రోజాపై సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజాపై సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం: వైఎస్ జగన్

రోజాపై సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం: వైఎస్ జగన్

Written By news on Tuesday, January 12, 2016 | 1/12/2016


రోజాపై సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం: వైఎస్ జగన్
హైదరాబాద్‌: నగరి ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించిన అంశంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన లేఖలో పేర్కొన్నారు. (లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)

నిబంధన 340 ప్రకారం రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించారని, కానీ ఈ నిబంధన ప్రకారం సభ్యుడిని ఒక సెషన్ మాత్రమే సస్పెండ్ చేయడానికి వీలు ఉంటుందని ఆయన తెలిపారు. సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే సభలో కచ్చితంగా ఓటింగ్ నిర్వహించాలని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశాలను పరిశీలించి రోజాపై సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కితీసుకోవాలని లేఖలో స్పీకర్‌ను వైఎస్ జగన్‌ కోరారు.
ఆంగ్లంలో రాసిన ఈ ఆరు పేజీల లేఖలో నిబంధన 340 గురించి సవివరంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. నిబంధన 340 కింద చేపట్టే ప్రతి తీర్మానంపై స్పీకర్ తప్పనిసరిగా ఓటింగ్ చేపట్టాల్సి ఉంటుందని, ఆ తీర్మానం ప్రకారం సభ్యుడిపై వేసే సస్పెన్షన్ కాలపరిమితి.. ఆ సభ సమావేశాల గడువుకు మించి ఉండరాదని తెలిపారు. బిజినెస్‌ రూల్స్ ప్రకారం ఈ తీర్మానాన్ని చేపట్టాల్సి ఉంటుందని, ఒకవేళ సభలోని 100శాతం సభ్యులు కోరిన సందర్భంలోనూ ఓటింగ్ లేకుండా ఈ తీర్మానాన్ని ఆమోదించడం చట్టవిరుద్ధం అవుతుందని వైఎస్ జగన్‌ లేఖలో స్పష్టం చేశారు. 2015 డిసెంబర్ 18న నిబంధన 340, సబ్‌రూల్ కింద శాసనసభ వ్యవహారాల మంత్రి ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించాలని తీర్మానం ప్రవేశపెట్టారని, నిజానికి ఈ నిబంధన కింద జరుగుతున్న సమావేశాల గడువు వరకే సస్పెన్షన్ విధించే అవకాశముందని తెలిపారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించాల్సి ఉండాల్సిందని పేర్కొన్నారు. కానీ ఈ తీర్మానాన్ని ఆమోదించడం దురదృష్టకరం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే 'బ్లాక్ డే' అని వైఎస్ జగన్‌ లేఖలో అన్నారు.

ఈ తీర్మానం విషయంలో తాము చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే శాసనసభ వ్యవహారాల మంత్రి అసెంబ్లీయే సుప్రీమని, బిజినెస్ రూల్స్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారని చెప్పారు. 1994-99 మధ్యకాలంలో ఐదేళ్లు ఏపీ స్పీకర్‌గా పనిచేసిన ఆ మంత్రి ఈ విషయంలో నిబంధనలు అసంబద్ధమైనవని ఎలా అనగలరు? అంటూ ప్రశ్నించారు. అలాగైతే నిబంధనలు ఉన్నాయి ఎందుకు? లోక్‌సభలోనూ నిబంధనలు ఎందుకు పెట్టారు? ఉల్లంఘించడానికే నిబంధనలు తీసుకొచ్చారా? అని లేఖలో వైఎస్ జగన్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 లేదా ఆర్టికల్ 118 ప్రకారం బిజినెస్ రూల్స్ మేరకు నడుచుకుంటాయని లేఖలో తెలిపారు. ఈ  సందర్భంగా లోక్‌సభకు సంబంధించిన పలు బిజినెస్ రూల్స్ ను ఆయన లేఖలో ప్రస్తావించారు.

బిజినెస్ రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తూ పక్షపాత రహితంగా అసెంబ్లీ సమావేశాలు నడిపించాల్సిన అవసరముందని, ప్రస్తుతమున్న నిబంధనలు సమగ్రంగా లేవని భావిస్తే.. ఆ విషయాన్ని రూల్స్ కమిటీకి నివేదించి.. అవసరమైన సవరణలు తీసుకువచ్చి.. ఆ వివరాలను సభ్యులందరికీ తెలియజేయాలని, నిబంధనలను సమర్థంగా అమలుచేయాలని వైఎస్ జగన్ స్పీకర్‌ను కోరారు. అంతేకాని ఏపీ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ అసంబద్ధమని పేర్కొనడం చట్టబద్ధ పాలనను విస్మరించడమే అవుతుందని, అలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని జగన్ పేర్కొన్నారు.

'ఏపీఎల్ఏ బిజినెస్ రూల్స్‌లోని 340 (2) నిబంధనను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ నేను 2015 డిసెంబర్ 19న మీకు లేఖ రాశాను. ప్రస్తుత లేఖ ద్వారా వెలుగులోకి తెచ్చిన అంశాలన్నింటినీ పరిశీలించి.. బిజినెస్ రూల్స్‌ను గౌరవించి శ్రీమతి రోజాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మరోసారి మిమ్మల్ని కోరుతున్నారు. 340 (2) నిబంధన ప్రకారం రోజాపై విధించిన సస్పెన్షన్ ఆ నిబంధనకే విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం' అని లేఖలో స్పీకర్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: