పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ బుద్దా సోదరుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ బుద్దా సోదరుడు

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ బుద్దా సోదరుడు

Written By news on Tuesday, December 15, 2015 | 12/15/2015


విజయవాడ (వన్‌టౌన్): శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావును వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్ మనీ నేరాలకు సంబంధించి నగరంలో అత్యంత పెద్ద వ్యాపారిగా ఉన్న బుద్దా నాగేశ్వరరావు ఇంటిపై పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేసి అతడిన అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోదరుడు బుద్దా వెంకన్నను అడ్డం పెట్టుకొని నాగేశ్వరరావు అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. అందులో రూ.3 లక్షల నగదు, 25 ప్రామిసరీ నోట్లు, పలు విలువైన ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షల్లో అప్పులిచ్చి కోట్ల రూపాయాల విలువైన ఆస్తులను స్వల్ప కాల వ్యవధిలోనే చెల్లించలేదని వాటిని కాజేసినట్లు నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. మరో మూడు బృందాలు కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లపై దాడి చేశాయి. అందులో రౌడీషీటర్‌గా ఉన్న లంకలపల్లి సతీష్ ఇంటిపై దాడి చేయగా అతని ఇంట్లో రోజువారి చిట్ వివరాలను రాసే చిన్నసైజు ఖాళీ పుస్తకాలు 64 దొరికాయి. మొయిన్ బజార్‌లో స్వీట్స్ వ్యాపారం చేసే సముద్రాల నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఎటువంటి పత్రాలు, నగదు లభించలేదు. నాలుగో వ్యక్తిగా ఉన్న మరో రౌడీషీటర్ లంకలపల్లి మల్లేశ్వరరావు (మల్లి) మాచవరం గంగిరెద్దులదిబ్బ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతని ఇంటికి వెళ్లేసరికి మల్లి పరారవ్వగా.. ఇంట్లో సోదాలు చేయగా రూ.4 లక్షల నగదు, పలు చెక్కులు, ప్రామిసరీ నోట్లు లభించాయి. మల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బుద్దా నాగేశ్వరరావుకు పోలీసులు రాచమర్యాదలు!
కాల్‌మనీ వ్యాపారి బుద్దా నాగేశ్వరరావుకు వన్‌టౌన్ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న విషయం బయటకు రావడంతో మీడియా అంతా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. నాగేశ్వరరావును మీడియాకు చూపించాలని పదేపదే అడిగినా సీఐ పి.వెంకటేశ్వర్లు అందుకు నిరాకరించారు. నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించారని, అందులో బుద్దా నాగేశ్వరరావును గుర్తించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉన్నత అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నాగేశ్వరరావును మీడియా కంట పడకుండా దాచిపెడుతున్నారని పలువురు ఆరోపించారు

http://www.sakshi.com/news/district/budha-nageswararao-under-police-controle-298180?pfrom=home-top-story
Share this article :

0 comments: