టార్గెట్ వైసీపీ.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టార్గెట్ వైసీపీ..

టార్గెట్ వైసీపీ..

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015


టార్గెట్ వైసీపీ..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కుంభకోణాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపిన పాలకులు ఇప్పుడు వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా ఆర్థిక దాడులకు, వేధింపులకు తెగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపే పేరిట పోలీసులు కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులనే టార్గెట్ చేస్తున్నారు. ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలు ఎస్టీడీ వడ్డీలతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నా వారి జోలికి వెళ్లే సాహసం చేయలేని పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు ఒక్కరోజు వ్యవధిలో చోటుచేసుకున్న ఘటనలే తార్కాణం.

 గుండాల ఇంట్లో చేష్టలుడిగి..
 ఏలూరు నగరంలోని చేపల తూము సెంటర్‌కు చెందిన ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండాల దుర్గారావు(జీడీఆర్) ఇంటికి మంగళవారం రాత్రి తనిఖీలకు వెళ్లిన సీఐ ఎన్.రాజశేఖర్, పోలీసు సిబ్బందికి ఆ కుటుంబ సభ్యులు చుక్కలు చూపించారు. పోలీసులని కూడా చూడకుండా చెలరేగిపోయారు. నానాయాగీ చేసి దుర్భాషలాడారు. దుర్గారావుకుమార్తె వెంటనే ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ఫోన్ చేస్తే.. ఆయన అర్ధరాత్రి  2గంటల సమయంలో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ‘ఇప్పుడేంటి హడావుడి.. తర్వాత చూద్దాం వెళ్లండి’ అనగానే మారుమాట్లాడకుండా పోలీసులు వెనక్కి వచ్చేశారు.

 పిల్లంగోళ్ల ఇంట్లో పోలీస్ షో
 అదే  సీఐ రాజశేఖర్, పోలీసులు గురువారం ఏలూరు కర్రల వంతెన  సమీపంలో ఉంటున్న వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఇంటికి సోదాలకు వెళ్లారు. వాస్తవానికి శ్రీలక్ష్మి తండ్రి రంగారావుకు వడ్డీ వ్యాపారం ఉన్నా ఆమెకు, ఆమె భర్తకు ఈ వ్యాపారంతో ఎటువంటి సంబంధాలు లేవు. అయితే, ఎన్నో చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్న కేఆర్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదును సాకుగా చూపించి గురువారం శ్రీలక్ష్మి ఇంట్లో పోలీసులు హల్‌చల్ చేశారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో కేవలం ఒక మహిళా కానిస్టేబుల్‌ను వెంట పెట్టుకుని సీఐ, ఎస్సై, 10మంది కానిస్టేబుళ్లు  ఇంట్లో అణువణువూ సోదా చేశారు. బెడ్‌రూమ్‌లు, వంట గదులే కాదు.. చివరకు బాత్‌రూమ్‌లలోనూ తనిఖీలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు లభ్యం కాకపోవడంతో వెనక్కివెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే అండ ఉన్న గుండాల దుర్గారావుపై ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణ చేపట్టకుండా వాస్తవాలను తొక్కిపెడుతున్న పోలీసులు... తండ్రి వ్యాపారంతో సంబంధం లేని పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని మాత్రం టార్గెట్ చేయడం చూస్తుంటేనే ఖాకీల పనితీరు ఏమిటో అవగతమవుతోంది.
Share this article :

0 comments: