ఫీజుల పథకంలో మార్పులు తెస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫీజుల పథకంలో మార్పులు తెస్తాం

ఫీజుల పథకంలో మార్పులు తెస్తాం

Written By news on Tuesday, January 12, 2016 | 1/12/2016


ఫీజుల పథకంలో మార్పులు తెస్తాం
► పేదలు చదువుకు దూరం కాకుండా చూస్తాం
►  రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►  ఆరోరోజు 6 కుటుంబాలకు జగన్ భరోసా

 (రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) ‘‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. రైతులు, చేనేతలు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి విద్యార్థులకు నేను అండగా ఉంటా.

  మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఏ పేద విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చూస్తా’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
 అంతేకాదు తాము అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా ఇల్లులేని పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఆయన వాగ్ధానం చేశారు.

  రైతు భరోసా యాత్రలో భాగంగా సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని కొడిమి, నరసనాయనికుంట, కోనాపురం, కనగానపల్లి, పాత పాళ్యం గ్రామాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు చిన్నరామాంజనేయులు, రైతులు కేతావత్ లక్ష్మన్ననాయక్, లక్ష్మానాయక్, నరేంద్ర, కరుణాకర్, సుధాకరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోరోజు భరోసాయాత్ర సాగిందిలా..

 ఒక్క పైసా మాఫీ కాలేదు..
 ఒక్క రూపాయీ పరిహారం అందలేదు...

 కొడిమి గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు చిన్న రామాంజనేయులు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ‘అప్పులు ఎక్కువై నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 80 వేలు అప్పు తెచ్చుకున్నాం. నోటీసులు వస్తే వడ్డీ కట్టాం. చంద్రబాబు చెప్పినట్లుగా రుణమాఫీ ఒక్కపైసా కాలేదు. పెట్టుబడి పెట్టే శక్తి లేక మగ్గం నేయడం ఆపేశా. ఇప్పుడు ఇతరుల కూలీకి వెళ్లి చీరలు నేస్తున్నా. ఐదారు రోజులు కష్టపడితే రూ. 300 కూలీ వస్తుంది.

  నా భర్త చనిపోయి 7 నెలలు అవుతోంది. ఆర్‌డీఓ వచ్చినా ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అందలేదు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేస్తే జన్మభూమి కమిటీ వాళ్లు తిరస్కరించారు’ అని మృతుడి భార్య వరలక్ష్మి జగన్ వద్ద వాపోయింది. ‘వాళ్ల ఇష్టమొచ్చినట్లు చేస్తే ఎలా? చనిపోయింది నిజమా? కాదా? అని తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయం.

  మీకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.’ అని జగన్ అన్నారు. ‘పూటగడవడమే కష్టంగా ఉంది. ఈ సమయంలో పిల్లలను చదివించడం నాకు భారం అవుతోంది’ అంటూ మృతుడి భార్య కన్నీరుమున్నీరయ్యింది. ‘మేం అధికారంలోకి వచ్చాక పేదలు విద్యకు దూరం కాకుండా చూస్తాను. మీ పిల్లల చదువుల బాధ్యత రాప్తాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తీసుకుంటారు’ అని జగన్ హామీ ఇచ్చారు.

 చేతగాని హామీలెందుకు చంద్రబాబూ?
 నరసనాయని కుంట గ్రామంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు లక్ష్మన్న నాయక్, లక్ష్మానాయక్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. రైతు లక్ష్మన్న నాయక్ భార్య ప్రమీలాబాయ్ తాము పడుతున్న కష్టాలను కన్నీళ్లతో వివరించింది.  ‘నా కుమారుడు, కుమార్తె, భర్త చనిపోవడంతో దిక్కులేని దాన్ని అయ్యాను. ఉన్న ఒక్క కుమారుడు డిగ్రీ వరకు చదివాడు. 8 ఎకరాల పొలం ఉన్నా.. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.

  పొలంపై లక్ష రూపాయల అప్పు ఉంది. డ్వాక్రా రుణం కొంత ఉంది. కొత్తగా రుణం తీసుకుందామంటే ఎక్కువ సంఘం సభ్యులకు రూ. 10 వేలకు మించి అప్పులివ్వడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే సంఘంలో ఒక్కొ సభ్యురాలికి రూ. 50 వేలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. నా భర్త చనిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు’ అంటూ భోరున విలపించింది. ‘మీకు న్యాయం జరిగేలా చూస్తాను తల్లీ. ఈ ప్రభుత్వం సాయం చేయకపోయినా మేం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలరోజుల్లో మీకు ఆర్థిక సాయం అందిస్తాం’ అంటూ ఆమెను జగన్ ఓదార్చారు.

  అనంతరం అక్కడి నుంచి ఆదే గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మానాయక్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయామని, క్రాప్, డ్వాక్రా, బంగారు రుణాలేవీ మాఫీ కాలేదని జగన్ వద్ద మృతుడి భార్య ఈశ్వరమ్మబాయి వాపోయింది. చేతగాని హామీలు ఎందుకివ్వాలని ఆమె చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రభుత్వం అంతా మోసం చేస్తోంది. రైతు, డ్వాక్రా, బంగారు రుణాలు మాఫీ అని మోసం చేసింది. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. పింఛన్లన్నారు. ఇళ్లు కట్టిస్తామన్నారు. ఏదీ చేయలేదు. అంత మోసం.. మోసం.. మోసం..’ అంటూ ప్రభుత్వతీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు...
 కనగానపల్లి మండలంలో కోనాపురం గ్రామంలో అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు నరేంద్ర కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘ఐదు ఎకరాల పొలం ఉంది. నాలుగు బోర్లు వేసినా.. ఒక్కదాంటో ్లనూ నీళ్లు పడలేదు. రూ. 50 క్రాప్‌లోనుకు గానూ వడ్డీ రూ. 18 వేలు కట్టాల్సి వచ్చింది. కానీ  రూ. 10 వేలు మాత్రమే మాఫీ అయ్యిం ది.

  భర్త చనిపోయి ఆరు నెలలు అవుతోంది. ఆర్‌డీఓ, ఎంఆర్‌ఓలు వచ్చినా.. ప్రభుత్వ సాయం అందలేదు. జన్మభూమి సమావేశాల్లో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. మీరే ఆదుకోవాలి.’ అంటూ ఆమె జగన్‌ను వేడుకున్నారు. ‘ఈ ప్రభుత్వం చేతనైతే పేదలకు న్యాయం చేయాలి. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. మేం అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని వాళ్లందరికీ పార్టీలకు అతీతంగా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం’ అని ఆమెకు జగన్ భరోసా ఇచ్చారు.

 ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు..
 కనగానపల్లి మండలం పాతపాళ్యం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఎం.సుధాకరరెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘అప్పుచేసి పొలంలో బోర్లు వేశాం. నీరు పడలేదు. పంటలు పండలేదు.  బ్యాంకులో రూ.80 వేల రుణం ఉంది. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. డ్వాక్రా రుణం రు. 20 వేలు ఉంది. అది కూడా మాఫీ కాలేదు. అప్పుల భారంతో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.’ అని సుధాకరరెడ్డి భార్య  సావిత్రమ్మ జగన్ వద్ద వాపోయారు. బిడ్డల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని జగన్ భరోసా ఇచ్చారు.

 అధైర్య పడకండి అండగా ఉంటా...
 కనగానపల్లెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు. ‘20 ఎకరాల పొలం ఉంది. నాలుగేళ్లుగా వర్షాలు లేక బోర్లలో నీళ్లు ఎండిపోయాయి. పంటలు వేయడం లేదు. రెండు లక్షల బ్యాంకు రుణం ఉంది. దీంతోపాటు ప్రైవేటు అప్పులు చేశాం. అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.’ అని కరుణాకర్ తండ్రి నెట్టం కేశన్న వాపోయాడు. ‘మీకు అండగా ఉంటా. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తా. మీరు అధైర్య పడొద్దు’ అంటూ జగన్ ఓదార్చారు.
Share this article :

0 comments: