మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు

మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు

Written By news on Saturday, January 9, 2016 | 1/09/2016


మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు
♦ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆత్మబంధువులను కలుసుకున్నాం   
♦ తెలంగాణలో పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా షర్మిల
♦ నిజామాబాద్ జిల్లా పోతంగల్ కలాన్‌లో పైలాన్‌కు శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పావురాల గుట్టలో జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. మాట తప్పని, మడప తిప్పని వైఎస్ కుటుంబం.. ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందన్నారు. ‘‘ఎంత కష్టమొచ్చినా.. ఎంత నష్టం జరిగినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న సంతృప్తి, సంతోషం మా సొంతం. ఎంత దూరమైనా, ఎంత మారుమూలన ఉన్నా ప్రతి గడపను వెతుక్కుంటూ వెళ్లాం. ప్రతి కుటుంబాన్ని పరామర్శించాం..’’ అని పేర్కొన్నారు.

వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక 750 మంది మృతి చెందగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 494 కుటుంబాలను పరామర్శించారు. అనంతరం తెలంగాణలో షర్మిల 55 రోజులపాటు 8,510 కిలోమీటర్లు పరామర్శ యాత్ర చేపట్టి 256 కుటుంబాలను కలిశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం పోతంగల్ కలాన్‌లో పరామర్శ యాత్ర ముగించా రు. ఈ సందర్భంగా షర్మిల.. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొండా రాఘవరెడ్డితో కలసి వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి స్మారకార్థం ఇడుపులపాయలో నిర్మించిన తరహాలో నిర్మించనున్న పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

ఆ మాటకు కాంగ్రెస్ రాజకీయ రంగు
‘‘వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలకు పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగనన్న మాటిచ్చారు. అది వైఎస్‌కు కొడుకు హోదాలో ఇచ్చిన మాట. కానీ దానికి కాంగ్రెస్ రాజకీయ రంగు పూసింది’’ అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా కుటుంబమంతా స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలసి.. ఓదార్పు యాత్ర చేస్తామని వేడుకొన్నాం. కానీ వీల్లేదన్నారు.. బెదిరించారు. అయినా చనిపోయిన వారి కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న మా  కుటుంబ సంకల్పం చెక్కుచెదరలేదు. అందుకు కాంగ్రెస్ వాళ్లు టీడీపీతో కలసి జగనన్న మీద కేసులు పెట్టారు. చార్జిషీట్లు వేశారు. 16 నెలలు జైల్లో పెట్టారు.

ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుకొంటూనే ఉన్నారు. కానీ ఈ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో 750 కుటుంబాలను పరామర్శించాం. వారి బాధలో పాలుపంచుకొని, వారి త్యాగాన్ని, అభిమానాన్ని గుర్తించాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను వెళ్లిన ప్రతి పల్లె, ప్రతి వాడలో ఆప్యాయంగా స్వాగతం పలికారు’’ అని షర్మిల వివరించారు.

 వైఎస్ ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు
 దివంగత రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని షర్మిల చెప్పారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 పథకాల్లో ఆయన జీవించే ఉంటారన్నారు. దళితులకు 23 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. జలయజ్ఞం ద్వారా 25 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారన్నారు. పేదలకు 45 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారన్నారు. ‘‘వైఎస్ చనిపోయి ఆరేళ్లు అయినా ఈనాటికీ  ఆయన పథకాలను అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయంటే ఆ పథకాల్లో  ఎంతో గొప్పతనం ఉంది. అందుకే అంటున్నా.. వైఎస్‌కు మరణం లేదు’’ అని చెప్పారు.

 వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
 వైఎస్ మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలను కలుసుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. ‘‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక 750 మంది చనిపోయారు. అది సామాన్యమైన విషయం కాదు. నాన్నను ప్రాణం కంటే మిన్నగా అభిమానించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్ కుటుంబం శిరస్సు వంచి, చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది’’ అని షర్మిల అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, నాయుడు ప్రకాశ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మెరక శ్రీధర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సాయినాథ్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, డాక్టర్ కె.నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ముగిసిన పరామర్శ యాత్ర
వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. 2014 డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ నుంచి మొదలైన పరామర్శ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. 55 రోజులపాటు 8,510 కిలోమీటర్ల మేర ప్రయాణించి 256 కుటుంబాలను కలిసిన ఆమె.. శుక్రవారం పోతంగల్ కలాన్‌లో పరామర్శ యాత్రను ముగించారు. యాత్ర చివరి రోజున జిల్లాలో షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. కోటగిరి మండలం పోతంగల్‌లో గౌరు నడిపి వీరయ్య, గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో నీరడి పోచయ్య, పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కలాన్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్ కోసం చనిపోయినవారి  స్మారకార్థం పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఒక మొక్క నాటారు. ఆ ప్రాంతాన్ని చక్కటి ఆహ్లాదకరమైన పార్కుగా మలుస్తామని చెప్పారు.

షర్మిలకు అభినందనలు: పొంగులేటి
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పరామర్శ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి షర్మిలకు అభినందనలు తెలిపారు. మండుటెండలు.. చలి.. జోరువానలు సైతం లెక్కచేయకుండా ఇచ్చిన మాట కోసం షర్మిల తమ ఆత్మబంధువులను కలిశారన్నారు. తెలంగాణలో మొదటిసారి ఓదార్పు యాత్ర కోసం వరంగల్ వెళ్తే.. వైఎస్ దయాదాక్ష్యిణ్యాలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల సూచనలతో కొన్ని శక్తులు అడ్డుకున్నాయని పొంగులేటి దుయ్యబట్టారు. ఐదు సంవత్సరాలైనా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబాన్ని పరామర్శించారన్నారు. మహానేత కుటుంబానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి జగన్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు
Share this article :

0 comments: