
జమ్మలమడుగులో రాజన్న బిడ్డకు నీరాజనం
మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు, నేతలు
ఆద్యంతం ఆసక్తిగా సాగిన పర్యటన
(జమ్మలమడుగు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో ఆయన అసలు రూపం బయటపడింది. ఇప్పుడు జన్మభూమి కమిటీ పేరుతో పచ్చటి పల్లెల్లో చిచ్చు రేపుతున్నారు. పింఛన్ల పంపిణీ, రేషన్ సరుకులు ఇచ్చే విషయంలోనూ జన్మభూమి కమిటీ పెత్తనం పెరిగిపోయింది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి’ అని వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజన్న హయాంలో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందేవని గుర్తుచేసుకున్నారు. అందరి కష్టాలు తీరే రోజులు త్వరలోనే వస్తాయని ఆయన వారికి భరోసానిచ్చారు. శనివారం మధ్యాహ్నం జమ్మలమడుగు చేరుకున్న జగన్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రాయపల్లె మునిరెడ్డి కుమారుడు సురేందర్‌రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అక్కడే ఆయన్ను ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం వద్దిరాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రామాంజనేయ యాదవ్ కుమార్తె మహాలక్ష్మి దంపతులను ఆశీర్వదించారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దన్నవాడ మహేశ్వరరెడ్డి తండ్రి అనారోగ్యంతో ఉన్నాడన్న విషయం తెలుసుకుని ఇంటికివెళ్లి పరామర్శించారు. అంతకుముందు దన్నవాడ సర్కిల్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికార పార్టీ నేతలు కూడా జగన్‌ను కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
అడుగడుగునా బ్రహ్మరథం...
జిల్లా పర్యటనలో భాగంగా శనివారం జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందకుపైగా వాహనాలు కాన్వాయ్‌గా కదిలాయి. అడుగడుగునా ఆడపడుచులు పూలవర్షంతో స్వాగతం పలికారు. కరచాలనంకోసం యువకులు, మహిళలు, వృద్ధులు, పార్టీ కార్యకర్తలు పోటీ పడ్డారు. దీంతో జమ్మలమడుగు నుంచి 20 కిలోమీటర్లు ఉన్న వద్దిరాలకు వెళ్లేందుకు సుమారు 5 గంటలు పట్టింది. పర్యటనలో జగన్ వెంట కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment