బాధ్యత మీదే చంద్రబాబూ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధ్యత మీదే చంద్రబాబూ!

బాధ్యత మీదే చంద్రబాబూ!

Written By news on Tuesday, December 15, 2015 | 12/15/2015


‘కాల్‌మనీ’ సెక్స్ రాకెట్ రాక్షసకాండకు  బాధ్యత మీదే చంద్రబాబూ!
ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ

 సాక్షి, హైదరాబాద్: విజయవాడ ‘కాల్‌మనీ’-సెక్స్ రాకెట్‌పై హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి డిమా ండ్ చేశారు. సీఎం  చంద్రబాబుకు ఏ మా త్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రప్రభుత్వం కాకుం డా నేరుగా హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిగేలా చూడాలని సూచించారు. ‘మీ అండ చూసుకుని సాగించిన కాల్‌మనీ రాక్షసకాండకు మీరే బాధ్యత వహించాలి’ అని చంద్రబాబుకు జగన్ స్పష్టం చేశారు. జగన్ ఈ మేరకు సోమవారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.ఆ లేఖను పార్టీ అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, వాసిరెడ్డి పద్మ విలేకరుకు విడుదల చేశారు.లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది...

 ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి,
 గత నాలుగు రోజులుగా వెలుగులోకి వస్తున్న ‘కాల్‌మనీ’ సెక్స్ రాకెట్ వ్యవహారం విస్మయాన్ని కలిగిస్తోంది. గత 19 నెలలుగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, పరిపాలనాధికారులు కొలువు దీరిన విజయవాడ, సభ్యసమాజం,మొత్తం మానవ జాతి తలదించుకునే స్థాయి హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారిందని వెల్లడవుతుంటే మొత్తంగా దేశం నివ్వెర పోతోంది. ‘కాల్‌మనీ’ పేరిట పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నారని, కనీ వినీ ఎరుగని వడ్డీలు సమర్పించుకోలేని కుటుంబా ల్లో స్త్రీలను, యువతులను చెరపడుతున్నారని వార్తలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దుర్మార్గానికి, అరాచకానికి...రాక్షసత్వానికి మించిన  హీన స్వభావానికి, మాటలకు అందని నీచగుణానికి మూలాలు ఎక్కడున్నాయో, బాధ్యులు ఎవరో అందరినీ బయటకు లాగి చట్టప్రకారం శిక్షించాల్సి ఉంది.

 తెరవెనుక అధికార పార్టీ వారే!
 ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ వ్యవహారంలో తెర వెనుక ఉండి, ఈ కాల్‌మనీ కమ్ సెక్స్ మాఫియా వారితో పడుగూ పేకల్లా కలగలిసి పోయాయని వెల్లడవుతోంది. వారి సొమ్ములతో టీడీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు, తోరణాలు వెలవడటంతో మొదలు పెట్టి...మీ పార్టీ శాసనసభ్యులను విదేశీ విహారాలు చేయించే వరకు ఈ కాల్‌మనీ రావణాసురులే స్పాన్సరర్లుగా ఉన్నారన్న పచ్చి నిజం ఇప్పుడు ప్రజల గుండెల్ని నిప్పులా దహిస్తోంది.

 తమ్ముళ్లను రక్షించేందుకు అందరిపైనా బురద..
 ఏం ముఖ్యమంత్రి గారూ... చీటికీ మాటికీ పత్రికా సమావేశాలు పెట్టి చిన్నా చితకా అంశాల మీద కూడా అనర్గళంగా అబద్ధాల ప్రసంగాలు చేసే మీకు కొత్త రాజధాని పరిధిలో వేల మంది స్త్రీలను మీ పార్టీ రావణ, దుర్యోధన, దుశ్శాసన సంతతి నెలల తరబడి చెరబడుతున్న విషయం బట్టబయలు అవుతున్నా నోరు మెదపాలని...చట్టం దన్నుగా ప్రజలను కాపాడాలని, ఈ రాక్షస సంతతిని వేరు మూలాలతో తుద ముట్టించాలని మీ గుం డెలో, హృదయంలో కదలిక రాలేదా? పైగా మీరు చేస్తున్న ప్రయత్నాలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి.

మీ పార్టీ వారంతా మీ అండ చూసుకుని ఎంతటి అరాచకం అయినా చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చి సాగిస్తున్న ఈ సిగ్గు మాలిన రాక్షస కాండ నుంచి వారిని ఎలా తప్పించాలా అన్న ఆలోచనతో, మిగతా రాజకీయ పార్టీల వారూ ఈ కాల్‌మనీ వ్యవహారంలో ఉన్నారని కేసులు పెట్టాల్సిందిగా మీరే మీ అనుచరులకు ఆదేశాలిచ్చారన్నది మాకున్న సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ... ఇలా అన్ని పార్టీలకూ ఈ కాల్‌మనీ బురదను అంటించటానికి మీ అనుంగు పోలీసు బాసులకు ఆదేశాలివ్వటం నిజమైతే...మొత్తంగా మీ వల్ల, మీ చేత జరిగిన ఈ అత్యాచారాన్ని కూడా రాజకీయం అనే కార్పెట్ కింద కప్పి పెట్టాలన్న మీ ఆలోచనే అన్నింటికంటే ఘోరమైన నేరం.

 ప్రభుత్వమే మాఫియాగా మారి దోపిడీలు...
 మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడంతో పాటుగా...టీడీపీ వారు ఎంతటి ఘోరాలు, నేరాలు చేసినా చట్టానికి దొరక్కుండా కాపాడుకుంటారన్న మీ స్వభావం, మీ ప్రభుత్వ వ్యవహారం ప్రజలకు బాగా అర్థం అయింది కాబట్టే, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి కనీసం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు. తహశీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకు ఈడ్చిన, అటవీ అధికారుల మీద దాడి చేసి కొల్లేరులో సొంత రోడ్డు వేసుకున్న అంగన్‌వాడీలను సభ్య సమాజం రాయలేని, వినలేని భాషలో అన్యాయంగా దుర్భాషలాడిన మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసులు లేకుండా చేయటమే కాకుండా, బిరుదు సత్కారాలు చేసి, రాష్ట్రంలోనే నెంబర్ వన్ (పనితీరులో) ఎమ్మెల్యేగా సన్మానిస్తుంటే ఈ రాక్షస రాజ్యంలో పోలీసులకు తమ గోడు చెప్పుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది? వనజాక్షిని మీ ఇంటికి పిలిచి మీరే బెదిరించిన నేపథ్యంలో మీ పార్టీ నాయకుల రాక్షస కృత్యాలను అడ్డుకునే సాహసం ఏ రెవెన్యూ అధికారికి ఉంటుంది? రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపాల్‌ను మీరు వెనకేసుకు వస్తున్న తీరు చూసిన తరువాత ఏ తల్లిదండ్రులకు తమ బిడ్డల రక్షణ విషయంలో భరోసా ఉంటుంది? కల్తీ మద్యాన్ని మీ ప్రభుత్వమే సరఫరా చేసి, మీరు పెట్టించిన షాపుల్లో మనుషులు చనిపోతూంటే కారకులైన మంత్రులను వదిలి ఎస్సైల మీద చర్యలు తీసుకుంటూంటే ప్రజలకు ఎలాంటి సంకేతం వెళుతుంది? మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే  మీ పార్టీ నాయకుల వ్యవహారాలను చూసీ చూడనట్లుగా పోండని మీరు ఆర్డర్ వేసిన తరువాత... ఇక ఐఏఎస్, ఐపీఎస్‌ల యూనిఫారాలకు విలువ ఎక్కడుంది? నిజాయితీతో మీ నాయక గణాల ఆగడాలను అడ్డుకున్న సివిల్ సర్వెంట్లకు దక్కిన ట్రాన్స్‌ఫర్ల సన్మానాలతో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం అనే పదాలకు అర్థం లేకుండా చేసి, సంపూర్ణమైన దోపిడీ, మాఫియా రాజ్యానికి సర్వంసహాధికారిగా మీరే మారారు. ప్రభుత్వాన్ని ధిక్కరించి మాఫియా తయారు కావటాన్ని విన్నాం గానీ, ప్రభుత్వమే మాఫియాగా తయారై గ్రామగ్రామానా ఇసుక దోపిడీ మొదలు, జన్మభూమి కమిటీలు మొదలు, ప్రజాస్వామ్యం మూలాలన్నింటినీ నిర్వీర్యం చేసి సహజ సంపదలనే కాకుండా కుటుంబాల్లో చొరబడి, బెదిరించి, స్త్రీలను చెరబట్టి దోచుకుంటున్న వ్యవస్థ మీ పరిపాలనలో తప్ప ప్రపంచ చరిత్రలో మరొకటి ఉందా?

 సమస్య డబ్బు కాదు... జీవితాలది..
 చిట్టచివరిగా మీ సందేశం ఏమిటంటే, కాల్‌మనీ వ్యాపారులకు డబ్బు తిరిగి చెల్లించవద్దని! భేష్ చంద్రబాబు గారూ! సమస్య కేవలం డబ్బు కాదని మీకు తెలియదా? నెలల క్రితమే నేరుగా ఈ రాక్షస కాండ గురించి చెప్పినా స్పం దించలేదని బాధితులు ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. మీ పార్టీకి చెందిన మనీ రాక్షసులు వసూలు చేసిన వందల కోట్ల వడ్డీలు, సాగించిన మహా అరాచకాలు, కుటుంబాల్లోకి చొరబడి, కాపురాలను ఛిద్రం చేసి, మహిళలను చెరబట్టి సాగించిన అత్యాచారాలన్నింటికీ వ్యక్తిగతంగా, నైతికంగా, రాజకీయంగా, అధికార పరంగా సంపూర్ణంగా బాధ్యత వహించాల్సిన మీరు ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే చౌకబారు వ్యూహాలను కట్టి పెట్టండి.

 నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్
 బాక్సైట్ తవ్వకాలు, కాల్‌మనీలపై
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన (మంగళవారం) ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుంటారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌తో భేటీ అవుతారు. విశాఖపట్టణం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాన్ని, విజయవాడలో వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ‘కాల్‌మనీ’ సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రభుత్వ నిష్క్రియాపర త్వాన్ని గవర్నర్ దృష్టికి జగన్ తెస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 విజయవాడను వంద రకాల మాఫియాలకు రాజధాని చేశారు
 అధికారంలోకి వస్తే మహిళలందరికీ అభయం ఇస్తానని, ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంటుం దని, ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు వచ్చి వాలతారని, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన ప్రకటనలు ఒకసారి తెప్పించుకుని చూడండి ముఖ్యమంత్రి గారూ...! లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సెక్స్ మాఫియా, మనీ మాఫియా... ఒక్కటని ఏముంది? విజయవాడను మీ ఆధ్వర్యంలో వంద రకాల మాఫియాలకు రాజధానిగా తయారు చేసి పెంచి పోషిస్తున్న వైనం సామాజికంగా, విలువల పరంగా మీరు ఇంకా దిగజారటానికి మరేమీ లేదన్న భావం కలిగిస్తోంది.

 తెలుగుజాతి అసహ్యించుకుంటోంది..
 మొత్తంగా తెలుగు సమాజం రగిలిపోయే అరాచకాలకు మీరు పరిపాలన అని పేరు పెట్టుకుంటారా? కింది స్థాయి నుంచి మీ వరకు లంచాలు పంచుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎవరికి భరోసా ఇస్తుంది? స్థానికంగా మీకు అమ్ముడు పోయిన మీడియాను, మీకున్న పరిచయాలతో జాతీయ మీడియాను మేనేజ్ చేసుకుని మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో వారి నిజాయితీ గురించి, వారి సచ్ఛీలత గురించి, సత్యసంధత గురించి ఇంటర్‌వ్యూలు ఇప్పించుకుంటున్న తీరు చూసి తెలుగు జాతి మొత్తం అసహ్యించుకుంటోంది.

 ఇది మీ అండ చూసుకొనే..
 1. ఇది మీ అండ చూసుకుని సాగించిన రాక్షసకాండ కాబట్టి మీరే బాధ్యత వహించండి.
 2.ఈ రాక్షసకాండలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ, శాసనసభ్యుడైనా, మంత్రి అయినా చట్టం ముందు నిలబెట్టండి. క్షమించరాని ఘోరాతి ఘోరమైన నేరాలకు పాల్పడిన మీ పార్టీ వారిని చట్టానికి చిక్కకుండా తప్పించే వ్యవహారంలో భాగంగా, ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాల్లో భాగంగా... మిగతా పార్టీల వారి మీద దొంగ కేసులు పెట్టాలనే ఆలోచనలు మానుకోండి.
 3. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్పేందుకు కావాల్సిన భరోసా, రక్షణ ఇవ్వకుండా... వారిని మరో వంక భయభ్రాంతులకు గురి చేసే కౌటిల్యాన్ని కట్టి పెట్టండి.
 4. కాల్‌మనీ పేరిట అప్పులిచ్చి వసూలు చేసిన వడ్డీ ప్రతి పైసాను కక్కించి బాధితులకు తిరిగి ఇవ్వండి.
 5. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులకు, కాల్‌మనీ రాకెట్‌కు ఉన్న సంబంధాలను, అనుబంధాలను ఆర్థిక బంధాలను, ప్రచార బంధాలను అన్నింటినీ బట్టబయలు చేయండి.
 6. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా హైకోర్టుకు అప్పీల్ చేసి మొత్తం వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా నేరుగా న్యాయస్థానం ఆధ్వర్యంలో విచారణ జరిగేలా దర్యాప్తును కోరండి.

ఇట్లు
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Share this article :

0 comments: