రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ

రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ

Written By news on Wednesday, December 30, 2015 | 12/30/2015


సింగపూర్‌తో ఒప్పందాలన్నీ బయటపెట్టండి
♦ వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్
♦ రాజధాని ముసుగులో రూ.లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతోనూ, ప్రైవేటు కంపెనీలతోనూ ఇప్పటివరకూ చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తక్షణమే బయట పెట్టి చర్చించాలని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సింగపూర్ మంత్రి ఈశ్వరన్, అధికారులు చంద్రబాబుకు వ్యాపార భాగస్వాములేనని తాము చెప్పినవన్నీ ఇపుడు నిజాలవుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై సింగపూర్ ప్రభుత్వం తరపున మంత్రి ఈశ్వరన్ సమక్షంలో సంతకాలు చేసిన టో యెంగ్ అనే అధికారి ఇపుడు అక్కడ తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

మాస్టర్‌ప్లాన్ తయారు చేసిన రెండు సింగపూర్ కంపెనీలు విలీనమై ఏర్పడిన కంపెనీకి టో యెంగ్ సీఈఓగా నియమితులయ్యారని తెలిపారు. దీన్ని బట్టి ప్రజల ధనాన్ని దోపిడీ చేయడానికి చంద్రబాబు, ఆయన వందిమాగధులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు. ఉన్నత స్థానంలో ఉన్న ఒక ప్రభుత్వాధికారి సంతకాలు చేశాక ఆ పదవి నుంచి తప్పుకుని అదే సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థకు సీఈఓగా వస్తున్నారంటే ఇందులో ఎంత మాయాజాలం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థ తరపున  సంతకం చేసిన టో యెంగ్ తప్పుకున్న తరువాత ఇంకా ఆ ఒప్పందాలు అమలులో ఉన్నట్లా లేనట్లా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని కోసమని ప్రజల దగ్గరి నుంచి తీసుకున్న భూములను ఇలా సింగపూర్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేసి టీడీపీ ప్రభుత్వం తన ధనదాహం తీర్చుకుంటున్న మాట వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎవరికీ పనులు ఇవ్వరాదని, అంతర్జాతీయ టెండర్లను మాత్రమే పిలిచి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం ఈ విధానంపై నియమించిన కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుందని వివరించారు. అలాంటపుడు ఇక్కడ(ఏపీలో) స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అందుకే తొలి నుంచీ ఇందులో జరిగిన ప్రతి ఒప్పందాన్ని బయట పెట్టాలని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేయవద్దని బొత్స హెచ్చరించారు.

 లోకేష్ కోసమే అభీష్ట బలి
 రాజ్యాంగేతర శక్తిగా అవతరించిన చంద్రబాబు కొడుకు లోకేష్‌బాబు కోసమే సీఎంవోలో ఓఎస్డీగా పని చేస్తున్న అభీష్టను రాజీనామా చేయించారని బొత్స విమర్శించారు. అభీష్ట అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే అభియోగం మోపడం సరికాదని, లోకేష్, చంద్రబాబు చెబితేనే ఆయన జోక్యం చేసుకుని ఉంటారనే విషయం మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: