈడ్చిపారేశారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా నిలపిన సిబ్బంది వాహనాన్ని అనుచరులు పక్కకు నెట్టేశారు. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, పనులు ఆపకపోతే తన ఉద్యోగం పోతుందని రాజేశ్ బతిమలాడినా లెక్క చేయలేదు. తనపై కేసు పెట్టుకోవాలపి.. రోడ్డు పనులను ఆపితే  ఊరుకోబోనని చింతమనేని హెచ్చరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.ఈశ్వరరావు, బేస్‌క్యాంపు సిబ్బంది ఆర్.నరేశ్‌ను ఎమ్మెల్యే అనుచరులు తోసేశారు. ఓ వైపు వివాదం నడుస్తుండగానే మరోవైపు రోడ్డు నిర్మాణం రాత్రి 3.30 గంటలకు పూర్తయింది. అనంతరం చింతమనేని తమ వాహనాల్లో అనుచరగణంతో సహా వెళ్లిపోయారు.

 అక్రమ మేతల రవాణాకు రాచమార్గం..
 వివాదానికి కారణమైన కోమటిలంక గ్రామం.. చింతమనేని నియోజకవర్గ పరిధిలో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిలంక కొల్లేరు అభయారణ్యంలో వందలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వెలిశాయి. చింతమనేనికి బినామీ పేరుతో 360 ఎకరాల  చెరువులు ఉన్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి నుంచి మేతలు రవాణా చేయాలంటే రహదారి సౌకర్యం లేదు. ఆటపాక పక్షులు దొడ్డిగట్టు నుంచి మాత్రమే తరలించే అవకాశం ఉంది. దీంతో స్థానికుల ఆకాంక్షను ముందు పెట్టి ఆక్రమార్కులకు అవసరమైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారనే విమర్శలున్నాయి. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్  నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం  చర్చనీయాంశమైంది.

 పోలీసులకు ఫిర్యాదు.. : తమ విధులను అడ్డుకుని, సిబ్బందిపై దౌర్జన్యం చేశారని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోమటిలంక సర్పంచి జొన్నలగడ్డ శ్యాంబాబు, ఎంపీటీసీ గడిదేసి డేవిడ్‌రాజు, గ్రామపెద్దలు మంగర నాగరాజుపై అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసరు (డీఆర్వో) జి.ఈశ్వరరావు కైకలూరు టౌన్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసు కేసుతో పాటు, అభయారణ్య చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

 చింతమనేనిపై అటవీశాఖ కేసు నమోదు
 అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, ఎలాంటి అనుమతులు లేకుండా అభయారణ్య పరిధిలో రోడ్డు వేయడంపై అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు ఫిర్యాదు మేర కు వ్యణ్యప్రాణి అభయారణ్య చట్టం-1972 ప్రకారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై శనివారం కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్ 27, 29, 51 ప్రకారం కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే కైకలూరు టౌన్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి అటవీశాఖ అందించిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్‌ను వివరణ కోరితే  ఇటు ఫారెస్టు, అటు పోలీసు కేసు నమోదుపై ఉన్నతాధికారుల సలహాలను కోరుతున్నామని చెప్పారు.

http://www.sakshi.com/news/district/again-misbehaved-tdp-mla-chintamaneni-289606?pfrom=home-top-story
Share this article :

0 comments: