బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్

బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్

Written By news on Friday, December 11, 2015 | 12/11/2015


బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరిక

♦ తక్షణం జీవో 97 రద్దు చేయాలి
♦ గిరిజన సలహా మండలిని నియమించాలి
♦ బాక్సైట్‌ను అంగుళం కూడా కదలనివ్వం
♦ చంద్రబాబు మోసాలను సాగనివ్వం
♦ గిరిజనులకు అండగా ఉండి పోరాడతాం
♦ ప్రతిపక్షంలో ఉండగా ఓమాట..
♦ సీఎం అయ్యాక మరోమాట గతంలో సీఎంగా ఉండగా దుబాయ్ కంపెనీతో బేరాలు
♦ బాబుకన్నా మోసగాడు దేశంలోనే లేడు
♦ గిరిజనుల మనోభావాలు గమనించి మైనింగ్ యత్నాలు ఆపేసిన వైఎస్‌ఆర్
♦ వాస్తవాలను వక్రీకరిస్తూ బాబు శ్వేతపత్రం

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు పూనుకుంటే ఊరుకునేది లేదని విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. బాక్సైట్ మైనింగ్‌పై ఇచ్చిన జీవో 97ను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గనులు తవ్వడానికి ప్రయత్నిస్తే ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి బాక్సైట్‌ను బైటకు పోనిచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు. గిరిజనులకు అన్ని రకాలుగా అండగా  ఉంటామని, కలసికట్టుగా పోరాడతామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును మించిన మోసగాడు దేశంలోనే లేడని జగన్ విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో  ‘విశాఖ బాక్సైట్ గిరిజనుల హక్కు’ అనే నినాదంతో గురువారం సదస్సును నిర్వహించింది.

సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన జగన్ అనకాపల్లి, తంగేడుల మీదగా చింతపల్లి చేరుకున్నారు. అశేష గిరిజనులతో క్రిక్కిరిసిన ఈ సదస్సులో అల్లూరి సీతారామరాజు వేదికపై నుంచి  ఆయన ప్రసంగించారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న ప్రభుత్వ కుట్రను అడ్డుకుని తీరుతామన్నారు. బాక్సైట్ మైనింగ్ వద్దు అని లక్షల గొంతులు ఒక్కటై చెబుతున్నా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావడం లేదని విమర్శించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే....

 ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట... సీఎం అయ్యాక మరో మాట
 చంద్రబాబు మొదటిసారి  సీఎంగా ఉన్నప్పుడే బాక్సైట్ మైనింగ్ కోసం ప్రయత్నించారు. మైనింగ్ చట్టాలు సవరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. తరువాత ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ మైనింగ్ జరగనివ్వనని మాటలు చెప్పారు. గ్రామసభలు కూడా  జరగలేదు అని 2011లో గవర్నర్‌కు లేఖ రాశారు. అదే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో మాటమార్చేశారు. గ్రామసభలు జరిగాయట. బాక్సైట్ మైనింగ్ కావాలని జెర్రెల గ్రామసభ తీర్మానించిందని శ్వేతపత్రంలో  చెప్పారు. ఇప్పుడు విజయకుమారమ్మ జెర్రెల సర్పంచ్‌గా ఉన్నారు.

ఇప్పుడు విజయకుమారమ్మను అడుగుతున్నా... గతంలో బాక్సైట్ మైనింగ్ కోసం తీర్మానం చేశారా ( విజయకుమారమ్మ తమ గ్రామసభలో ఎలాంటి తీర్మానం చేయలేదని చెప్పారు. తాను రికార్డులు పరిశీలించానని తీర్మానం చేసినట్లు ఎక్కడా లేదని అన్నారు). గతంలో టీడీపీకి చెందిన వెంకటరమణ సర్పంచ్‌గా ఉండేవారు. ఆయన ప్రస్తుతం చింతపల్లి మార్కెట్‌కమిటీ డెరైక్టర్ కూడా. ఆయన కూడా బాక్సైట్ మైనింగ్ కోసం ఆనాడు గ్రామసభ తీర్మానం చేయలేదని చెబుతున్నారు.  గ్రామసభలు జరిగి ఉంటే పుస్తకాల్లో రాసి ఉండాలి. కానీ ఆ పుస్తకాల్లో గ్రామసభలు జరిగినట్లు లేదని సర్పంచ్ చెబుతున్నారు.

 దుబాయోళ్లకు ఇచ్చేందుకు ఆనాడే బాబు కుట్ర  
 చంద్రబాబు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్‌గనులను తవ్వడానికి ప్రయత్నించారు. అప్పట్లో ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకునేట్లు చేశారు.  గనుల తవ్వకాలు జరపాలంటే రాష్ట్రప్రభుత్వానికి, గిరిజనులకు మాత్రమే హక్కు ఉందని యాక్ట్ చెబుతోంది. కానీ చంద్రబాబు 24-5-2000లో ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అందులోని తన ఎమ్మెల్యేల చేత బలవంతంగా ఓ తీర్మానం చేయించారు. గనులు గిరిజనులే కాదు.. ఎవ్వరైనా తవ్వుకోవచ్చనేదే ఆ  తీర్మానం. అలా బాక్సైట్ గనులను దుబాయోళ్లకు ఇచ్చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అంతేకాదు మైనింగ్ చట్టాలను మార్చాలని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాస్తో కూస్తో వెనుకడుగు వేయబట్టి సరిపోయింది. ఆ తరువాత బాబు పాలన పోయింది కాబట్టి బాక్సైట్ మైనింగ్ జరగలేదు.

 గిరిజనుల మనోభావాలు గుర్తించిన వైఎస్సార్
 ప్రభుత్వం మైనింగ్ జరపడం వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి చంద్రబాబు చేసినా... రాజశేఖరరెడ్డి చేసినా జగన్మోహన్‌రెడ్డి చేసినా తప్పు తప్పే అవుతుంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడచుకోవాలి. ఆ రోజు వైఎస్సార్ కాస్తో కూ స్తో ముందుకు వెళ్లినా ప్రజల మనోభావాలు గుర్తించిన తరువాత బాక్సైట్ మైనింగ్ ఆపించేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాను చెప్పినట్లు చేస్తుందని తెలిసినా కూడా బాక్సైట్ గనుల సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ కోసం ప్రయత్నించ లేదు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఆయన బాక్సైట్ మైనింగ్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వైఎ స్సార్ చేయాలనుకుని ఉంటే ఆ రోజే బాక్సైట్ మైనింగ్ జరి గేది. గిరిజనుల మనోభావాలను గౌరవించారు కాబట్టే ఆయన ముందడుగు వేయలేదు. అందుకే ఆయన హయాంలో బాక్సైట్ మైనింగ్ జరగలేదు.

 కేంద్రంపై ఒత్తిడిచేసి అనుమతి సాధించిన బాబు
 వైఎస్సార్ చనిపోయిన ఆరేళ్ల తరువాత చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇవాళ బాక్సైట్ మైనింగ్ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ గనులకు వ్యతిరేకంగా తానే పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. 2011లో గిరిజన ప్రాంతానికి ‘జేసీ కాలా’ చైర్మన్‌గా నలుగురు సభ్యుల హైలెవెల్ కమిటీ వేసిన మాట వాస్తవం కాదా?  అపుడు చంద్రబాబు గవర్నర్‌కు లేఖరాయడం నిజం కాదా? ఆ  జేసీ కాలా కమిషన్ ఇక్కడకు వచ్చి నివేదిక ఇస్తే ఆ నివేదికను కేంద్రం పక్కన పెట్టింది. సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఇపుడు మళ్లీ బాక్సైట్ మైనింగ్ అంశాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాలుగుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. 10-5-2014, 23-02-15, 21-07-15, 5-8-15తేదీల్లో లేఖలు రాశారు. చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినందునే 17-8-15న కేంద్రప్రభుత్వం బాక్సైట్ మైనింగ్‌కు అనుమతి ఇచ్చింది.

 జీవో అబయన్స్‌లో పెట్టామంటూ మోసం
 బాక్సైట్ మైనింగ్ కోసం జీవో 97 జారీచేసింది చంద్రబాబే. గిరిజనులు ఆందోళనలు  చేస్తుంటే తనకు తెలియకుండానే జీవో వచ్చిందని అంటారు. ఆ  జీవోను పెండింగ్‌లో పెట్టాను, అబయన్స్‌లో పెట్టాను అంటారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా చేయాలంటే  జీవో ఇస్తుంది. వద్దు అనుకుంటే ఆ జీవోను ఉపసంహరించుకుని రద్దు చేస్తుంది. కానీ ఇలా  పెండింగ్‌లో పెట్టాను... అబయన్స్‌లో పెట్టాను అని ఏ ప్రభుత్వమూ చెప్పదు. అబద్దాలు  మోసాలతో బతికే ఈ మనిషి చివరికి ఈ జీవో కూడా అబయన్స్‌లో పెట్టాను అని ప్రజలను మోసం చేస్తున్నారు.  చంద్రబాబుకు  చిత్తశుద్ధి ఉంటే ఈ జీవోను ఉపసంహరించుకుని బాక్సైట్‌మైనింగ్‌ను రద్దు చేస్తున్నాను అని ఎందుకు చెప్పడం లేదు.

 చంద్రబాబు జీవితమంతా మోసం
 ‘చంద్రబాబు జీవితమంతా మోసం... మోసం ... మోసం అనే మూడు పదాల మీదే జరుగుతోంది. ఎన్నికల ముందుకు వెళితే... ఇంటికి వెళ్లి టీవీ ఆన్‌చేయగానే మనకు కనిపించిందేమిటి?... వినిపించిందేమిటి?... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్నారా లేదా...  డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని అన్నారా లేదా... జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారా లేదా... జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారా లేదా... తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే బాక్సైట్‌మైనింగ్‌ను తీసేస్తానని అన్నారా లేదా.... (సభకు హాజరైన వేలాదిమంది గిరిజనులు  రెండు చేతులు ఎత్తి అవును అవును అని నినదించారు).

చంద్రబాబు నాయుడు ఇంతవరకు చెప్పింది ఒక్కటైనా చేశారా? (గిరిజనులు అంతా లేదు లేదు అని గట్టిగా చెప్పారు). ఇంతకన్నా మోసగాడు దేశంలో ఎవరూ ఉండరు.  డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాదైంది. తల్లిదండ్రులు తమ ఆస్తులు అమ్మి మరీ ఫీజులు కట్టారు. పిల్లలు నగరాలకు వచ్చి హాస్టళ్లలో ఉండి ట్యూషన్లు చదువుతూ పరీక్షలు రాశారు. కానీ ఏడాదైనా వారికి ఉద్యోగాలు ఇవ్వనేలేదు. సరికదా క్లస్టర్‌విధానమని ఉన్న స్కూళ్లను కూడా మూసివేస్తున్నారు. ఇప్పుడు 7వేల మంది టీచర్లు ఎక్కువగా ఉన్నారని ఆ పోస్టులు తీసేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థుల తరపున గట్టిగా పోరాడతాం’.

 గిరిజన సలహా మండలిని ఎందుకు నియమించలేదు
 గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్) ఎందుకు వేయలేదని చంద్రబాబును  నిలదీస్తున్నా. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5ఏ ప్రకారం గిరిజన సలహామండలి ఏర్పాటు చేయడం గిరిజనుల రాజ్యాంగ హక్కు. ఆ కౌన్సిల్‌లో మూడొంతుల మంది సభ్యులుగా గిరిజన ఎమ్మెల్యేలే ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో 7 గిరిజన శాసనసభ స్థానాలు ఉంటే అందులో ఆరింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. గిరిజన సలహా మండలి వేస్తే అందులో  వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉంటారు. బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తారు. అదే జరిగితే బాక్సైట్ గనులు తవ్వుకోవాలన్న బాబు కుట్ర సాగదు. కాబట్టే అసలు గిరిజన సలహామండలినే వేయకుండా చంద్రబాబు  వాయిదా వేస్తున్నారు. అయితే అది ఎక్కువ రోజులు సాగదు. గట్టిగా ఒత్తిడి తెస్తాం.ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ వేయిస్తాం. అందులో బాక్సైట్ మైనింగ్‌ను గట్టిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తాం.
Share this article :

0 comments: