హోదా కోసం కాకినాడలో యువభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదా కోసం కాకినాడలో యువభేరి

హోదా కోసం కాకినాడలో యువభేరి

Written By news on Tuesday, November 10, 2015 | 11/10/2015


హోదా కోసం కాకినాడలో యువభేరి
హాజరుకానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 
తూర్పుగోదావరి జిల్లా నేతల సమావేశంలో నిర్ణయం


 సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఆఖరు వారంలో కాకినాడలో యువభేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై విద్యార్థులు, నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తూర్పు గోదావరి జిల్లా పార్టీ నేతల సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ఈ సభ జరిగే అవకాశం ఉందని, బహుశా కాకినాడలోనే నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన ప్రత్యేక హోదా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలపై నిరుద్యోగులు, విద్యార్థులకు సభలో వివరించి జాగృతం చేయాలని జగన్ సంకల్పించారన్నారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను కూడా ప్రజల దృష్టికి తెచ్చి హోదా కచ్చితంగా ఇవ్వాలని ఒత్తిడి తెస్తారని తెలిపారు. విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమొక్కటే మేలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ భావిస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని, కానీ చంద్రబాబు దోపిడీ చేయడానికే ప్యాకేజీ కావాలంటున్నారని విమర్శించారు.

 ఆందోళనలో రైతాంగం
 తూర్పుగోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట చేతికి వచ్చే తరుణంలో కేంద్రం లెవీ ఎత్తివేయడంతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై స్పష్టత లేదని, దీంతో రైతాంగం యావత్తూ ఆందోళనలో ఉందని ధర్మాన తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం టీడీపీ వారితో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల ఆగడాలు నియోజకవర్గాల్లో పెరిగిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.

పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నా, వీధిలైట్లు వేయాలన్నా వారి వద్ద నిధుల్లేకుండా చేశారన్నారు. 18 నెలల కాలంలో ఆరే డుసార్లు మంత్రివర్గ సమావేశాల్లో చర్చించినా ఇసుక ధరలు తగ్గలేదని, సామాన్యులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయడం, నిర్మించడం గానీ చేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమస్యలన్నింటినీ పార్టీ నేతలు జగన్ దృష్టికి తెచ్చారన్నారు. త్వరలో పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను నియమించాలని జగన్ వారిని ఆదేశించారని, ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యక్రమంపై కూడా చర్చించామని చెప్పారు. బాగా పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు ఆమోదిస్తారని, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండదని బీహార్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ధర్మాన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Share this article :

0 comments: