కేంద్రప్రభుత్వానికి మేకపాటి వినతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రప్రభుత్వానికి మేకపాటి వినతి

కేంద్రప్రభుత్వానికి మేకపాటి వినతి

Written By news on Thursday, December 3, 2015 | 12/03/2015


పెద్ద ఎత్తున సాయమందించాలి
♦ భారీవర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి
♦ కేంద్రప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి వినతి

 సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రమే ముందుకొచ్చి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో భారీవర్షాలవల్ల వాటిల్లిన నష్టంపై లోక్‌సభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘గడిచిన మూడేళ్లుగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు వచ్చినప్పుడు చెప్పుకోదగిన వర్షాలు పడలేదు. అంతేగాక తీవ్రమైన కరువు పరిస్థితుల్ని ఈ ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇటీవల వర్షాలు పడగానే తొలుత రైతులంతా సంతోషపడ్డారు.  దురదృష్టవశాత్తూ  కురిసిన భారీవర్షాలు తీవ్రనష్టాన్ని మిగిల్చిపోయాయి.  చెన్నై పొరుగునే ఉన్న నెల్లూరూ ఇదేరీతిలో నష్టాలు చవిచూసింది. పంటలన్నీ ధ్వంసమయ్యాయి.

ఒక్క నెల్లూరులోనే 25 వేల ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగవుతోంది. ఎకరాకు రూ.7 లక్షలవరకు రైతులు పెట్టుబడి పెట్టారు. అదంతా తుడిచిపెట్టుకుపోయింది. నష్టం రూ.1,500 కోట్లనుంచి రూ.1,700 కోట్లవరకు ఉంటుంది. అరటి, తమలపాకు తోటలు ధ్వంసమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రైతులు వేరుశనగ సాగు చేస్తే అదీ ధ్వంసమైంది. రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి.

రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. పౌల్ట్రీ కూడా నష్టపోయింది.ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నవిషయం కేంద్రానికి తెలుసు. అందువల్ల రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి. కేంద్రబృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేయించి భారీఎత్తున సాయం చేయాలి’’ అని మేకపాటి కోరారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ.. భారీవర్షాలవల్ల తిరుపతి నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారని వివరించారు.

Share this article :

0 comments: