అన్నా.. మద్యం మానుకోండి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్నా.. మద్యం మానుకోండి..

అన్నా.. మద్యం మానుకోండి..

Written By news on Wednesday, December 9, 2015 | 12/09/2015


అన్నా.. మద్యం మానుకోండి..
♦ కల్తీ మద్యం బాధితులతో వైఎస్ జగన్
♦ పేరుపేరునా పలుకరించిన ప్రతిపక్షనేత
♦ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వేదనను వెళ్లగక్కిన బాధితులు
♦ అధైర్యపడకండి అండగా ఉంటానంటూ బాధిత కుటుంబాలకు భరోసా

 సాక్షి, విజయవాడ బ్యూరో: ‘అన్నా మళ్లీ మద్యం తాగకు.. ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు... నీ కుటుంబాలను మద్యం ఇబ్బంది పెడుతోంది.. ఇకనైనా మద్యం మానేయండి’ అంటూ కల్తీమద్యం బాధితులకు విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో మృతదేహాలను పరిశీలించి, అక్కడకు చేరిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, సెంటిని, ఆంధ్రా హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. వారి వేదనను ఓపిగ్గా విని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. ఒక్కొక్కరిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆంధ్ర హాస్పిటల్ ఎండీ రమణమూర్తి, సెంటిని హాస్పిటల్ ఈడీ ఆనందశ్రీనివాస్ మద్యం బాధితుల వివరాలను జగన్‌కు వివరించారు.

 మాకు దిక్కెవరు దేవుడా..
 ‘కల్తీమద్యం కాటుకు మా వాళ్లను పోగొట్టుకున్నాం.. ప్రభుత్వం విచారణ, పరిహారం అంటూ కాలం గడిపేస్తోంది.. ఇంక భవిష్యత్ ఎలా గడిచేది..  మాకు దిక్కెవరు దేవుడా’ అం టూ మృతుల కుటుంబాల వారు వైఎస్ జగన్ వద్ద భోరున విలపించారు. గతంలోనే తల్లిని పోగొట్టుకుని, ఇప్పుడు తండ్రి కోల్పోయిన మునగాల శంకరరావు కుమార్తె శాంతిప్రియ మాట్లాడుతూ తనకు వచ్చిన కష్టం ఏ ఆడబిడ్డకు రాకూడదని విలపించింది. మీసాల మహేష్ భార్య లక్ష్మి మాట్లాడుతూ తన భర్త మరణంతో దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని వాపోయింది.  తన భర్త నరసా గోపి కల్తీ మద్యానికి బలైపోయాడని భార్య మంగమ్మ బావురమంది.

 ఆక్సిజన్ అంది ఉంటే మానాన్న దక్కేవాడు..
 ‘అంబులెన్సుల కోసం ఫోన్ చేసినా సకాలంలో అవి రాలేదు.. కనీసం ఆసుపత్రికి త్వరగా తీసుకొచ్చి ఆక్సిజన్ అందించి ఉంటే మా నాన్న మాకు దక్కేవాడు’ అంటూ మృతుడు మాదాసు నాంచరయ్య కుమారుడు నాగదుర్గాప్రసాద్ కన్నీరుమున్నీరయ్యాడు. మీ నాన్న ఎలా చనిపోయాడంటూ వైఎస్ జగన్ అడగడంతో ఆ యువకుడి వేదన కట్టలు తెచ్చుకుంది. ప్రభుత్వం సరఫరా చేసిన కల్తీ మద్యానికే తన తండ్రి బలైపోయాడని, నీరు కలుషితం అని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయాడు. స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, బార్‌లోనే మద్యం తాగి కుప్పకూలిపోయిన తన తండ్రిని బార్‌లోని వాళ్లు సకాలంలో ఆసుపత్రికి తరలించలేదన్నాడు. స్వర్ణ బార్ బోర్డు కూడా లేకుండా నిర్వహిస్తున్నా అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరించారని వాపోయాడు. ఎన్ని లక్షలిచ్చినా తన తండ్రి తిరిగిరాడని, అదే మంత్రుల ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా జరిగితే ఇలాగే కమిటీలు వేసి కాలయాపన చేస్తారా? అని వాపోయాడు.

 సకాలంలో వైద్యం అందితే బతికేవారు.. .
 స్వర్ణ బార్‌లో మద్యం తాగి ఒక్కొక్కరు వరుసగా కుప్పకూలిపోతున్నా బార్ నిర్వాహకులు పట్టించుకోలేదని.. స్థానికులు, తాము మానవత్వంతో అందుబాటులో ఉన్న వాహనాలపై ఆసుపత్రికి తరలించామని జగన్‌కు కార్పొరేటర్ పల్లెం రవి వివరించారు.. అంబులెన్సులు సకాలంలో రాలేదని..ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టక, వెంటిలేటర్లు సరిగ్గా లేక చనిపోయారని ఆయన తెలిపారు. కాగా సెంటినీ హాస్పటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎం.అక్కునాయుడు(35), సీహెచ్ రజనీకుమార్(40), పి.రమేష్(35), ఎం.బుసిరెడ్డి(32)లను మంగళవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ పరామర్శించారు.

 24 గంటలయ్యాక పోస్టుమార్టమా? ప్రభుత్వం కావాలని చేస్తోందా?
 ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు జగన్ ప్రశ్న

 ‘ఐదుగురు చనిపోయి 24గంటలు దాటాక పోస్టుమార్టం చేస్తే మృతికి గల వాస్తవ కారణాలు ఎలా గుర్తిస్తారు? వాస్తవాలు వెలుగు చూడకుండా ప్రభుత్వమే కావాలని జాప్యం చేస్తోందా?’ అని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యకుమారిని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చనిపోయిన కొన్ని గంటలకే పోస్టుమార్టం చేస్తే సరైన ఫలితమొచ్చే అవకాశం ఉంది.. సకాలంలో పోస్టుమార్టం చేయాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. పోస్టుమార్టం జాప్యం వల్ల మృతదేహాల్లో అవయవాలు పాడై మృతికి గల కారణాలు ఎలా గుర్తిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు పంచనామా రిపోర్టు ఇవ్వనందువల్లే పోస్టుమార్టం ఆలస్యమైందని సూపరింటెండెంట్ వివరించారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలందించే పరికరాలు, సిబ్బంది ఉన్నారా? అని ఆయన ప్రశ్నించగా అన్నీ బాగానే ఉన్నాయని ఆమె బదులిచ్చారు. దీంతో పక్కనే ఉన్న పార్టీ నాయకులు, బాధితులు జోక్యం చేసుకుని ఆసుపత్రిలో  సౌకర్యాలు లేవని, ఉన్న 9 వెంటిలేటర్గు పనిచేయడం లేదని, ఆక్సిజన్ అందని దుస్థితి నెలకొందని తెలిపారు.
Share this article :

0 comments: