నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పొట్టకొట్టి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పొట్టకొట్టి

నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పొట్టకొట్టి

Written By news on Thursday, December 24, 2015 | 12/24/2015


నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పొట్టకొట్టి
14 వేల మంది అంగన్‌వాడీల ఉద్యోగాలకు ముప్పు

♦ ‘చలో విజయవాడ’ ఆందోళనలో పాల్గొన్న వారి తొలగింపునకు ఉత్తర్వులు
♦ సీడీల ఆధారంగా గుర్తించాలని సీడీపీవోలకు ఆదేశాలు
♦ జాబితాలో వారి ఉద్యోగాలు తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు
♦ బాబు నియంతృత్వ పోకడపై రగులుతున్న అంగన్‌వాడీలు
♦ నేడు రాష్ట్రవ్యాప్తంగా మెమో కాపీల దహనం

 సాక్షి, హైదరాబాద్/ విజయవాడ: సీఎం చంద్రబాబు రాక్షస పాలనకు, దమనకాండకు ఇదో తార్కాణం! సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన అంగన్‌వాడీల గొంతు నొక్కే దుస్సాహసానికి సీఎం ఒడిగట్టారు. ఉద్యమించిన అంగన్‌వాడీలను గుర్తిం చి విధులనుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను తక్షణమే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 18న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అంగన్‌వాడీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లందరినీ చిత్రీకరించిన సీడీలు పంపుతున్నామనీ, జిల్లాల వారీగా వారిని గుర్తించి తక్షణమే తొలగించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి ఈ నెల 21న రాష్ట్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్లు, సీడీపీవోలు, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు మెమో నంబర్ 5557/కె3/2015 జారీ చేశారు. సుమారు 14 వేల మందిని తొలగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు మండిపడుతున్నారు. చంద్రబాబు మోసపూరిత చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా మెమో కాపీల దహనం నిర్వహించాలని నిర్ణయించారు.

 ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట
 ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు.. వేతనాలు పెంచాలంటూ అసెం బ్లీ ముట్టడికి తరలివచ్చిన అంగన్‌వాడీలపై బాబు పోలీసులను ఉసిగొల్పారు. ఇందిరాపార్క్ వద్ద గుర్రాలతో తొక్కించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఉద్యమించిన వారిపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారు. బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి అనే ముగ్గురు అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో ప్రజా ఉద్యమాలను అణగదొక్కడానికి చంద్రబాబు పూనుకున్నారు. అంగన్‌వాడీలపై మరోసారి నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యం చేశారు. విజయవాడలో ఆందోళనకు దిగినవారిని ఇష్టమొచ్చినట్టు ఈడ్చి పారేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినవారిని కొట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వలేదు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలే పీకిపారేసేందుకు తెగబడ్డారు.

 ఎన్నికల  ముందు హామీ ఇచ్చి..
 రాష్ట్రంలో 20 వేల మందికిై పెగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఉన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు వేతనాలు పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అటకెక్కించారు. ఈ తీరును నిరసిస్తూ అంగన్‌వాడీలు ఉద్యమించడంతో వేతనాల పెంపునకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.7,100, అంగన్‌వాడీ సహాయకులకు రూ.4,600 చొప్పున వేతనాలు ఇవ్వాలని ఆగస్టు చివరి వారంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది. ఆ మేరకు పెంచిన వేతనాలు సెప్టెంబరు 1 నుంచి అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నాలుగు నెలలు గడిచినా వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో అంగన్‌వాడీలు మరోసారి సమరభేరి మోగించారు. ఈనెల 18న ‘చలో విజయవాడ’ చేపట్టారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. వేలాదిమంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, బందరు రోడ్డు, మనోరమ సెంటర్ వద్ద బైఠాయించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన అంగన్‌వాడీలపై మగ పోలీసులు విరుచుకుపడ్డారు. చీరలు లాగి.. జుట్టుపట్టి.. ఈడ్చి పారేశారు.

పోలీసులు లాఠీలు ఝుళిపించి.. పిడిగుద్దులు కురిపించడంతో 60 మందికిపైగా మహిళలకు గాయాలయ్యాయి. కనీసం గాయపడ్డ అంగన్‌వాడీలను ప్రభుత్వం ఆసుపత్రిలో కూడా చేర్చలేదు. అంత దారుణంగా అంగన్‌వాడీలపై పోలీసులను ఉసిగొలిపి చావబాదించిన సీఎం.. సాయంత్రానికి అంగన్‌వాడీల వేతనాలను పెంచుతున్నట్లు శాసనసభలో ప్రకటించారు. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలను తుంగలో తొక్కి అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.7 వేలు, సహాయకులకు రూ.4,500 చొప్పున వేతనం ఇస్తామని చెప్పారు. అయితే ఆ ప్రతిపాదన చేసిన మూడో రోజే ఉద్యమంలో పాల్గొన్న అంగన్‌వాడీలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 చంద్రబాబు మోసం మరోసారి బయటపడింది
 చలో విజయవాడ ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగించాలని మెమో జారీ చేయడం ద్వారా చంద్రబాబు మోసం మరోసారి బయట పడింది. మెమోను రద్దుచేసి వేతనాల పెంపు జీఓ జారీ చేసేవరకు రాజీలేని పోరాటం చేస్తాం. గురువారం రాష్ట్రవ్యాప్తంగా మెమో కాపీలను దహనం చేసి  నిరసనను తెలియజేస్తాం.
 - కె.సుబ్బరావమ్మ,అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Share this article :

0 comments: