అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేత జగన్
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో ఏదో జరిగితే దానితో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముడిపెట్టాలని చూస్తున్నారంటూ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పక్ష సభ్యులు నోటికొచ్చినట్లు అబద్ధాలాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కొనికమిట్ల మండలం పొట్లూరివారి పల్లికి చెందిన కె.నరసింహారెడ్డి హత్యపై.. కొందరు టీడీపీ సభ్యులు 74వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుకు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం వివరణ ఇస్తూ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 24 మధ్యరాత్రి హత్య జరిగిందని చెప్పారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, ఈనెల 9న కేసుకు సంబంధించి 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారంటూ పూర్వాపరాలు వివరిం చారు.
‘కొనికమిట్ల గ్రామంలోని 559 ఎకరాల పశువుల పచ్చికబీడు ఈ కేసుకు నే పథ్యం. చట్టరీత్యా వారసులు అందరూ ఈ భూమిని గండ్లూరి వీరప్రతాప్‌రెడ్డి ఎండీగా ఉన్న వీరభద్ర మినరల్స్‌కు విక్రయించారని గుర్తించారు. అయితే 1.4 ఎ కరాలకు సంబంధించి చాగంరెడ్డి పోటిరెడ్డి పేరిట ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాన్ని వానిపెంట తిరుపతయ్య పేరిట మార్చినందుకు భూమి వారసుల్లో ఒకరైన నరసింహారెడ్డి (మృతుడు) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 రాత్రి 9 గంటల ప్రాంతంలో నిందితులు నరసింహారెడ్డిని ఘటనా స్థలానికి తీసుకువచ్చి హత్య చేసి మృతదేహాన్ని వెలుగొండ కాలువలో పడేశారు’ అంటూ ప్రకటన చదివారు. ఈ హత్యకు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందం టూ టీడీపీ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. విపక్ష నేత జగన్‌పైనా అధికార పక్షం వ్యక్తిగత ఆరోపణలకు దిగింది. వైఎస్సార్‌సీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. హోంమంత్రి బంధువు అవినాష్ తూ.గో. జిల్లాలో సాగిస్తున్న ఆగడాలను ప్రస్తావించారు. వెంటనే స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. జగన్ జోక్యం చేసుకుని అధికార పక్ష సభ్యుల ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అవినాష్‌రెడ్డికి ముడిపెట్టాలనిచూస్తున్నారు
‘కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మా చిన్నాన్న కుమారుడు. నాకు బంధువు. అవినాష్‌రెడ్డికి బంధువు ప్రతాప్‌రెడ్డి. ఆయనకు బంధువులు ఎవరో..! వారి దగ్గర ఏదో జరిగితే దాన్ని అవినాష్‌రెడ్డికి ముడిపెట్టాలని చూస్తున్నారు. మా ఎంపీ పేరును అసెంబ్లీలో ప్రస్తావనకు తెచ్చారు. అధికారపక్ష సభ్యులు నోటికొచ్చినన్ని అబద్ధాలాడారు. లేనిపోని ఆరోపణలు చేశారు. ఒక్కటే చిన్న ఉదాహరణ చెబుతా. మొన్నామధ్య బాలకృష్ణ.. ఇంటికి వచ్చిన వారిని కాల్చారు..’ అని విపక్ష నేత జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాలకృష్ణ జరిపిన కాల్పులను జగన్ ప్రస్తావించబోవడంతో అధికారపక్షం సభ్యులంతా నిలబడి అభ్యంతరం తెలిపారు. విపక్ష సభ్యులూ తమ స్థానాల్లో నిలబడ్డారు. సభలో గందరగోళం మధ్య అధికార, విపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
అధికార పక్షం పచ్చి అబద్ధాలతో ప్రతిపక్షంపై ప్రచారం సాగిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మరో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం జరిగితే దానికి రాజకీయ రంగు పులిమి ప్రతిపక్ష నేతకు అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. నరసింహారెడ్డి హత్యను ఖండిస్తూ.. ఈ ఘటనలో దోషులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అవినాష్‌రెడ్డి మామ వీర ప్రతాప్‌రెడ్డి గత 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారని, ఆయన కుటుంబసభ్యుల పేరిట గత ఏడాది అగస్టు 30, నవంబర్ మధ్య కాలంలో భూములు కొన్న మాట వాస్తవమని అన్నారు.
హత్యకు గురైన నరసింహారెడ్డికి చెందిన పొలాల పక్కన ఆ పొలాలున్నాయని అంత మాత్రాన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులే హత్య చేశారనడం సరికాదన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన టీడీపీకి సవాల్ విసిరారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువు అవినాష్ పచ్చి మోసగాడని దేశమంతా తెలుసని, అయినా ఇంతవరకు అతనిపై చర్య తీసుకోలేదని విమర్శించారు. కనీసం కేసు నమోదు చేయడానికి చేతులు రావడం లేదని, అతనికి గన్‌మెన్‌ను ఇచ్చారంటే ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం లేనిదే సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.