దోపిడీకి అంతే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దోపిడీకి అంతే లేదు

దోపిడీకి అంతే లేదు

Written By news on Thursday, December 24, 2015 | 12/24/2015


ఇసుక మాఫియాలో సీఎం తనయుడు
రోజుకు రూ. కోటి ఆర్జిస్తున్న తండ్రీ కొడుకులు: జగన్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు తనయుడి కనుసన్నల్లో ఇసుక మాఫియా పెట్రేగిపోతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ‘చంద్రబాబు అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో క్యూబిక్ మీటరు ఇసుక రూ.40కే దొరికేది. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.550 నుంచి రూ.700లు పలుకుతోంది. సగటున క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.600 పలుకుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 15 నెలల్లో రూ.810 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ.. గతంలో ఇసుక ధర క్యూబిక్ మీటరు రూ.40లు పలికినపుడే ప్రభుత్వానికి రూ.120 కోట్ల ఆదాయం లభించేది.

ఇసుక ధర 14 నుంచి 15 శాతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.1600 కోట్ల ఆదాయం లభించాలి. కానీ.. 15 నెలల్లో రూ.810 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇసుకను దారిమళ్లించి.. ఏడాదికి రూ.800 కోట్లకుపైగా ఇసుక మాఫియా ముసుగులో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దోచుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేల నేతృత్వంలోని ఇసుక మాఫియా నుంచి ప్రతి రోజూ సీఎం తనయుడికి రూ.కోటి మేర ముడుపులు అందుతున్నాయి. అందుకే ఇసుక మాఫియాకు సీఎం చంద్రబాబునాయుడు అండదండగా నిలుస్తున్నారు.

 జెన్‌కోలో రూ.2,600 కోట్లు దోపిడీ
 రాష్ట్రంలో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం(వీటీపీఎస్) వద్ద 1600 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన రెండు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల టెండర్లలో కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా రూ.2,600 కోట్లను దోచిపెట్టి సీఎం చంద్రబాబునాయుడు కమీషన్లు దండుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను ప్రారంభించారు. ఈ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్‌కు రూ.4.4 కోట్ల చొప్పున టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. గుజరాత్‌లో 800 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్‌కు రూ.4.42 కోట్ల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు.

కానీ.. సీఎం చంద్రబాబునాయుడు మాత్రం కృష్ణపట్నం వద్ద చేపట్టిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్‌కు రూ.5.85 కోట్ల చొప్పున, వీటీపీఎస్ వద్ద 800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం పనులను మెగావాట్ రూ.6.3 కోట్ల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఎక్కడ రూ.4.4 కోట్లు.. ఎక్కడ రూ.5.85 కోట్లు.. రూ.6.3 కోట్లు. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాల పనులను అధికధరలకు కట్టబెట్టి కాంట్రాక్టర్లతో కలిసి రూ.2,600 కోట్లను దోచుకున్నారు.

 దోపిడీకి అంతే లేదు
 సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో దోపిడీకి అంతే లేదు. పట్టిసీమ, జీవో 22, గాలేరు నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల పనుల్లో ప్రజాధనాన్ని లూఠీ చేశారు. 30 శాతం కమిషన్‌లు తీసుకుని పారిశ్రామిక రాయితీలు ఇచ్చేశారు. రాజధాని చుట్టూ చంద్రబాబు, బినామీలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబు బినామీల భూములు మాత్రం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రావు. సాధారణ రైతుల భూములు మాత్రం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి వస్తాయి. చంద్రబాబు బినామీలు ప్లాట్లు వేసి.. ఎకరానికి మూడు వేల గజాలను అమ్ముకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు మాత్రం 1200 గజాల భూమి మాత్రమే ఇస్తున్నారు. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, సెక్స్ రాకెట్.. రాష్ట్రంలో జరగనిదేమీలేదు.. దేశంలో అత్యంత దారుణమైన పాలన రాష్ట్రంలోనే సాగుతోంది.
Share this article :

0 comments: