సెక్స్ రాకెట్‌ను నీరుగార్చడం కోసం ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై సర్కార్ దాడులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సెక్స్ రాకెట్‌ను నీరుగార్చడం కోసం ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై సర్కార్ దాడులు

సెక్స్ రాకెట్‌ను నీరుగార్చడం కోసం ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై సర్కార్ దాడులు

Written By news on Thursday, December 17, 2015 | 12/17/2015


‘సెక్స్’ రాకెట్‌ను దాచేసే కుట్ర!
విజయవాడ ప్రాంతంలో జరిగిన హేయమైన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నీరుగార్చడం కోసం ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై సర్కార్ దాడులు

 సాక్షి, హైదరాబాద్: ‘కాల్ మనీ-సెక్స్ రాకెట్’లో పీకల దాకా మునిగిన ఏపీ అధికార పార్టీ.. దాని నుంచి బయటపడటానికి పడరానిపాట్లు పడుతోంది. విజయవాడ కేంద్రంగా సాగిన అతి హేయమైన ‘కాల్‌మనీ- సెక్స్ రాకెట్’ను దాచేసేందుకు దారుణమైన కుట్రలకు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులకు ఆదేశించడం వెనక ఏపీ అధికార పార్టీ నేతలను తప్పించే వ్యూహమే ఉందని పోలీసు అధికారులే చెబుతున్నారు. భారీ వడ్డీలకు అప్పులిచ్చి.. బాధితుల నుంచి దౌర్జన్యంగా ఆస్తులను లాక్కోవడమే కాకుండా అత్యంత హేయంగా మహిళలను లైంగికంగా దోచుకుంటూ విజయవాడ కేంద్రంగా సాగిన ‘సెక్స్ రాకెట్’ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ రాకెట్‌లో ఏపీ అధికారపార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులూ పెట్టుబడులు పెట్టారని, సెక్స్ రాకెట్ నిందితులకు అండగా నిలిచారని స్పష్టంగా వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారం తమ పార్టీకి, ఆ తర్వాత తనకూ చుట్టుకుంటుందని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు అసలు వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి తన వారిని రక్షించే చర్యలకు పూనుకున్నారు. విజయవాడలో తన పార్టీ నేతల కనుసన్నల్లో సాగిన సెక్స్ స్కాండల్ వ్యవహారాన్ని సాధారణ వడ్డీ వ్యాపారంతో జమకట్టడం ద్వారా దాని తీవ్రతను తగ్గించేం దుకు ప్రణాళిక రూపొందించారు. కాల్‌మనీ -సెక్స్ రాకెట్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం పక్కనబెట్టి... ఏపీ వ్యాప్తంగా వడ్డీవ్యాపారులపై దాడులకు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వడ్డీవ్యాపారులపై దాడులతో హడావుడి చేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనే భ్రమ కల్పించి.. సెక్స్‌రాకెట్‌పై నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అధికారపార్టీ వ్యూహమని పోలీసులు అంచనా వేస్తున్నారు.

అసలేం జరిగింది?
విజయవాడలో అధికార పార్టీ నేతల అండదండలతో కాల్‌మనీ గ్యాంగులు చెలరేగిపోయాయి. ఊహించడానికి వీల్లేనంత వడ్డీలకు అప్పులు ఇవ్వడం, అవి చెల్లించలేని వారి ఆస్తులు తీసుకోవడం, అంతటితో ఆగకుండా మహిళలను లైంగికంగా దోచుకోవడం వారి అకృత్యాలకు పరాకాష్ట. ఈ గ్యాంగు విజయవాడ కేంద్రంగా 200 మందికి పైగా మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోల్లో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దురాగతంపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో కాల్‌మనీ గ్యాంగుల వ్యవహారం బట్టబయలైంది. అద్భుతమైన నూతన రాజధాని నిర్మిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి నివాసముంటున్న విజయవాడ పట్టణంలో అత్యంత హేయంగా సాగుతున్న సెక్స్ స్కాండల్ వ్యవహారంతో రాష్ట్రం నివ్వెరపోయింది. ప్రభుత్వ చేతగానితనంపై ప్రజలు భగ్గుమన్నారు. ఈ సెక్స్‌రాకెట్‌లో కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పేర్లను ప్రస్తావిస్తూ ఒక మహిళ లేఖ రాసింది. వందలాదిమంది కమిషనర్ కార్యాలయానికి వచ్చి కాల్‌మనీ గ్యాంగుల ఆర్థిక, లైంగిక దురాగతాలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

 సీఎం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు?
 రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ నిందితులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సి ఉంది. కాల్‌మనీ కీలక నిందితులతో కలసి తిరిగిన ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయాల్సి ఉంది. కనీసం వారిని అదుపులోకి తీసుకుని నిందితుల ఆచూకీ సేకరించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా వారిని రక్షించడానికి సర్కా రు ప్రయత్నించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. 2 నెలలముందే బాధితురాలు స్వయంగా ఏపీ సీఎంని కలసి ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. మరోవైపు ఈ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను సెలవుమీద పంపే ప్రయత్నాలు చేశారు. అంతకంటే సమర్థుడైన అధికారికి కేసు అప్పగిస్తామంటూ చెప్పుకొచ్చారు.

దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కితగ్గారు. గురువారం నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో సవాంగ్‌ను కొనసాగించక తప్పలేదు. ఆయన ద్వారానే కేసును చక్కబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చేందుకు... ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వడ్డీ వ్యాపారాలపై దాడులకు ఆదేశించారు. ఒక్క ఫిర్యాదు లేకపోయినా వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయించి కాల్‌మనీనుంచి దృష్టి మళ్లించే యత్నాలుచేస్తున్నారు. పార్టీలకతీతంగా వడ్డీ వ్యాపారం సాగుతోందని, పాపం మొత్తం అధికార పార్టీ నేతలకే పరిమితం కాదని చెప్పడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వడ్డీవ్యాపారులపై 123 కేసులు నమోదు చేసి, 118 మందిని అరెస్టు చేశారు.

అందులో వివిధ పార్టీలతో సంబంధం ఉన్నవారు 46 మంది ఉన్నారని, మిగతా వారికి ఏ పార్టీతో సంబంధం లేదని అధికారపార్టీ నేతలు లెక్కలుగట్టారు. అలా ఒక ప్రాంతంలో జరిగిన హేయమైన కాల్‌మనీ-సెక్స్ స్కాండల్‌కు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వడ్డీ వ్యాపారానికి లింకుపెట్టి తీవ్రతను తగ్గించేందుకు సర్కారు పెద్దలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విపక్షాలకు చెందిన కొందరిపై కేసులుపెట్టి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రయత్నాలను ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలూ తీవ్రంగా ఖండిస్తున్నా యి. కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌లో అకృత్యాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదలిపెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులను నీరుగార్చడానికి రాష్ట్రవ్యాప్తంగా వడ్డీవ్యాపారుల మీద దాడుల పేరిట హడావుడి చేసి తప్పుదోవ పట్టించకూడదనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
 
Share this article :

0 comments: