వేధింపులకు బెదరం... పోరాటం ఆపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వేధింపులకు బెదరం... పోరాటం ఆపం

వేధింపులకు బెదరం... పోరాటం ఆపం

Written By news on Sunday, January 24, 2016 | 1/24/2016


వేధింపులకు బెదరం... పోరాటం ఆపం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం తమ ప్రజాప్రతినిధులపై సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు, వేధింపులకు బెదిరేది లేదని, అధికారపక్షం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రావు సుజయ్‌కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించడాన్ని, మిథున్‌రెడ్డిని జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
తన తప్పుల్ని, ప్రజావ్యతిరేక విధానాల్ని ఎత్తిచూపిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని అణచివేయాలని అధికారపక్షం చూస్తోందని మండిపడ్డారు. చెవిరెడ్డిపై ఐదు రోజుల వ్యవధిలో నాలుగు కేసుల్ని తెరమీదకు తెచ్చి వరుసగా అరెస్టులకు పూనుకోవడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. గోడలపై రాతలు రాసినందుకు, సమైక్యాంధ్ర ఉద్యమం చేసినందుకు, ప్రత్యేక హోదాపై విలేకరుల సమావేశం పెట్టినందుకు, స్కూలులో సమావేశం నిర్వహించినందుకు... ఇలాంటి చిన్న విషయాలకే కేసులు, అరెస్టులు చేయడమనే అప్రజాస్వామిక సంస్కృతికి చంద్రబాబు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
నెల్లూరు జైలులో జ్వరం, పంటి నొప్పితో బాధపడుతున్న భాస్కర్‌రెడ్డిని తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించాలని వైద్యులు సూచిస్తే ఆయన్ను రాజమహేంద్రవరానికి కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రతిపక్షాల పట్ల టీడీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నదో చెప్పడానికి ఈ ఉదంతాలే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే వాళ్లను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం ఎపుడూ జరగలేదన్నారు. ఈ చర్యలద్వారా తమను భయభ్రాంతుల్ని చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని, అయితే తాము ఏమాత్రం వెరవబోమని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడమేగాక ఆమెను ఈ కాలమంతా సభ్యురాలు కాదని అధికారులకు ఆదేశాలిచ్చారని రంగారావు విమర్శించారు. ఈ వేధింపులను పార్టీపరంగా తామంతా కలసికట్టుగా ఎదుర్కొంటామని చెప్పారు.
Share this article :

0 comments: