మరింతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టేలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరింతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టేలా

మరింతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టేలా

Written By news on Thursday, December 24, 2015 | 12/24/2015


ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినా ఏకపక్షమే
స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

 సాక్షి, హైదరాబాద్: శాసన సభాపతిగా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికవడానికి తమ పార్టీ, తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ సహకారం అందజేసినప్పటికీ ఆయన తొలి సమావేశం నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. ఆయన తీరు మారుతుందని ఆశించినప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని, అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు వివరించింది.

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జోత్యుల నెహ్రూ, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, కలమట వెంకటరమణ, గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, వంతుల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, డేవిడ్‌రాజు, కొరుముట్ల శ్రీనివాసులు, శివప్రసాద్‌రెడ్డి, విశే ్వశ్వరరెడ్డిలతో కూడిన బృందం బుధవారం ఇన్‌చార్జి శాసనసభా కార్యదర్శి సత్యనారాయణను కలసి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 179 క్లాజ్ సీ ప్రకారం రాష్ట్ర శాసనసభ స్పీకర్‌పై ఏపీ శాసనసభ ప్రొసీజర్ అండ్ కండక్టు ఆఫ్ బిజినెస్ రూల్ బుక్‌లో 71(1)ను అనుసరించి నోటీసును అందజేస్తున్నట్టు తెలిపారు. ‘శాసనసభ స్పీకర్‌పై మేం విశ్వాసం కోల్పోయాం’ అని అందులో పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలసి సుజయ్‌కృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడుతూ ఏఏ కారణాలవల్ల స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వాల్సి వచ్చిందో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటలలోనే...

 ఆది నుంచీ ఏకపక్షమే..: ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వడం జరిగింది. సభాపతి అంటే పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి అన్న మంచి ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి.. కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సంపూర్ణ సహకారమందించారు. అయితే కోడెల ఆ విషయాన్ని గుర్తుంచుకోకుండా.. తొలి సమావేశంనుంచీ ఏకపక్షంగా వ్యవహరించారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత జగన్‌పై అనేక అవాస్తవాల్ని గంటల తరబడి మాట్లాడినప్పటికీ.. సభాపతిగా ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించడంగానీ, అలా మాట్లాడే సభ్యుల్ని, మంత్రుల్ని ఆపడంగానీ చేయని పరిస్థితి.

 వైఖరి మార్చుకుంటారనుకుంటే: గత సమావేశాల్లోనూ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో వైఎస్సార్‌సీపీ తరఫున నోటీసిచ్చాం.  సభాపతిపైన అవిశ్వాసం పెట్టడమన్నది తప్పనిసరి పరిస్థితుల్లోనే పెట్టాలి.. ఇప్పటికైనా ఆయన మనస్సు మార్చుకుని వ్యవహారశైలిని మార్చుకుని మిగిలిన నాలుగేళ్లు సక్రమంగా సభను నిర్వహిస్తారన్న ఆశతో ఆరోజు వెనక్కి తీసుకున్నాం. అయితే ఏమాత్రం మార్పురాకపోగా.. మరింత పక్షపాతం వహిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తప్పనిసరై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వడం జరిగింది.

 అన్యాయంగా సస్పెండ్ చేశారు: కాల్‌మనీ అంశంపై జరిగే చర్చలో పార్టీ తరఫున మొదటగా మాట్లాడడానికి రోజాను ఎంపిక చేసుకున్నాం. కానీ ఆమె మాట్లాడానికి అవకాశమివ్వకపోగా ఎదురుదాడి చేస్తూ.. ఏడాదిపాటు అన్యాయంగా సస్పెండ్ చేశారు. 340 సబ్‌రూల్ 2 ప్రకారం శాసనసభా వ్యవహారాలమంత్రి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్‌గారు కలగజేసుకుని ఆ రూల్ ప్రకారం ఏడాదిపాటు సస్పెన్షన్‌కు అవకాశం లేదని చెబుతారని ఆశించాం. కానీ స్పీకర్ డివిజన్‌కు ఓటింగ్‌పెట్టి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. శాసనసభా వ్యవహారాలమంత్రి కోట్ చేసిన రూల్‌నే స్పీకర్ కోట్ చేశారు.

 మరింతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టేలా
 మా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిందిగాక ఇంకా కొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని భయభ్రాంతుల్ని చేయాలన్న ఆలోచనతో అధికారపక్షం ప్రత్యక్ష ప్రసారంకాని కొన్ని వీడియోల్ని సోషల్ మీడియాకు లీకుచేసింది. రోజాను అప్రతిష్టపాలు చేయడానికి జరిగిన ప్రయత్నం సభాపతి వైఫల్యంగానే మాపార్టీ భావిస్తోంది. ఎందుకంటే సభావ్యవహారాల ప్రత్యక్షప్రసారాలన్నీ సభ ఆస్తి. అంటే సభాపతిగారి అనుమతి లేకుండా అవి బయటకెళ్లే అవకాశముండదు. అయినప్పటికీ కొన్ని వీడియోలు సోషల్‌మీడియాకు చేరాయి. కనీసం ఆరోజు సభలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్ సోషల్‌మీడియాకు చేరినా బాగుండు.

అలాగాక ఎడిట్ చేసి, మా సభ్యులు, సభ్యురాలికి సంబంధించినవే లీకయ్యాయి. సభలో మా ఎమ్మెల్యేలు నిరసన తెలిపేటప్పుడు వారిమాటలు రికార్డు చేయడానికి ప్రత్యేక మైకులు ఏర్పాటుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకుముందెప్పుడూ ఈ సంప్రదాయం లేదు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా తీసుకోబోతోంది. వీడియోలు ఏవిధంగా లీక్ అయ్యాయో.. అసెంబ్లీ ఆస్తిగా ఉండాల్సినవి ఏవిధంగా సోషల్ మీడియాకు వచ్చాయో సమాధానం చెప్పాల్సిన అవసరముంది. సభ ఆస్తిని కాపాడలేని పరిస్థితులు సభాపతిగారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం.
Share this article :

0 comments: