రేపు స్పీకర్ కోడెలపై అవిశ్వాస నోటీసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు స్పీకర్ కోడెలపై అవిశ్వాస నోటీసు

రేపు స్పీకర్ కోడెలపై అవిశ్వాస నోటీసు

Written By news on Tuesday, December 22, 2015 | 12/22/2015


రేపు స్పీకర్ కోడెలపై అవిశ్వాస నోటీసు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నిష్పక్షపాతంగా వ్యవహరించనందుకు నిరసనగా ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంగళవారం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా పక్షం సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బుధవారం స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశానంతరం వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరాలు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ మీడియాతో అసెంబ్లీ జరిగిన తీరుపై వివరంగా మాట్లాడతారని చెప్పారు.

స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాన్ని అసలు విశ్వాసంలోకి తీసుకోలేదని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. అధికారపార్టీ సభ్యులు కోర్టులో ఉన్న అంశాలను సభలో ప్రస్తావించినపుడు స్పీకర్ వారిని నివారించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. సెక్స్ రాకెట్ గురించి చంద్రబాబు ప్రకటన తర్వాత మాట్లాడాల్సింది రోజాయే కాబట్టి, ఆమె వాగ్ధాటిని తట్టుకోవడం సాధ్యం కాదని.. ఆమెను నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారని అన్నారు. ఈ విషయంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ కు, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షం పట్ల స్పీకర్ అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగానే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభలో 40 నిమిషాలు మాట్లాడితే 17 సార్లు అంతరాయం కలిగించారని పేర్కొన్నారు. ఇంత దారుణంగా వ్యవహరించిన స్పీకర్ ను తనకు ఊహ తెలిసినప్పటి నుంచి, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు.
కాగా, ప్రజల అవసరాలను కాలరాస్తున్నారని, అందుకే ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, స్పీకర్ నిష్పక్షపాతంగా లేరు కాబట్టి, ప్రజల పక్షాన తాము అవిశ్వాసం పెడుతున్నామని ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి తెలిపారు. దీనికి మందబలం ప్రధానం కాదని, ఆయనపై తమకు విశ్వాసం లేదన్న విషయాన్ని తెలియజేయడానికే ఈ నోటీసు ఇస్తున్నామని ఆయన అన్నారు.
Share this article :

0 comments: