అక్రమ మైనింగ్ నిజమే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అక్రమ మైనింగ్ నిజమే!

అక్రమ మైనింగ్ నిజమే!

Written By news on Tuesday, January 5, 2016 | 1/05/2016


యరపతినేని అక్రమ మైనింగ్ నిజమే
టీడీపీ ఎమ్మెల్యే మైనింగ్‌పై హైకోర్టుకు ఏపీ సర్కార్ నివేదన
ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు ఆదేశం


 సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అతని అనుచరులు అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, రవాణా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవముందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అక్రమ మైనింగ్ చేస్తున్నారని తేలినప్పుడు బాధ్యులపై ఎందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అతని అనుచరులు అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, రవాణా చేస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో రాయల్టీ ఎగవేస్తున్నారని, వీరిని అరెస్ట్ చేయడంతోపాటు అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిడుగురాళ్లకు చెందిన కుందుర్తి గురవాచారి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రాజగోపాల్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే యరపతినేని  చాలా పలుకుబడి ఉన్న వ్యక్తని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... మైనింగ్ చేస్తున్న వారికి లెసైన్స్ ఉందా? అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్‌ను ప్రశ్నించగా తగిన సమాధానం రాలేదు. దీనిపై ధర్మాసనం స్పంది స్తూ... ‘మీరు ఇలా నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుంటారు.. వారు అలా తవ్వేసుకుంటూ పోతారు.

ఇది ఒక రకంగా అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించడమే అవుతుంది’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని, దీనిని అడ్డుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని కృష్ణప్రకాశ్ తెలిపారు. అడ్డుకుంటున్న అధికారులను రకరకాలుగా బెదిరిస్తున్నారని, ఎస్‌సీ, ఎస్‌టీ కేసులు పెడుతామంటున్నారని ఆయన వివరించారు. దీనికి ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందిస్తూ... ‘ఇవన్నీ మాకెందుకు? మీరు అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో మాకు చెప్పండి. అరెస్ట్ చేయడం.. ప్రాసిక్యూట్ చేయడం.. ఇలా చట్ట ప్రకారం ఏం చేయాలో అవి చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే, అఫిడవిట్ ద్వారా అదే విషయాన్ని చెప్పండి’ అని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఓ నివేదికను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

http://www.sakshi.com/news/andhra-pradesh/it-is-true-that-illegal-mining-of-yarapathineni-302902
Share this article :

0 comments: