కలసికట్టుగా పోరాడదాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కలసికట్టుగా పోరాడదాం..

కలసికట్టుగా పోరాడదాం..

Written By news on Thursday, January 28, 2016 | 1/28/2016


పచ్చి మోసగాడితో పోరాటం
చంద్రబాబు ఒక అబద్ధాలకోరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పారు.. అధికారంలోకి వచ్చాక మోసగించారు
 కలసికట్టుగా పోరాడదాం..
బాబు దుష్టపాలనకు చరమగీతం పాడదాం
 వైఎస్సార్ సీపీలోకి మాజీ మంత్రి ముత్తా,  మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యువనేత శశిధర్


 రాష్ట్రంలో ఇప్పుడు అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక నుంచి బొగ్గు వరకు.. బొగ్గు నుంచి మద్యం షాపుల వరకు అవినీతే. జీవో 22 పేరు చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర  దండుకున్నారు. కమీషన్ల కోసమే పట్టిసీమ కడుతున్నారు. ఇలా ప్రతి విషయంలో అవినీతే. లంచాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు.

సాక్షి, కాకి నాడ: ‘‘ఈవాళ మనం ఒక అబద్ధాలకోరు, ఓ పచ్చి మోసగాడితో పోరాటం చేస్తున్నాం. ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నిలువునా మోసగించిన చంద్రబాబుపై చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ర్టంలో ఏ సామాన్యుడి దగ్గరకు వెళ్లి అడిగినా చంద్రబాబు మాటలు నమ్మి ఎలా మోసపోయామో చెబుతారని తెలిపారు. ‘‘చంద్రబాబు పాలనంతా మోసం... మోసం.. మోసం. అందరూ ఒక్కటై పోరాడితేనే ఈ దుష్ట పాలనకు చరమగీతం పాడగలం’’ అని చెప్పారు.

మాజీ మంత్రి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీలో చేరిన సందర్భంగా కాకినాడ జేఎన్‌టీయూకే ఎదురుగానున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబు
ఈరోజు చంద్రబాబు పాలన ఎలా ఉందని ఏ సామాన్యుడి దగ్గరకు వెళ్లి అడిగినా దుమ్మెత్తి పోస్తున్నారు. బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడని రైతులు మండిపడుతున్నారు. 18 నెలలైనా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓటేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్న ప్రచారాన్ని నమ్మి ఓటేస్తే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తాడని ఓటేస్తే ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.

 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడిపై ప్రేమ చూపించి, చంద్రబాబుకు ఓటేయలేదని తమ పింఛన్లు ఊడబెరికే ఆలోచన చేస్తున్నారని అవ్వాతాతలు వాపోతున్నారు. ప్రజలతో సంబంధంలేని వ్యక్తులతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు తమ పింఛన్లపై కోత వేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రెండేళ్లయినా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించలేదని, గతంలో రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.600 వస్తుందని అక్కా చెల్లెమ్మలు చెబుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇటువంటి దుర్మార్గపు పరిపాలనపై నిప్పులు చెరుగుతుంటే... చంద్రబాబు మాత్రం ‘నేను అందరికీ మంచి చేశాను. రుణాలన్నీ మాఫీ చే సేశాను. అక్కాచెల్లెమ్మలు కేరింతలు కొడుతున్నారు’ అని ఏరోజుకారోజు కొత్త కొత్త అబద్ధాలు చెబుతూ పరిపాలన సాగిస్తున్నారు. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందంటే... రబీ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా గోదావరి జిల్లాల్లో రైతులు నాట్లు వేసే పరిస్థితి లేదు.

 రాష్ట్రంలో ఇప్పుడు అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక నుంచి బొగ్గు వరకు, బొగ్గు నుంచి మద్యం షాపుల వరకు అవినీతే. జీవో 22 చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దండుకున్నారు. కమీషన్ల కోసమే పట్టిసీమ కడుతున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ, ప్రతి అడుగులోనూ అవినీతే. అడుగడుగునా లంచాలు తీసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. ఇటువంటి మాట తప్పే ప్రభుత్వం.. మోసపూరిత ప్రభుత్వం. దీనిపై మనమంతా కలసికట్టుగా పోరాడి ఇంటికి సాగనంపాలి. మీ అందరి దీవెనలు, చల్లని ఆశీస్సులు వైఎస్సార్ సీపీపై చూపండి.
కో ఆర్డినేటర్లుగా శశిధర్, కన్నబాబు
మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యత తీసుకుంటారు. కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి బాధ్యత తీసుకుంటారు. ముత్తా శశిధర్ కాకినాడ సిటీకి సంబంధించి కో ఆర్డినేటర్‌గా బాధ్యత తీసుకుంటారు. తాను కూడా చంద్రశేఖరరెడ్డితో కలిసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారు. వేణు, చంద్ర వైఎస్సార్‌సీపీ కుటుంబంలోని సభ్యులు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. రాబోయే రోజుల్లో వారిద్దరికీ మేలు చేసే బాధ్యత నాది.

 సభలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, కంబాల జోగులు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, రెడ్డి శాంతి, కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ రాష్ర్ట బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, సాగి దుర్గాప్రసాద్‌రాజు, గొల్ల బాబూరావు, రౌతు సూర్యప్రకాశరావు,పెండెం దొరబాబు, సూరిబాబురాజు, అల్లూరి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

 సైనికుడిలా పనిచేస్తా
కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే
రాష్ట్ర విభజనతో ప్రతి తెలుగువాడి గుండె రెండు ముక్కలైంది. అందుకు కారణమైన కాంగ్రెస్ తరఫున పోటీ చేయకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన నాకు మీరంతా మద్దతుగా నిలిచారు. మీ అనుమతితో, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా. జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో సైనికుడిలా పనిచేస్తా.

 జగన్ పోరాట యోధుడు
ముత్తా గోపాలకృష్ణ, మాజీ మంత్రి
అమరావతి పేరుతో చంద్రబాబు బాహుబలిని మించిన సినిమా చూపిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు.  జగన్ పోరాటయోధుడు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కాకినాడలో ఇకపై వచ్చే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీని గెలిపించుకుంటామని ముత్తా శశిధర్ చెప్పారు.
Share this article :

0 comments: