
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిడ్డి ఈశ్వరీపై పోలీసు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ... మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
505 1(బి), 506 2, 124(ఎ), 307 ఆర్/ డబ్ల్యూ 511 సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరకులో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గురువారం విశాఖ జిల్లా చింతపల్లి భారీ సభ నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలపై టీడీపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ నేతలపై అధికార టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అరకులో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో 97ను జారీ చేసింది. ఈ జీవోపై ప్రతిపక్షాలతోపాటు పలు ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ఈ జీవోను ప్రభుత్వం నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు బాక్సైట్ అనుమతుల కోసం చంద్రబాబు కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ జీవో జారీపై చంద్రబాబుకు ఏమీ తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించడం కొసమెరుపు.
0 comments:
Post a Comment