అమానుషం... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అమానుషం...

అమానుషం...

Written By news on Sunday, December 20, 2015 | 12/20/2015


రోజాపై అమానుషం...
* సస్పెన్షన్ విధింపులో ఔచిత్యం లేదంటూ  స్పీకర్‌కు నోట్ అందజేసేందుకు ఏపీ అసెంబ్లీకొచ్చిన రోజా
* అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా మార్షల్స్ అడ్డగింపు
* స్పీకర్ చాంబర్‌కు వెళ్లేందుకు అభ్యంతరమేమిటన్న రోజా
* ససేమిరా అన్న మార్షల్స్.. తోపులాట.. తీవ్ర వాగ్వాదం..
* రోజాను వ్యాన్‌లో ఎత్తిపడేసిన పోలీసులు.. కాలికి గాయం
* నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు.. తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయిన రోజా
* అదే వ్యాన్‌లో ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు
* అదే సమయానికి అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
* అంబులెన్స్ లేకుండా ఆసుపత్రికి తీసుకెళతారా? అంటూ ఆగ్రహం
108 అంబులెన్స్ తెప్పించి నిమ్స్‌కు తరలింపు


 సాక్షి, హైదరాబాద్: సస్పెన్షన్ వేటుకు గురైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పట్ల ఏపీ అసెంబ్లీ మార్షల్స్ శనివారం అమానుషంగా ప్రవర్తించారు. శాసనసభ నుంచి తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం నిబంధనలకు పూర్తివిరుద్ధమని, తన వాదనేమిటో చెప్పుకోవడానికీ అవకాశమివ్వకుండా ఇంత దీర్ఘకాలంపాటు వెలివేయాలని నిర్ణయం తీసుకోవడంలో ఔచిత్యం లేదని పేర్కొంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఒక నోట్ అందజేయడానికి శనివారం అసెంబ్లీకి వచ్చిన రోజాను శాసనసభ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. సస్పెండైన నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దంటూ అటకాయించారు.

ఈ సందర్భంగా వారికి, రోజాకు మధ్య దాదాపు 30 నిమిషాలపాటు వాగ్వాదం, పెనుగులాట జరిగింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో రోజా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మహిళ అన్న విషయాన్ని విస్మరించి ఆమెను ఎత్తి వ్యాన్‌లో పడేశారు. దీంతో ఆమె కాలికి గాయమైంది. అయినా పట్టించుకోని పోలీసు లు నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు లోనైన రోజా సృ్పహ కోల్పోగా అదేవ్యాన్‌లో నిమ్స్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఈలోగా అక్కడకు చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాన్‌లో ఆస్పత్రికి తరలిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు అప్పటికప్పుడు 108 అంబులెన్స్‌ను తెప్పించి అందులో నిమ్స్‌కు ఆమెను తరలించారు..

మీరు రావడానికి వీల్లేదు.. స్పీకర్ ఆదేశాలున్నాయ్..
తనపై దీర్ఘకాలం సస్పెన్షన్ వేటు వేయడంలో ఔచిత్యం లేదంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఒక నోట్ అందజేయడానికి రోజా శనివారం ఉదయం 9.05 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆమె నేరుగా స్పీకర్ చాంబర్‌కెళ్లి ఆ నోట్ ఇవ్వాలని భావించారు. సరిగ్గా టీడీపీఎల్పీ కార్యాలయం వద్ద మోహరించిన అసెంబ్లీ మార్షల్స్ ఆమెను అటకాయించి ‘‘మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు.. స్పీకర్‌గారి ఆదేశాలున్నాయ్..’’ అని చెప్పారు. తానేమీ అసెంబ్లీ సమావేశంలోకి వెళ్లట్లేదని, స్పీకర్ చాంబర్‌కు వెళ్లడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని రోజా అంటూ ముందుకుపోబోయారు. అక్కడున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, సి.జగ్గిరెడ్డి కూడా మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు.

రోజాను అనుమతించాలని గిడ్డి ఈశ్వరి సైతం డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండైన టీడీపీ సభ్యుడు ఎ.రేవంత్‌రెడ్డి కూడా శాసనసభ ఆవరణలోకి వచ్చిన విషయాన్ని వారు ప్రస్తావిస్తూ రోజమ్మను ఎందుకు రానివ్వరని నిలదీశారు. కొందరు జర్నలిస్టులు.. ప్రాంగణంలోకి రోజావస్తే తప్పేమిటి? సమావేశం హాలులోకి వెళ్లట్లేదు కదా అని మార్షల్స్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. జర్నలిస్టులు కొందరు రోజాను అడ్డగిస్తున్న దృశ్యాల్ని, పెనుగులాటను వీడియో తీసే యత్నం చేస్తూ ఉండగా చీఫ్‌మార్షల్ వారిపై ఆగ్రహం వ్యక్తపరిచారు. మేం తల్చుకుంటే...మిమ్మల్నీ లోనికి రానీయమన్నారు. ‘‘మీరెవరు...మమ్మల్ని వద్దనడానికి...మాకు కవరేజీ నిమిత్తం అధికారికంగా పాసులిచ్చారు’ అని మీడియా ప్రతినిధులు గద్దించడంతో ఆయన వెనక్కితగ్గారు.

రోజాపై మార్షల్స్ ప్రతాపం..
ఎంతకీ తనను లోనికి వెళ్లడానికి మార్షల్స్ అనుమతించకపోవడంతో రోజా తన కారులోనే బయటికెళతానని చెప్పినా వారు వినలేదు. ఈలోగానే పోలీస్ వ్యాన్‌ను తెచ్చి 20మంది మార్షల్స్ ఆమెను ఎత్తి సీట్లో కుదేశారు. రోజా జుట్టుపట్టుకుని లాగారు. ఈ సమయంలో ఆమె కాలు సీటుకు, డోర్‌కూ మధ్య ఇరుక్కుపోయి నొప్పితో విలవిలలాడారు. తీవ్ర ఉద్వేగానికిలోనై ఏడ్చేశారు. ఏడుస్తూ ఉన్న ఆమెను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళుతున్నపుడే హైబీపీ వచ్చింది. స్టేషన్‌కు తీసుకెళ్లే సమయానికి రోజా తీవ్ర అస్వస్థతకు లోనై స్పృహ కోల్పోయారు. దీంతో భయపడిన పోలీసులు తెచ్చిన వ్యాన్‌లోనే ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అంబులెన్స్ లేకుండా ఆసుపత్రికి తీసుకెళతారా?
కాగా రోజా అరెస్ట్ విషయం శాసనసభ లోపలున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలియడంతో ఆయన వెంటనే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పేర్నినాని(బందరు)లను వెంట తీసుకుని హుటాహుటిన నాంపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. ఆ సమయానికి హైబీపీకి లోనై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న రోజాను పోలీస్ వ్యానులోనే ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అంబులెన్స్ లేకుండా ఆమె(రోజా)ను ఆసుపత్రికి తరలిస్తారా...ఇదేనా పద్ధతి, ఆమె ఒక ఎమ్మెల్యే... తమాషా చేస్తున్నారా...మీరిలా వ్యవహరించినందుకు మీపై కోర్టుకు వెళతా...మీ ఉద్యోగాలు పోయేలా చేస్తా... వెంటనే అంబులెన్స్‌ను పిలవండి, ఇలా వ్యాన్‌లో తీసుకెళ్లడానికి వీల్లేదు...’ అని పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.

ఆమెను ఈ రకంగా తీసుకెళతారా..అంబులెన్స్‌ను ఎందుకు పిలవలేదంటూ నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులతో స్వల్ప వాగ్వాదం జరిగింది. వ్యాన్‌లో ఆమెను తరలించడానికి వీల్లేదని జగన్, రామచంద్రారెడ్డి ఇద్దరూ వ్యాన్‌కు అడ్డంగా నుంచున్నారు. పేర్నినాని పోలీసు వ్యాన్ ముందరి టైర్ల వద్ద బైఠాయించారు. దీంతో వ్యాన్ ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా నాంపల్లి స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. అక్కడి దృశ్యాలను ఫొటోలు తీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఫొటో జర్నలిస్టులు, టీవీ వీడియోగ్రాఫర్లు జగన్‌కు ఫిర్యాదు చేయగా...‘‘ఎందుకు అడ్డుకుంటున్నారు. వాళ్లను ఫొటోలు తీయనీయండి... రోజమ్మ ఆరోగ్య పరిస్థితిపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఆమె గురించి తెలుసుకోనివ్వండి. ఫొటోలు తీసుకోనివ్వండి... చంద్రబాబుకోసం మీరెందుకు చెడ్డపేరు తెచ్చుకుంటారు. సెక్స్‌రాకెట్‌లో నిందితులు ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో కలసివున్న ఫొటోల్ని పదేపదే చూపిస్తున్నామని మామీద ఇలా ప్రవర్తిస్తున్నారా? మా పోరాటం చంద్రబాబుపై మాత్రమే...మీ మీద(పోలీసు అధికారుల మీద) కానే కాదనే విషయం గమనించండి... రోజా ఏమీ తప్పు చేయలేదు. హేయమైన తప్పు చేసినవారిని శిక్షించాల్సిందిగా కోరుతూ పోరాటం చేస్తోంది..’’ అని జగన్ పేర్కొన్నారు. ఈలోగా 108 వాహనాన్ని పోలీసులు తెప్పించి అప్పటికే సృ్పహ కోల్పోయిన రోజాను స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లోకి మార్చి నిమ్స్‌కు చికిత్సకోసం తీసుకెళ్లారు. పేర్ని నానిని ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా జగన్ ఆదేశించారు. ఆ తర్వాత జగన్ తిరిగి శాసనసభ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు.

 పలువురి పరామర్శ..
 రోజాను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, సుజయ్ కృష్ణ రంగారావు, కంబాల జోగులు, కొడాలి నాని, కె.నారాయణస్వామి, కిలివేటి సంజీవయ్య, ఎం.సునీల్‌కుమార్, విశ్వసరాయి కళావతి, ఆర్.ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వరుపుల సుబ్బారావు, చింతల రామచంద్రారెడ్డి, గౌరు చరితారెడ్డి, గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, వంతెల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, పి.సునీల్‌కుమార్, వై.బాలనాగిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజాచరణ్ తదితరులు పరామర్శించారు.

నిలకడగా ఆరోగ్యం..
ప్రస్తుతం రోజా నిమ్స్ ఐసీయూలోని రూమ్ నం.129లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు నిమ్స్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి బృందం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ ఎక్కువగా ఉన్నందున ఆమెకు వాంతులయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాలికి  చిన్నగాయం కూడా ఉందని పేర్కొన్నాయి. ఆమెను ఆదివారం డిశ్చార్జి చేసే అవకాశముందని నిమ్స్ వైద్యులు తెలిపారు.
Share this article :

0 comments: