అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి

అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి

Written By news on Friday, January 8, 2016 | 1/08/2016


చంద్రబాబూ ఇదేం దగా..?
రైతు భరోసా యాత్రలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చంద్రబాబు పాలన అంతా మోసం.. మోసం..
అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి
అవ్వా తాతల జీవితాలతోనూ ఆడుకున్నారు
బాబు సీఎం అయ్యారు కానీ నిరుద్యోగులకు జాబు రాలేదు
ఆయన వచ్చాక ధర్మవరంలోనే 16 మంది చేనేతల ఆత్మహత్య
ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయమైతే మేలు

రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా మోసం, దగాలతో కొనసాగుతోంది. ఎన్నికల తరువాత ఈ 20 నెలలుగా ఆయన రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు, చేనేతలు, చదువుకునే పిల్లలు, చివరకు అవ్వా తాతలను సైతం వద లకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు.’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, ఆయన అందరినీ మోసం చేశారనే సత్యం ఇవాళ కళ్ల ముందు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన నాల్గో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు గురువారం కూడా ధర్మవరంలో కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు ఎదురుగా చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. గంటకు పైగా చేనేతలతో గడిపి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ‘చేనేత కార్మికులకు చంద్రబాబు చేసింది సున్నా... వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం చేసిందే లేదు. ఎవరి జీవితాలూ బాగోలేవు. అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పరిపాలన వచ్చిన తర్వాత పడుతున్న కష్టాలేమిటనేది చేనేతలను చూస్తే అర్థమౌతోంది.’ అని జగన్ పేర్కొన్నారు.
 
ధర్మవరంలోనే 16 మంది ఆత్మహత్య
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 20 నెలల కాలంలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, బహుశా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఇలా జరిగి ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు చేనేత కార్మికులు తమ బాధలను వివరించినపుడు జగన్ స్పందిస్తూ..‘చంద్రబాబుకు అర్థమయ్యే విధంగా సమస్యలన్నింటినీ ఇక్కడి నుంచి చెప్పగలిగాం. ఆయనలో మార్పు వచ్చి మంచి చేస్తాడని ఆశిద్దాం. మార్పు రాని పక్షంలో దేవుడు కచ్చితంగా ఆయనకు మొట్టికాయలు వేస్తాడు. ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుందని కూడా చెబుతున్నా.

ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. మన పరిపాలన వచ్చే రోజులు వస్తాయ’ని అన్నారు.  మోసం చేసే క్రమంలో బాబు వయోవృద్ధులైన అవ్వాతాతలను కూడా వదలలేదని, పింఛన్లు తక్కువ మందికిచ్చి ఎక్కువ మందికి కత్తిరించేశారని విమర్శించారు. రేషన్ బియ్యం ఇవ్వాలని అవ్వాతాతలు అడిగితే ‘మీ వేలి ముద్రలు మిషన్‌లో సరిగ్గా పడ్డంలేదు’ అంటూ బియ్యాన్ని కూడా కట్ చేశారన్నారు. ‘ఎన్నికల ముందు ఏ హామీలిచ్చాను.. ఇపుడు పరిపాలన ఎలా చేస్తున్నాను.. అనేది చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని తనను తాను ప్రశ్నించుకోవాలి’ అని జగన్ సూచించారు.
 
ఇకనైనా బాబుకు జ్ఞానోదయం కావాలి
చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న వారి ఇళ్లకు తాము వెళ్లినప్పుడు ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం చేయలేదనే విషయం తెలిసిందన్నారు. ఒక్కరికంటే ఒక్క కుటుంబానికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. చేనేతలకు ఒక్క ఇంటిని కానీ, ఒక్క షెడ్డును కానీ నిర్మించి ఇవ్వలేదన్నారు.  వారందరికీ ‘ఆర్టిసాన్‌కార్డు’ ఉన్నప్పటికీ ఒక్క బ్యాంకు కూడా రుణాలివ్వలేదని తెలిపారు.

ఈ ఇబ్బందులను చంద్రబాబుకు గట్టిగా వినిపించే విధంగా ఇక్కడి నుంచి మాట్లాడాలని చేనేతలను జగన్ కోరారు. మీరు పడుతున్న కష్టాల గురించి మీరే చెప్పండి అంటూ చేనేతలను ఆయన స్టేజీ మీదకు ఆహ్వానించారు. వీటిని విన్న తర్వాత నైనా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావాలని జగన్ ఆకాంక్షించారు.
 
ఐదు కుటుంబాలకు పరామర్శ
ధర్మవరం: ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోయినా మన సర్కారు రాగానే అందరి సమస్యలూ తీరుస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు, చేనేత భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం ధర్మవరంలో ఐదు కుటుంబాలను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. కష్టాలొచ్చాయని కుంగిపోవద్దని, ఆత్మస్థైర్యంతో జీవించాలని, త్వరలో మంచిరోజులు రానున్నాయని ధైర్యం చెప్పారు.  
 
బాబు ఆ హామీలు ఇచ్చారా.. లేదా?
‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, గోడ మీద రాతలు, అడ్వర్టయిజ్‌మెంట్లు చూసినా, చంద్రబాబు ప్రసంగాలు విన్నా ఒకటే హామీల వర్షం కురిసేది. ఏ గ్రామానికి వెళ్లినా ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి మరీ రాసిన రాతలు మనం చూశాం. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది. గట్టిగా రెండు చేతులెత్తి చెప్పండి. చంద్రబాబు ఆ హామీలు ఇచ్చారా..లేదా? రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేవా...కాదా? చెప్పండి (ప్రజలంతా చేతులు పెకైత్తి... అవును, అవును అంటూ ప్రతి స్పందించారు).

ఏ టీవీ ఆన్ చేసినా డ్వాక్రా  రుణాలన్నీ మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ప్రకటనలు వినిపించాయా...లేవా? జాబు కావాలంటే బాబు రావాలని అన్నారా లేదా? ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారా.. లేదా? చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు.. అవునా? కాదా? చేనేతలందరికీ లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారా..లేదా? ప్రతి చేనేత కార్మికునికి ఒక ఇల్లు, ఒక షెడ్డు కట్టిస్తానన్నారు.. అవునా? కాదా? (అని జగన్ ప్రశ్నించినప్పుడు చేనేత కార్మికుల నుంచి అవును..అవును అనే సమాధానం వచ్చింది.) మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా..వీటిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా’ అని  జగన్ మళ్లీ ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల నుంచి లేదు..లేదు..అంటూ గట్టిగా కేకలు వినిపించాయి.
Share this article :

0 comments: