
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదని వారన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందనీ కానీ భారత దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రు 80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య ఉండాలనీ అయితే అదింకా రు67- 68 మధ్యే ఉందన్నారు.
సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్‌లో కూడా భారత్ కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని వారు ప్రస్తావించారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందే తప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి వాళ్ల ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి, ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటిని కూడా ఎందుకు తగ్గించడం లేదని వారు ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు కూడా ఆకాశానికి అంటాయని ఇపుడు వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు