వైఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి

వైఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి

Written By news on Thursday, January 7, 2016 | 1/07/2016


'వైఎస్‌ఆర్ పథకాలు బతికించుకుందాం'
     ► రాజన్న రాజ్యం సాధించుకుందాం.. గ్రేటర్ పరామర్శ యాత్రలో షర్మిల
     ► వైఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి
     ► నగరాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు

సాక్షి, హైదరాబాద్: ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన పథకాలను బతికించుకొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం సాధించుకుందామని పేర్కొన్నారు. వైఎస్ హయాంలోనే హైదరాబాద్ మహానగరం అభివృద్ధి వైపు పరుగులు తీసిందని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రోరైలు.. ఇలా అన్నీ ఆ మహానేత చేసినవేనని చెప్పారు.

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను కలిసేందుకు బుధవారం రెండోరోజు షర్మిల గ్రేటర్ హైదరాబాద్‌లో పరామర్శ యాత్ర నిర్వహించారు. ఏడు కుటుంబాలను పరామర్శించారు. రాజన్న బిడ్డను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. బస్తీలు, కాలనీలు. జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. ఈ సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్ కోణార్క్ సెంటర్ వద్ద ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. మహా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వైఎస్ అహర్నిశలు శ్రమించారన్నారు. ఆయన హయంలోనే నగరంలో నీటి సరఫరా పరిస్థితి మెరుగైందని, కృష్ణా, గోదావరి జలాలను సిటీకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
 
జనం నుంచి పుట్టిన నేత
వైఎస్సార్ జనం నుంచి పుట్టిన నేత అని, అందుకే ప్రజల బాధలను తన బాధలుగా చూశారని షర్మిల అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేశారని చెప్పారు. ‘‘హైదరాబాద్‌కు ఐటీ రంగాన్ని తెచ్చానంటూ చంద్రబాబు వంటి కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి ఐటీ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఉమ్మడి ఏపీ.. ఆయన దిగిపోయే సమయానికి ఐదో స్థానానికిపడిపోయింది. కానీ వైఎస్సార్ హయాంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఎగుమతులు 9 నుంచి 14 శాతానికి పెరిగాయి.

దేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఐదేళ్లలో 46 లక్షల పక్కా గృహలు నిర్మిస్తే.. మన రాష్ట్రంలో వైఎస్సార్ ఒక్కరే 46 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆయన బతికి ఉంటే ప్రతి పేదవాడికి రాజీవ్ గృహకల్ప ద్వారా ఇల్లు వచ్చేది..’’ అని అన్నారు. అన్నదాతలకు రుణమాఫీ, ఆడపడుచులకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు తెచ్చారన్నారు. గత పాలకులు యూజర్ చార్జీలతో వైద్యాన్ని దూరం చేస్తే.. వైఎస్ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని చెప్పారు. నేడు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 కుయ్ కుయ్‌మంటూ వస్తోందంటే అది వైఎస్ కృషేనని తెలిపారు.
 
అడుగడుగునా జన నీరాజనం 
రాజన్న తనయకు జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. పలుచోట్ల తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. తొలుత లోట్‌స్‌పాండ్ బయల్దేరిన షర్మిల.. సికింద్రాబాద్, ఉప్పల్,చర్లపల్లి, నాచారం, చిలుకానగర్, రామంతాపూర్, చర్చి కాలనీ, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల మీదుగా 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఏడుగురి కుటుంబాలను కలిశారు. మాణికేశ్వర్‌నగర్ బొడ్రాయివీధిలో బొంత సత్తయ్య, గోదాసు నర్సమ్మ కుటుంబాలను పరామర్శించారు. తర్వాత చర్లపల్లి భరత్‌నగర్‌లో ఇంద్రాల బాలయ్య, ఉప్పల్‌లో కుంట ల క్రిష్ణ, రామంతాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఒగ్గు అంజయ్య, అక్కడే చర్చి కాలనీకి చెందిన నయల పోగుల యాదగిరి, ఎల్బీనగర్‌లో షాపురి శంకర్ కుటుంబాలను పరామర్శించారు. పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పార్టీ నగర నేతలు ఆదం విజయ్ కుమార్, జి.సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, బంగి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి నిజామాబాద్‌లో పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురువారం నుంచి రెండు రోజులు నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 19 మంది తనువు చాలించారు. వీరిలో మొదటి విడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను కలిశారు. రెండో విడతలో భాగంగా గురు, శుక్రవారాల్లో మిగిలిన ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. మొదటిరోజు నాలుగు, మరుసటి రోజు మూడు కుటుంబాలను కలుసుకుంటారు. వైఎస్ కోసం అసువులు బాసిన వారి స్మారకార్థం గాంధారి మండలం పోతంగల్ కలాన్ సమీపంలో శుక్రవారం పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Share this article :

0 comments: