ఏ కష్టమొచ్చినా మేమున్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ కష్టమొచ్చినా మేమున్నాం

ఏ కష్టమొచ్చినా మేమున్నాం

Written By news on Monday, January 4, 2016 | 1/04/2016


ఏ కష్టమొచ్చినా మేమున్నాం
మెదక్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల
♦ తొలిరోజు మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలకు పరామర్శ
♦ అధైర్య పడొద్దంటూ కుటుంబీకులకు భరోసా
♦ బాగా చదువుకోవాలంటూ పిల్లలకు సూచన
♦ బోనాలు, బతుకమ్మలతో ఆత్మీయ స్వాగతం పలికిన జనం

 సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్/కొండపాక/చిన్నకోడూరు: ‘‘మీకు అండగా జగనన్న ఉన్నాడు.. ఏ కష్టం వచ్చినా నేనున్నా. ధైర్యం కోల్పోవద్దు..’’ అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబీకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల భరోసానిచ్చారు. ఆ కుటుంబాలను అక్కున చేర్చుకొని ఆత్మస్థైర్యం నింపారు. కుటుంబ సభ్యులను పేరుపేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆదివారం మెదక్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి షర్మిల పరామార్శ యాత్ర ప్రారంభించారు. వైఎస్ మరణంతో గుండె పగిలి చనిపోయినవారి కుటుంబాల పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ‘బాగా చదువుకోవాలమ్మా..’ అని వారికి చెప్పారు. రాజన్న బిడ్డ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పటం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వారు పొంగిపోయారు.

 ఆప్యాయత పంచుతూ... ధైర్యం చెబుతూ...
 వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబీకులను షర్మిల ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబర్‌పేటలో మన్నె జయమ్మ భర్త నాగమల్లేష్, కుమారులు సందీప్, మనోజ్‌కుమార్, మామ సాయిలును పలకరించగా వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘‘మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రెక్కల కష్టమే ఆధారం. పని సరిగ్గా దొరక్క తాత్కాలికంగా అల్వాల్‌లో ఉంటున్నం. పిల్లల్ని అక్కడే ప్రభుత్వ బడిలో చదివిస్తున్నా’’ అని షర్మిలతో నాగ మల్లేష్ చెప్పారు. అందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘మంచిరోజులొస్తాయి.. బాధ పడకండి.. పిల్లలూ మీరు మంచిగా చదువుకోవాలి.. మంచి పేరు తెచ్చుకోవాలి’’ అని సూచించారు.

మర్పడగలో శకుంతల మరణంతో మేనమామ, మేనత్తల వద్ద ఆశ్రయం పొందుతున్న ఆమె పిల్లలు పూజ(12), గణేష్(15)లను షర్మిల ఓదార్చారు. ఈ సందర్భంగా తల్లి మరణంతో దిక్కులేని వారిగా మారామంటూ పూజ బోరున విలపించింది. ఆ చిన్నారి బాధను చూసి షర్మిల చలించిపోయారు. దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ‘‘దుఃఖం వద్దు.. బాగా చదువుకోండి. కష్టాలకు కుంగిపోవద్దు. మీకు మేమున్నాం’’ అంటూ భరోసానిచ్చారు. మాటిండ్లలో వజ్రవ్వ కుమారులు బాల్‌నర్సు, రాజులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాము అన్ని విధాల ఆదుకుంటామని, పిల్లల చదువుకు సహకరిస్తామని మాటిచ్చారు.

పరామర్శయాత్రలో షర్మిల వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీశ్వ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, కొమ్మెర వెంకట్‌రెడ్డి, ఏపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి, తెలంగాణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయ తదితరులు ఉన్నారు.

 ఆత్మీయ స్వాగతం పలికిన జనం
 తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా షర్మి ల గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల పరిధిలోని 200 కిలోమీటర్లు ప్రయాణించి ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఉదయం 11:10 సమయంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా దండుపల్లికి చేరుకున్న షర్మిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గాల్లో షర్మిల ఎక్కడివెళ్లినా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మలు, ఊరేగింపులు, మంగళహారతులు, డప్పుల చప్పుళ్లు, బాణసంచా మోతలతో ఆహ్వానించారు. షర్మిల మొదట వర్గల్ మండలం అంబర్‌పేటలో మన్నె జయమ్మ కుటుం బాన్ని పరామర్శించారు. అనంతరం కొండపాక మండలం మర్పడగలో శ్రీపతి శకుంతల, అదే మండలంలోని బందారంలో నమిలె పోచయ్య, చిన్నకోడూరు మండలం మాటిం డ్లలో కారంకంటి వజ్రవ్వ, దుబ్బాక మండలం పెద్దగుండ్లవల్లిలో బిట్ట ప్రభాకర్, తొగుట మండలం వేములఘాట్‌లో బత్తుల బాలవ్వ, తొగుట మండలం కాన్గల్‌లో గడిల బలరాం కుటుంబాలను పరామర్శించారు.
Share this article :

0 comments: