తక్షణమే జోక్యం చేసుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తక్షణమే జోక్యం చేసుకోండి

తక్షణమే జోక్యం చేసుకోండి

Written By news on Wednesday, December 16, 2015 | 12/16/2015


తక్షణమే జోక్యం చేసుకోండి
  • గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ- సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాల్సిందిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, గిరిజన సలహా మండలిని తక్షణం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ రెండు అంశాల్లోనూ గవర్నర్‌ను నేరుగా జోక్యం చేసుకోవాల్సిందిగా కోరడంతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న మాఫియా వ్యవహారాలను ఆయన దృష్టికి తెచ్చారు. జగన్ మంగళవారం మధ్యాహ్నం పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలసి గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయి రెండు వేర్వేరు వినతిపత్రాలను సమర్పించారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఆర్.సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు ఆయన వెంట గవర్నర్ వద్దకు వెళ్లారు. అరగంట సేపు గవర్నర్‌తో సమావేశమైన జగన్ ప్రధానంగా బాక్సైట్ తవ్వకాల విషయంలో టీడీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలు, గిరిజన మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై హత్యాయత్నం కేసు పెట్టడం, కాల్‌మనీ కేసులో అధికార పార్టీ నేతల ప్రమేయం, చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ ఉండటం వంటి అంశాలన్నింటినీ వివరించారు. అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన అంశాలివీ...
కాల్‌మనీలో చంద్రబాబు డబ్బు
విజయవాడలో వెలుగులోకి వచ్చిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహరంతో యావత్ ఆంధ్రప్రజలు సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది. కాల్‌మనీ పేరుతో అధిక వడ్డీకి డబ్బులిచ్చి అది తిరిగి కట్టలేని స్థితిలో ఉన్న మహిళల మాన ప్రాణాలతో సిగ్గు లేకుండా ఆడుకున్నారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, మంత్రుల డబ్బు మాత్రమే కాదు చంద్రబాబు డబ్బు కూడా ఉంది. అందుకే కాల్‌మనీ నడిపిస్తున్న వారితో కలిసి టీడీపీ ఎమ్మెల్యేల విదేశీ పర్యటనల ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చినా వారిపై కేసులుండవు. ఎమ్మెల్సీ, ఆయన అన్న దొరికినా కేసులు పెట్టరు. పోలీసులు దాడులు చేస్తే ఆయా ప్రాంగణాల్లో 200కు పైగా వీడియో టేపులు దొరికాయి. ఆడవాళ్లను అసభ్యంగా తీసిన టేపులవి. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తిరిగి కట్టలేని మహిళలను లోబర్చుకుని ఆ వృత్తిలోనే ఎప్పటికీ కొనసాగించేలా, వారిని దోపిడీ చేసే దుర్మార్గమైన ఆలోచన ఇది. వడ్డీ వ్యాపారం మాటున సెక్స్ రాకెట్‌గా మారిన క్షమించరాని నేరం ఇది. ఇంతటి దిగజారిన చర్యలకు పాల్పడే వారిని ఉరి తీయాలి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎవరి మీదా చర్య తీసుకోరు. కాల్‌మనీ నిందితులతో సాక్షాత్తూ ఇంటెలిజెన్స్ డీజీయే కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీన్ని బట్టి ఈ రాకెట్ ఎంత విసృ్తతంగా పాకి పోయిందో అర్థం అవుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రికి కూడా ఇందులో సంబంధాలున్నట్లు తేలిపోతోంది. ఇవే అంశాలను గవర్నర్ వద్ద ప్రస్తావించాం.
ఇది మాఫియాల ప్రభుత్వం...
చంద్రబాబు ప్రభుత్వం మాఫియాలను నడుపుతోంది. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా, చివరకు సెక్స్ రాకెట్ మాఫియాలన్నింటినీ చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ-గుంటూరు నగరాలను మాఫియాల నగరంగా మార్చేశారు. సీఆర్డీయే పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని ఈడ్చుకు వె ళ్లినా ఒక్క కేసు ఉండదు. చంద్రబాబు చివరకు ఆ ఎమ్మార్వోనే తిడతారు. ప్రభాకర్ కొల్లేరులో అటవీ అధికారులను బెదిరించి రోడ్డు వేసుకున్నా, ఆడవాళ్లని కూడా చూడకుండా అంగన్‌వాడీలను నోటికొచ్చినట్లు తిట్టినా కేసు పెట్టరు. ప్రభాకర్‌కు, చంద్రబాబుకు వ్యతిరేకంగా అంగన్‌వాడీ మహిళలు ధర్నాలు కూడా చేశారు. వీటన్నింటికీ మీడియా సాక్షి. అయినా చంద్రబాబు ఆయన్ను పిలిచి కనీసం మందలించనైనా లేదు. సీఆర్‌డీఏ పరిధిలో చంద్రబాబు బినామీలు భారీగా భూములు కొన్నారు. భూసేకరణలో వారి భూములను వదిలేసి, పేదల భూములను మాత్రమే లాక్కున్నారు. చంద్రబాబే సాక్షాత్తూ లిక్కర్ మాఫియాను నడుపుతున్నారు. ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కువగా ప్రతిషాపులోనూ అమ్ముకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కింది నుంచీ పైదాకా, తెలుగుదేశం నేతల నుంచీ చంద్రబాబు దాకా పైవరకూ ప్రతి షాపు నుంచీ డబ్బులు పోతాయి. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మడమే కాదు, ఇంకో అడుగు ముందుకు వేసి కల్తీ మద్యం కూడా అమ్ముతున్నారు. అయినా కేసులుండవు. వ్యవహారం బయట పడినపుడు నామ్‌కే వాస్తేగా ఒక కానిస్టేబుల్‌నో, ఒక ఎస్సైనో సస్పెండ్ చేసి సరిపెడతారు.
 గిరిజన సలహా మండలి రాజ్యాంగం కల్పించిన హక్కు
ప్రతిపక్షంలో ఉన్నపుడు, ఎన్నికల సమయంలోనూ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు ఇవాళ లంచాలు తీసుకుని ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రంలో గిరిజన సలహా మండలి (ట్రైబ్స్ అడ్వయిజరీ కౌన్సిల్)ని కచ్చితంగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలులోని నాలుగో పేరాలో ఉంది. ఈ మండలిలో మూడొంతుల సభ్యులు గిరిజన ఎమ్మెల్యేలే ఉండాలని కూడా స్పష్టంగా ఉంది. ఏపీలోని ఏడు ఎస్‌టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలే గెలిచారు. అందువల్ల ఈ మండలిలో మూడొంతులు వైఎస్సార్‌సీపీ సభ్యులే ఉంటే తాను తీసుకునే నిర్ణయాలను అడ్డుకుంటారనే చంద్రబాబు నాయుడు ఈ మండలిని ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులతో చెలగాటం ఆడటం సరైనది కాదు. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం.
 బాబుపై హత్యాయత్నం కేసు పెట్టారా?
 చింతపల్లి బాక్సైట్ వ్యతిరేక సభలో మా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రతి గిరిజనుడు సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల నరుకుతాడు... అని చెప్పిన విషయాన్ని భూతద్దంలో చూపించి ఆమెపై ఏకంగా 307 (హత్యాయత్నం) కేసు మోపి వేధిస్తున్నారని గవర్నర్‌కు చెప్పాం. మీ అంతు చూస్తా, మీ అంతు చూస్తా... అని చంద్రబాబు అసెంబ్లీలో అనేకసార్లు వేలు పెకైత్తి చూపిస్తూ మమ్మల్ని బెదిరించారు. అంతు చూస్తానంటే మమ్మల్ని అందరినీ చంపేస్తాననేగా అర్థం. మరి, ఆయనపై హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదు? గిరిజన మహిళా ఎమ్మెల్యే మీదనే కేసెందుకు పెడుతున్నారని గవర్నర్ వద్ద గ ట్టిగా ప్రస్తావించాం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ఒక రోజు ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్‌ను ఉద్దేశించి ‘అసెంబ్లీకి నువ్వొస్తే కదా...’ అన్నారు. వైఎస్ చనిపోయిన తరువాత అనేక బహిరంగ సభల్లో... వైఎస్ నన్ను వ్యతిరేకించారు, ఏమైంది వైఎస్ పరిస్థితి... పావురాల గుట్టలో పావురమై పోయాడు... అని అనేకసార్లు అన్నారు. దానర్థం వైఎస్‌ను తానే చంపించానని కాదా? మరి వైఎస్‌ను చంపించినందుకు చంద్రబాబుపై సీబీఐ విచారణ ఎందుకు చేయలేదు? అసలు ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు చేయలేదు? ఆయనపై 307 కేసు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు ఇన్ని మాటలు మాట్లాడినా ఆయనపై హత్యాయత్నం కేసులుండవు. కానీ గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా మా మహిళా ఎమ్మెల్యే మాట్లాడితే ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టి వేధిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం దేశంలో మరెక్కడా ఉండదు. దొంగ కేసులు పెట్టడం, వేధించడం, తమకు (ప్రభుత్వానికి) వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అణచి వేయడం పనిగా పెట్టుకున్నారు.
 వీడియో ఫుటేజీని బయటపెట్టండి
 మొన్నటికి మొన్న తిరుపతి విమానాశ్రయంలో కూడా మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసు పెట్టారు. కానీ ఆ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ మాత్రం బయటపెట్టడం లేదు. ఆరోజు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ మేనేజర్ అరగంట ముందే కౌంటర్ మూసేయడంతో 19 మంది ప్రయాణికులు ఆయనపై ఆగ్రహించారు. అక్కడే నా కోసం లాంజ్‌లో వేచి ఉన్న మా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. మా నేతలు జోక్యం చేసుకోగా ఆయన వారందరికీ క్షమాపణలు చెప్పి లోనికి పంపారు. ఈ విషయం అంతటితో ముగిసింది. కానీ అదే రోజు పొద్దు పోయిన తరువాత విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు ఆ విషయం తెలుసుకుని, కేంద్రంలో ఉన్న తమ విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ద్వారా మేనేజర్‌పై తీవ్రంగా ఒత్తిడి చేసి తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. తప్పుడు కేసులు నమోదు చేయించారు. మా ఎమ్మెల్యేను అరెస్టు కూడా చేయించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 19 మంది ప్రయాణికులు మేనేజర్‌పై లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదును ఎందుకు ముందుకు తీసుకు రావడంలేదు? విమానాశ్రయంలో సీసీ కెమెరా వీడియో ఫుటేజీని బయట పెట్టమనండి. మా ఎంపీ తప్పుంటే నేను రాజీనామా చేయిస్తాను. నేను చెప్పింది నిజమైతే చంద్రబాబును రాజీనామా చేయమనండి.
 ఆహా... ఏమి సర్వేలవి
 ఈ ప్రభుత్వం ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వమంటే... ఈరోజు కొన్ని పత్రికల్లో ప్రభుత్వం చేసి న సర్వే అంటూ విడుదల చేశారు. అది చూసినపుడు నేను ఆశ్చర్యపోయా ను. డ్వాక్రా రుణమాఫీ ఎలా ఉందని అడిగిన ఓ ప్రశ్నకు 35% మంది బాగుందని అన్నారంట. అసలు డ్వాక్రా రుణమాఫీయే జరగలేదు... అయినా బాగుందని 35% మంది చెప్పారంట. ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా రాస్తారబ్బా. ఇక పోలీసుల పనితీరు బాగుందని 75% మంది చెప్పారట. రోజుకొక కుంభకోణం, రోజుకొక మాఫియా, దొంగ కేసులు విచ్చలవిడిగా చోటు చేసుకుంటుంటే పోలీసుల పనితీరు బాగుందా! ఇసుక మాఫియా పుణ్యమా అని సామాన్యుడు ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది. ఇక మద్యం విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ తెరిచే ఉంటాయి. మహిళలు తిరగాడలేని పరిస్థితి. అయినా పోలీసుల పనితీరు బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంతటి దారుణమైన అబద్ధాలు, మోసాలతో జరుగుతున్న ఈ పరిపాలనను ప్రజలు, దేవుడు చూస్తున్నా రు. వీళ్ల సర్వేలు ఏం చెప్పినా ఎన్నికలొచ్చినపుడు ప్రజలు, దేవుడు మొట్టిక్కాయలు వేసి బుద్ధి చెబుతారు. ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీలో లేవనెత్తుతాం. సమయం వచ్చినపుడు విజయవాడలో కూడా ఆందోళన చేస్తాం.

Share this article :

0 comments: