న్యాయం జరిగే వరకూ పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయం జరిగే వరకూ పోరాటం

న్యాయం జరిగే వరకూ పోరాటం

Written By news on Thursday, January 21, 2016 | 1/21/2016


న్యాయం జరిగే వరకూ పోరాటం
- రోహిత్ ఆత్మహత్యపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- వీసీ పరిష్కరించాల్సిన సమస్యలో కేంద్రమంత్రుల జోక్యమేమిటి?
- కేంద్ర మంత్రులు, వీసీ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి
- సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలి
- వర్సిటీలో సాంఘిక బహిష్కరణ విచారకరం
- విద్యార్థి ప్రాణమే పోయింది.. ఇక ఎస్సీనా, బీసీనా అన్న వివాదమేమిటి?
- విద్యార్థుల ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ అధినేత
 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు, వీసీ సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై సస్పెన్షన్ ఉపసంహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఈ పోరాటంలో విద్యార్థుల వెంటే తాముంటామని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన హెచ్‌సీయూను సందర్శించి, ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘హెచ్‌సీయూలో విద్యార్థుల సాంఘిక బహిష్కరణ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. రోజుకు రూ.150 సంపాదిస్తూ, బిడ్డల్ని ఉన్నత హోదాలో చూడాలనుకున్న ఓ తల్లి కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది’ అన్నారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి...
‘‘వర్సిటీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ప్రధాన ముద్దాయి వీసీ సహా బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలి. ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సాంఘిక బహిష్కరణ జరిగిందంటే మనమెలాంటి సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. క్యాంటీన్, లైబ్రరీ ఉపయోగించనీయకుండా, అసలు హాస్టల్‌లోనే ఉండకుండా సాంఘిక బహిష్కరణ విధించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా యూనివర్సిటీలలో సాంఘిక బహిష్కరణలు కొనసాగడం విచారకరం. వేలాదిమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను అందించిన హెచ్‌సీయూలో ఇది జరగడం సిగ్గుచేటు. రోహిత్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలి. రోహిత్ తల్లికి, సోదరుడికి చేయూతనివ్వాలి.
 
న్యాయం కోసం ఎందాకైనా పోరాడదాం
విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. వారికి ఏ విధమైన సహకారం ఇచ్చేందుకైనా మా పార్టీ సిద్ధం. ఈ అంశాన్ని మా పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారు. రోహిత్‌ను అతని తల్లి ఒక ఐఏఎస్, ఐపీఎస్‌గా గానీ, సైంటిస్టుగా గానీ చూడాలనుకొంది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలను వీసీ నివారించాల్సింది. సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా ఒక తండ్రిలా పరిష్కరించాల్సింది. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్ద సమస్యగా మారింది. కొందరు విద్యార్థులపై చర్య తీసుకోవాలంటూ ఒక కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాసేంత పెద్ద సమస్యగా మారింది. దీనిని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా చెప్పవచ్చు. ఆ కుర్రాడు పీహెచ్‌డీ స్కాలర్. జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో చదువుకుంటున్నాడు. కేంద్ర మంత్రి మరో కేంద్ర శాఖ హెచ్‌ఆర్‌డీకి లేఖ రాయగా ఆ శాఖ వీసీకి ఐదు సార్లు లేఖలు రాసింది. కుర్రాళ్లను జాతి వ్యతిరేకులు, సంఘ వ్యతిరేకులని, కులోన్మాదులని పేర్కొంటూ, వారి మీద చర్య తీసుకోవాలని కోరింది!
 
విచారణ కమిటీలో వీసీనా..?
వీసీ కేంద్రమంత్రుల ఒత్తిడికి తలొగ్గి దళిత విద్యార్థులను సస్పెండ్ చేయటం సిగ్గుచేటు. యూనివర్సిటీ ఘటనలపై వేసిన కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్లు శ్రీవాత్సవ, మహంతి (గతంలో దళిత విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులు), వీసీ అప్పారావును (ఈయన చీఫ్ వార్డెన్‌గా ఉండగా 10 మంది దళిత విద్యార్థులను బహిష్కరించారు) నియమించడం దిగ్భ్రాంతికరం. ఇప్పుడు రోహిత్ ఎస్సీనా, బీసీనా అన్న చర్చ తీసుకువస్తున్నారు. రోహిత్ ఎస్సీ వర్గానికి చెందిన వాడిగా పేర్కొంటూ మీ-సేవ ద్వారా ఇచ్చిన కులధృవీకరణపత్రం ఇదిగో... మళ్లీ దీనిని నేడో, రేపో బీసీగా మార్చి చూపినా ఆశ్చర్యంలేదు. అయినా ఎస్సీ అయితే ఏమిటి, బీసీ అయితే ఏమిటి? ఒక రీసెర్చ్ స్కాలర్ చనిపోయాక కులం పేరుతో రాద్ధాంతం చేయడమెందుకు? రోహిత్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు మనం ప్రతి మనిషిని కులంపేరుతో అంచనా వేస్తున్నాం. వారికీ మనసుంటుందని మర్చిపోతున్నాం. ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?
 
హృదయంతో స్పందించాల్సిన సమయం
విద్యార్థుల ఆశలు నెరవేర్చేవిగా విద్యాసంస్థలుండాలి. విద్యార్థులు నిర్భయంగా విద్యాభ్యాసం చేసే పరిస్థితులుండాలి. అలా ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. వర్సిటీ నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలలో మంత్రి జోక్యం, విద్యార్థులపై చర్యలకు సిఫార్సుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మంత్రులు తమ చర్యలను సమర్థించుకోగలరా? ఒక రాజకీయ నాయకుడిగా చెప్పాలంటే ఈ వర్సిటీకి రావడం నాకిష్టం లేదు. ఎందుకంటే జగన్ వచ్చాడంటే ఆయన ప్రత్యర్థి పార్టీ వాళ్లు వస్తారు. మరొకరు వస్తారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.  అందరూ హృదయంతో స్పందించాల్సిన సమయం కాబట్టి ఇప్పుడు నేనొచ్చాను. నాయకులుగా ఉన్న మేం జరిగిన అన్యాయంపై మాట్లాడకపోతే వీటికి అంతుండదు. ఈ అన్యాయాన్ని ఇకనైనా ఆపాలన్న ఆశతోనే, ఆ విద్యార్థికి మద్దతుగా నేను ఇక్కడికి వచ్చాను’’.
 
విద్యార్థుల దీక్షలకు జగన్ సంఘీభావం
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు పరిహరం అందివ్వాలని, సిటీలో ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలోని వెలివాడలో  ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, గుజ్జు ఉమామహేశ్వరరావ్, వైఖరి, కొణిదెల జయరావ్, కె.క్రిష్ణయ్య, టి.రమేశ్‌లతో జగన్ మాట్లాడారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. తమపై సస్పెన్షన్ ఎత్తేయాలని 17 రోజులుగా డిమాండ్ చేస్తున్న విద్యార్థులు శేషయ్య, విజయ్‌కుమార్, ప్రశాంత్, సుంకన్నల వెలివాడ దీక్ష శిబిరాన్ని కూడా జగన్ సందర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
తొలుత ఆ ప్రాంగణంలోనే ఆయన అంబేద్కర్, రోహిత్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. జగన్ వెంట ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, డాక్టర్ ఎం అరుణ్ కుమార్, తెలంగాణ అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: