గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 150 డివిజన్లలోనూ పోటీ చేస్తామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కార్యాచరణపై జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జీహెచ్‌ఎంసీని ఐదు జోన్లుగా విభజించి, వాటికి పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. తూర్పు జోన్‌కు కె.శిమకుమార్, పశ్చిమ జోన్‌కు కొండా రాఘవరెడ్డి, ఉత్తర జోన్‌కు నల్లా సూర్యప్రకాష్, దక్షిణ జోన్‌కు హెచ్.ఎ. రెహ్మాన్, సెంట్రల్ జోన్‌కు మథిన్‌లను అబ్జర్వర్లుగా నియమించామన్నారు. పరిశీలకులంతా ఒక్కో డివిజన్‌లో అధ్యక్షుడు, ఐదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడంలో భాగంగా దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మి ల వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందించుకోవాలని కార్యాచరణ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త పి. సిద్ధార్థరెడ్డి, నాయకులు ఆదం విజయ్‌కుమార్, సురేష్‌రెడ్డి, కె.శివకుమార్, గున్నం నాగిరెడ్డి, బీష్వ రవీందర్, మథిన్‌భాయ్, నల్లా సూర్యప్రకాష్, ప్రఫుల్లారెడ్డి, అమృతసాగర్, ముస్తాఫా, హెచ్.ఎ. రెహ్మాన్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.